‘కాలుడు’ అంటే యముడు. యముని పేరు వింటేనే లోకమంతా భయపడుతుంది. అలాంటి మృత్యుదేవతను సైతం భయపెట్టగల మహిమాన్వితుడు శ్రీ కాలభైరవుడు. సంసార బాధలతో సతమతమయ్యేవారు, అనారోగ్యాల బారిన పడ్డవారు, క్షుద్రశక్తుల విజృంభణతో నలిగిపోతున్న వారు శ్రీ కాలభైరవస్వామిని వేడుకుంటే సకల బాధలను హరింపజేసి భక్తులను రక్షిస్తాడని నమ్మకం.
తిరుమలలో ఏవిధంగా అయితే ముందుగా వరాహస్వామిని సందర్శించుకున్న తర్వాతే వేంకటేశ్వరుని పూజిస్తారో, కాశీనగరంలో కూడా అదేవిధంగా క్షేత్ర పాలకుడైన కాలభైరవుని సేవించకుండా చేసిన కాశీయాత్ర నిష్ఫలమని సాక్షాత్తూ శివుడే కాలభైరవుడికి వరమిచ్చినట్లు పురాణోక్తి. మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవాష్టమి. ఈ సందర్భంగా కాలభైరవుడి విగ్రహం లేదా చిత్రపటానికి షోడశోపచార పూజలు చేసి, మినప గారెలను, కల్లును (మిరియాల పొడి వేయని బెల్లం పానకం కల్లుతో సమానమని శాస్త్రోక్తి) నివేదిస్తే కాలభైరవుడు ప్రసన్నుడై, గ్రహదోషాలను రూపుమాపుతాడని, కోరిన వరాలనిస్తాడని ప్రతీతి. కాలభైరవుడి పటం లభించకపోతే శివలింగం ముందు కూర్చుని, కాలభైరవ అష్టకం పఠించవచ్చు. (నేడు కాలాష్టమి)
మానవాళికి గీతాధార
మనిషికి మార్పు చాలా అవసరం. ఆ మార్పు బాహ్యమైనది కాదు – లోపలి మనిషికి సంబంధించినది. ముఖ్యంగా తన ప్రవర్తనలోని ఎన్నో లోపాలను చక్కదిద్దుకోవడం, ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం, సమాజానికి పనికొచ్చే విధంగా తనను తాను కొత్తగా రూపొందించుకోవడం అత్యంతావశ్యకం. ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవడం, ఆలోచనలో అభివృద్ధికరమైనవాటికి ఎక్కువగా చోటుకల్పించడం, సానుకూల దృక్పథాన్ని సాధించడం, ఆత్మన్యూనతాభావాన్ని జయించడం వంటి ఎన్నో అంశాలలో పట్టు సాధించాలి. ఈ అంశాలన్నీ గీతలో కృష్ణుడు ఏనాడో అర్జునుడికి చెప్పాడు.
గీతోపదేశం సందర్భంలో కృష్ణుడు అర్జునుణ్ని యుద్ధానికి సంసిద్ధుణ్ని చేశాడు. ‘‘నువ్వు గొప్ప పరాక్రమవంతుడవని లోకం కీర్తిస్తున్నది. లోకం దృష్టిలో నువ్వు చులకన కాకుండా ఉండాలంటే యుద్ధానికి సిద్ధపడాలి. నా మిత్రులు, నా బంధువులు, నా గురువులు అంటూ యుద్ధం మానేశావనుకోరు – భయం వల్ల పారిపోయావంటారు. ఈ లోకం నిన్ను చులకన చేస్తుంది. శత్రుసైన్యంలోని యోధులంతా నీలోని పరాక్రమాన్ని శంకిస్తారు. నిందిస్తారు. నీకు యుద్ధమే కర్తవ్యం’’ అంటూ అవసరమైనంత మేరకు అర్జునుణ్ణి రెచ్చగొట్టాడు శ్రీకృష్ణుడు. స్వధర్మం పేరుతో అర్జునుడి చేత కర్తవ్యాన్ని నిర్వహింపజేసిన మానసిక నిపుణుడు శ్రీకృష్ణుడు.
కౌరవులను నిర్వీర్యులను చేయడంలోను శ్రీకృష్ణుడు అంతే చాతుర్యం చూపాడు. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడం. ముందుచూపుతో వ్యవహరించడం – వ్యూహాత్మకంగా ముందుకువెళ్లడం, ఎత్తులు వేయడం – వంటి అంశాలలో శిక్షణ ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. కోణాన్ని దృష్టిలో పెట్టుకుని గీతా జయంతి సందర్భంగా శ్రీకృష్ణుడి వ్యక్తిత్వం ఏ స్థాయిదో, వ్యూహరచన ఎంతటిదో, ఆయన నుండి పాండవులకు అందిన స్ఫూర్తిని గ్రహించాలి. వాటి నుండి మనమూ ప్రభావితం కావాలి. మార్గశిర శుద్ధ ఏకాదశికి మోక్షదైకాదశి అని, గీతాజయంతి అనీ పేరు. ఈ వేళ గీతలో కనీసం కొన్ని శ్లోకాలనైనా పఠించి, వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం ఫలదాయకం. (30, గురువారం గీతాజయంతి)
Comments
Please login to add a commentAdd a comment