సాక్షి, అమరావతి: దేశంలోనే ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అరకు కాఫీ సాగును ప్రోత్సహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. తాజాగా ఏజెన్సీ ప్రాంతంలో సాగవుతున్న కాఫీ తోటల పెంపకానికి ఉపాధిహామీని కొనసాగించడంతోపాటు పనిదినాలు పెంచాలని కేంద్రాన్ని కోరింది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగిన జాతీయ సమావేశంలో సైతం కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ ముండాకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర బృందం ప్రత్యేకంగా ప్రతిపాదనలను కూడా అందజేసింది. గతంలో కాఫీసాగుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీని వర్తింపజేసింది.
అటవీ హక్కుల పత్రం (ఆర్వోఎఫ్‌ఆర్ పట్టా) ఉన్న భూముల్లో ఏడాదికి 150 రోజులు, హక్కుల పత్రాలు లేని మామూలు భూముల్లో 100 రోజులు చొప్పున ఇచ్చేవారు. కాఫీతోటల పెంపకంలో గుంతల తవ్వకం, మొక్కలు నాటడం తదితర పనులకు ఉపాధిహామీ నిధులు కేటాయించేవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన గిరిజన సంక్షేమశాఖ, ఐటీడీఏ, కాఫీబోర్డు ఈ పనులను పర్యవేక్షించేవి. దీనివల్ల అటు కాఫీతోటల సాగును ప్రోత్సహించడంతోపాటు గిరిజనులకు ఏడాదిలో కొన్ని రోజులైనా పనిదినాలకు భరోసా ఉంటుంది.
ఉపాధిహామీలో కాఫీ రైతులకు వేతనాలు చెల్లించడం కుదరదని 2020లో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. కాఫీని వాణిజ్యపంటగా గుర్తించి ఉపాధిహామీ ఇవ్వడానికి కేంద్రం నిరాకరిస్తోంది. దేశంలో కాఫీతోటలు విరివిగా ఉండే కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కాఫీసాగు వాణిజ్యపంటగా ప్రత్యేకంగా ఎస్టేట్‌లలో సాగవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల జీవనోపాధిగా మాత్రమే సాగవుతున్నందున ప్రత్యేక కేసుగా పరిగణించి మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతూనే ఉంది. తాజాగా కేంద్రంపై మరోమారు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచింది.
కేరళ రబ్బరుతోటల మాదిరిగా ఏపీలో కాఫీతోటలను ప్రోత్సహించాలి
కేరళకు ప్రత్యేకమైన రబ్బరుతోటల సాగుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీని కొనసాగిస్తోంది. ఏపీలోని కాఫీతోటల సాగును కూడా ప్రత్యేకంగా పరిగణించి ఉపాధిహామీ వర్తింపజేసి ఏడాదికి 180 రోజుల పనిదినాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. పలు రాష్ట్రాల్లో కాఫీని వాణిజ్యపంటగా ఎస్టేట్‌లలో పండిస్తున్నప్పటికీ ఏపీలోని ఏజెన్సీలో మాత్రం కాఫీసాగు గిరిజనులకు ప్రధాన ఉపాధిగా ఉందని తెలిపింది. కాఫీతోటల పెంపకం వలన అక్కడి గిరిజన కుటంబాల జీవన స్థితిగతులు మెరుగుపడుతున్నాయని పేర్కొంది. ఏపీకి గర్వకారణమైన అరకు కాఫీ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడేందుకు కేంద్రం సహకరించాలని, ఉపాధిహామీని కొనసాగించడంతోపాటు పనిదినాలు పెంచాలని కోరింది.
కాఫీ తోటలకు ఉపాధిహామీ!
Published Mon, Jul 25 2022 4:52 AM | Last Updated on Mon, Jul 25 2022 7:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment