
పచ్చరంగు మరకత లింగం
సాక్షి, చెన్నై: తంజావూరులోని ఓ వ్యక్తి బ్యాంకు లాకర్‌లో రూ.500 కోట్లు విలువ చేసే పచ్చవర్ణ మరకత(ఎమరాల్డ్) లింగం బయట పడింది. తిరుక్కువలై ఆలయంలో అపహరణకు గురైన ఆ విగ్రహం లాకర్లోకి ఎలా వచ్చిందనే విషయాన్ని తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తంజావూరు అరులానందనగర్‌లోని ఓ ఇంట్లో పురాతన విగ్రహం ఉన్నట్టు చెన్నైలోని విగ్రహాల అక్రమ రవాణా నియంత్రణ విభాగానికి సమాచారం అందింది. దీంతో ప్రత్యేక బృందం శుక్రవారం ఆ ఇంట్లోని అరుణా భాస్కర్‌ను ప్రశ్నించారు.
తమ ఇంట్లో ఏమీ లేవని, తన తండ్రి స్వామియప్పన్ మరణించారని, అంతకుముందు ఆయన వద్ద ఉన్న మరకత లింగం బ్యాంక్ లాకర్‌లో ఉండొచ్చని చెప్పారు. దీంతో బృందం లాకర్‌ను తెరిచి చూశారు. అందులో పచ్చవర్ణ మరకత లింగం బయట పడింది. దీని విలువ రూ.500 కోట్లు ఉంటుందని అంచనా. ఆ విగ్రహం మైలాడుతురై జిల్లా శీర్గాలి సమీపంలోని తిరుక్కువలై శివాలయంలో మూడేళ్ల క్రితం చోరీకి గురైనట్టు తేలింది. దీంతో అధికారులు శనివారం ఆ విగ్రహాన్ని చెన్నైలోని కార్యాలయంలో భద్రపరిచారు.