జి.సిగడాం : కార్తీక శోభనాడు సూర్యకిరణాలు శివలింగంపై ప్రసరించడంతో భక్తులు పరవశించిపోయారు. ఈ అరుదైన దృశ్యం శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకయ్యపేట పంచాయతీలో ఉమారుద్ర కోటీశ్వర దేవాలయంలో దర్శనమిచ్చింది. ఆదివారం ఉదయం 6.15 గంటల నుంచి 6.45 గంటల వరకు సూర్యకిరణాలు శివలింగాన్ని స్పర్శించాయి. ఇలాంటి దృశ్యమే శ్రీకాకుళం పట్టణంలోని అరసవిల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో భక్తులకు దర్శనమిచ్చే సంగతి తెలిసిందే.
ఉమారుద్ర కోటీశ్వర దేవాలయంలో సూర్యకిరణాలు ముందుగా సూర్యదేవుడు ఆలయం మీదుగా నందీశ్వర కొమ్ముల మధ్యలో అమ్మవారి, విఘ్నేశ్వర విగ్రహాన్ని తాకి అనంతరం శివలింగానికి పూర్తిస్థాయిలో స్పర్శించడం.. అద్భుతమైన దృశ్యమని భక్తులు చెప్తున్నారు. సూర్యనారాయణమూర్తి తన కిరణ స్పర్శను ఆదిదేవుడిపై ప్రసరింపచేయడం చాలా అద్భుతంగా ఉందని వేదపండితులు తెలిపారు. ఏటా కార్తీకమాసం రెండో సోమవారం, అలాగే కార్తీ మాసం ఆఖరి నాలుగు రోజల వ్యవధిలో ఈ ఆలయంలోని శివలింగాన్ని సూర్య కిరణాలు స్పర్శిస్తాయి. ఆలయం నిర్మించి పదేళ్లు అవుతున్నదని, ఏటా కార్తీక మాసంలో ఇలా సూర్యకిరణాలు పడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment