షర్బత్ మార్కెట్లో నన్నారి జోరు!
- 20 రోజుల్లో రూ. 20 లక్షల అమ్మకాలు
- అనూహ్య డిమాండ్‌తో జీసీసీ తబ్బిబ్బు
సాక్షి, విశాఖపట్నం: రాయలసీమ జిల్లాల్లో ప్రాచుర్యం పొందిన ప్రకృతి సిద్ధ షర్బత్ ‘నన్నారి’... కూల్‌డ్రింక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. మార్కెట్లోకి విడుదలైందో లేదో... విపరీతమైన డిమాండ్‌తో శీతల పానీయాల కంపెనీలకు సవాల్ విసురుతోంది. కేవలం 20 రోజుల్లో రూ.20 లక్షల అమ్మకాలతో ఈ షర్బత్ రికార్డు సృష్టించింది.
మారేడు గెడ్డల వేళ్ల నుంచి ఉత్పత్తి చేసే ఈ పానీయాన్ని గిరిజన సహకార సంస్థ ఈ నెల 3వ తేదీన మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఐదవ తేదీ నుంచి అమ్మకాలు మొదలుపెట్టగా... కేవలం 20 రోజుల్లో రాష్ర్టవ్యాప్తంగా 20 వేల బాటిల్స్‌ను విక్రయించారు. ఒకో బాటిల్ రూ.100 విలువ చేసే నన్నారి కోసం... మార్కెట్‌లోకి విడుదల చేసే సమయానికే సుమారు 10 వేల బాటిల్స్‌కు ఆర్డర్లు వచ్చాయి. పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదల చేశాక ఊహించని రీతిలో డిమాండ్ రావటంతో దానికి అనుగుణంగా జీసీసీ సరఫరా చేయలేకపోతోంది.
చిత్తూరులో ప్రస్తు తం ఉన్న తేనె శుద్ధి కర్మాగార సముదాయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యూనిట్ ద్వారా రోజుకు వెయ్యి బాటిల్స్ షర్బత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఏడాదికి 50 వేల బాటిళ్ల వరకు ఉత్పత్తి చేయాలని తొలుత సంకల్పించారు. ఇందుకోసం 100 క్వింటాళ్ల మారేడు గెడ్డలు అవసరమవుతాయని అంచనా వేశారు. కానీ ఊహించని రీతిలో 20 రోజుల్లోనే 20వేల బాటిల్స్ అమ్ముడుపోవటంతో వేసవి సీజన్ ముగిసే నాటికి మరో 30 వేల బాటిల్స్‌కు పైగా అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.
మిగిలిన సీజన్లలోనూ ఇదే రీతిలో డిమాండ్ ఉండే అవకాశాలుండడంతో ప్రస్తుతం గిరిజనుల నుంచి సేకరిస్తున్న 200 క్వింటాళ్ల మారేడు గెడ్డలను పూర్తిగా ఈ ఏడాదే నన్నారి షర్బత్ తయారీకి ఉపయోగించాలన్న ఆలోచనలో జీసీసీ ఉంది. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. మార్కెట్‌లో లభించే శీతల పానీయాలతో పోలిస్తే కృత్రిమమైన రంగులు కలుపకుండా సహజసిద్ధమైన మారేడు గెడ్డల నుంచి ఉత్పత్తి అవుతుండడం, అనేక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి దోహదపడే ఆయుర్వేద గుణాలుండడంతో వీటికి ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడిందని జీసీసీ వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్‌పీఎస్ రవి ప్రకాష్ తెలిపారు.
విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రితో పాటు ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో షర్బత్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని ‘సాక్షి’కి తెలిపారు. 750 ఎంఎల్ సామర్థ్యం గల ఒక బాటిల్‌ను నీటిలో కలుపుకొని సుమారు 100 గ్లాసుల వరకు సరఫరా చేసేందుకు వీలుంటుందన్నారు.