చిత్తడినేలలు.. జీవవైవిధ్య నిధులు  | Mangroves are special At near Krishna and Godavari | Sakshi
Sakshi News home page

చిత్తడినేలలు.. జీవవైవిధ్య నిధులు 

Published Thu, Feb 2 2023 5:04 AM | Last Updated on Thu, Feb 2 2023 11:11 AM

Mangroves are special At near Krishna and Godavari - Sakshi

సాక్షి, అమరావతి: విలువైన చిత్తడినేలలు జీవవైవిధ్యానికి అత్యంత అవసరం. జీవవైవిధ్య సంరక్షణలో చిత్తడి నేలలది ముఖ్యపాత్ర. అందుకే వాటిని అనేక ప్రత్యేకతలున్న జీవావరణ వ్యవస్థలుగా పరిగణిస్తారు. గురువారం ప్రపంచ చిత్తడినేలల దినోత్సవం కావడంతో వాటి ఆవశ్యకత, సంరక్షణపై  విస్తృతంగా చర్చ జరుగుతోంది. సంవత్సర కాలంలో పూర్తిగాగానీ, చాలా భాగంగానీ నీటితో కప్పి ఉండే ప్రాంతాలను చిత్తడినేలలుగా పిలుస్తారు.

మన రాష్ట్రంలో వివిధ రకాల చిత్తడినేలలున్నాయి. మంచినీటితో ఏర్పడిన కొల్లేటి సరస్సు, సముద్రపు నీటితో ఏర్పడిన పులికాట్‌ సరస్సు వాటిలో ముఖ్యమైనవి. మంచినీరు, ఉప్పునీరు కలవడం వల్ల ఏర్పడే ప్రత్యేక జీవావరణ వ్యవస్థలైన కాకినాడ సముద్రతీరంలోని కోరింగ మడ అడవులు, కృష్ణాతీరంలో కృష్ణ మడ అడవులు ప్రధానమైనవి.

నేలపట్టు, సోమశిల బ్యాక్‌వాటర్‌లోని నరసింహ అభయారణ్యాలు కూడా చిత్తడినేలలే. మడ అడవులు పర్యావరణాన్ని శుభ్రం చేయడంలో, వాతావరణంలోని కర్బన పదార్థాలను గ్రహించి జీవపదార్థాలుగా మార్చడంలో, వాటిని నిల్వ ఉంచడంలో విలువైనపాత్ర పోషిస్తాయి. ఇవి మామూలు చెట్ల కంటే కనీసం 4, 5 రెట్లు ఎక్కువ కర్బన పదార్థాలను గ్రహించి నిల్వచేస్తాయి. అనేక రకాల చేపలు, సముద్ర జీవులకు మడ అడవులు పునరుత్పత్తి ప్రదేశాలు. ఎంతో విలువైన పులసజాతి చేపలు, మాగా, బుడతమాగా చేపలకు మడ అడవులు చాలా అవసరం.  

కలుషితమవుతున్న చిత్తడినేలలు 
ప్రతి సంవత్సరం శీతాకాలంలో సైబీరియా తదితర ప్రాంతాల నుంచి కొల్లేరు, పులికాట్, నేలపట్టు వంటి చిత్తడినేలల వద్దకు అనేకరకాల పక్షులు వచ్చి జీవిస్తాయి. తిరిగి వేసవికాలంలో వాటి ప్రాంతాలకు తిరిగి వెళతాయి. అనేకరకాల నత్తలు, రొయ్యల జాతులు, క్రిమికీటకాలు ఈ చిత్తడి నేలల్లో జీవిస్తూ జీవవైవిధ్య సంపదని పరిపుష్టం చేస్తున్నాయి. వరదలను నివారించడం, వ్యవసాయ భూములను సంరక్షించడం,  లక్షలాదిమంది తీరప్రాంత ప్రజల జీవనోపాధికి ఈ నేలలు ఉపయోగపడుతున్నాయి.

కానీ ఆక్రమణలు, చేపలు, రొయ్యల అక్రమ చెరువులు, అశాస్త్రీయ సాగుపద్ధతులు, పురుగుమందుల వినియోగం, పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాల వల్ల చిత్తడినేలలు కలుషితమవుతున్నాయి. కొన్నిచోట్ల క్రమంగా అంతరించి పోతున్నాయి. దీనివల్ల అక్కడి జీవవైవిధ్యం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ప్రత్యేక జీవావరణ వ్యవస్థలు సమతుల్యతను కోల్పోతుండడంతో అనేక జీవజాతులు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడిందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

చిత్తడినేలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు 
విలువైన చిత్తడినేలల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రపంచ చిత్తడినేలల దినోత్సవాన్ని అటవీశాఖ ఆధ్వర్యంలో పలుచోట్ల నిర్వహించి వాటి ఆవశ్యకత, ప్రభావం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిత్తడినేలలను గుర్తించి వాటిని పరిరక్షించే కార్యక్రమం జరుగుతోంది.  
– డాక్టర్‌ శాంతిప్రియ పాండే, ఏపీసీసీఎఫ్‌ (వన్యప్రాణుల విభాగం), ఏపీ అటవీశాఖ  

జీవవైవిధ్య సంరక్షణకు వ్యవస్థాపరమైన ఏర్పాట్లు  
చిత్తడినేలలను సంరక్షించడానికి ప్రభుత్వం ఈ ప్రాంతాలను అభయారణ్యాలుగా ప్రకటించి రక్షణ చర్యలు తీసుకుంటోంది. జీవవైవిధ్య సంరక్షణ చట్టం ప్రకారం ఏపీ జీవవైవిధ్య సంస్థ ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో జీవవైవిధ్య సంరక్షణకు అవసరమైన వ్యవస్థాపరమైన ఏర్పాట్లు చేసింది. చిత్తడినేలలున్న ప్రాంతాలన్నింటిలో జీవవైవిధ్య యాజమాన్య కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలను భాగస్వాములుగా చేసింది. వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిది. 
– డి.నళినీమోహన్, అటవీశాఖ పూర్వ పీసీసీఎఫ్, బయో డైవర్సిటీ బోర్డు రిటైర్డ్‌ సభ్య కార్యదర్శి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement