ఉరేసుకుని భార్య, రైలు కిందపడి భర్త ఆత్మహత్య
అనాథలైన ఇద్దరు బిడ్డలు
ఎన్‌టీఆర్ నగర్‌లో విషాదం
నెల్లూరు (క్రైమ్): పచ్చని సంసారంలో మద్యం చిచ్చు రేపింది. ఉరేసుకుని భార్య, రైలు కింద పడి భర్త ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన నెల్లూరు నగరం ఎన్టీఆర్‌నగర్‌లో శనివారం జరిగింది. అభం శుభం తెలియని ఇద్దరు బిడ్డలు అనాథలయ్యారు. దంపతులు బలవన్మరణం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఏం జరిగిందో తెలియక మృతుల కుమారులిద్దరూ అటు ఇటూ తిరుగుతూ ఉండడం చూపరులను కంట తడి పెట్టించింది. ఎన్‌టీఆర్ నగర్‌కు చెందిన కె. నాగరాజు(23), సురేఖ (19) నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు.
స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఎంతో అన్యోన్యంగా ఉంటున్నా రు. వారికి మూడేళ్లు, పదకొండు నెలల కుమారులు ఉన్నారు. నాగరాజు మార్బుల్స్, టైల్స్ పనులు చేసుకుంటుండగా, సురేఖ మాగుంట లేఅవుట్‌లోని ఓ బ్యూటీ పార్లర్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు సంతోషంగా సాగుతున్న వీరి కాపురాన్ని మద్యం విచ్ఛిన్నం చేసింది. మద్యానికి బానిసైన నాగరాజు సంపాదించిందతా మద్యానికి ఖర్చు చేయడంతో పాటు అప్పులు చేశాడు. దీంతో కుటుంబ భారం సురేఖపై పడింది. ఆమె తాను సంపాదించిన మొత్తంలో కొంత కుటుంబ పోషణకు ఖర్చు చేసి మిగిలిన దాంతో అప్పులు తీర్చింది. పలుమార్లు మద్యం మానేయమని, అప్పులు చేయొద్దని భర్తను ప్రాధేయపడింది.
అయినా అతని తీరులో మార్పు రాలేదు. కొద్ది రోజులుగా పుట్టింటికి వెళ్లి నగదు తీసుకురావాలని భార్యపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో వారి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఈ నేపథ్యంలో శనివారం నాగరాజు పని నిమిత్తం బయటకు వెళ్లగా సురేఖ తన ఇంట్లోనే ఉరేసుకుంది. ఈ విషయం స్థానికుల ద్వారా తెలు సుకున్న ఆమె తల్లిదండ్రులు గీత, సురేష్ హుటాహుటిన ఇంటి వద్దకు చేరుకుని ఆమెను కిందకు దించారు.
ఆమెను నగరంలోని రామచంద్రారెడ్డి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సురేఖ మృతి చెందిందని నిర్ధారించారు. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న నాగరాజు హాస్పిటల్ వద్దకు వెళ్లి కన్నీరు మున్నీరయ్యారు. భార్య లేని జీవితం వ్యర్థమంటూ రోదించాడు. ఇక తాను బతకలేనంటూ అక్కడి నుంచి పరుగున వెళ్లి విజయమహాల్ రైల్వే గేటు సమీపంలో చైన్నె వైపు వెళ్లే పట్టాలపై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
గంటల వ్యవధిలోనే దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడం అందరి హృదయాలను కలిచి వేసింది. సురేఖ ఆత్మహత్య ఘటనపై సమాచారం అందుకున్న బాలాజీనగర్ ఎస్‌ఐ విజయ్‌శ్రీనివాస్, నెల్లూరు తహసీల్దార్ హాస్పిటల్‌కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి దీప్తి ఫిర్యాదు మేరకు బాలాజీనగర్ ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. నాగరాజు ఆత్మహత్య ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment