కొలువులపై విభజన క్రీనీడ
కొలువులపై విభజన క్రీనీడ
Published Sat, Mar 11 2017 11:16 PM | Last Updated on Tue, Sep 5 2017 5:49 AM
విలీన మండలాల డీఎస్సీ అభ్యర్థుల ఆక్రోశం
స్థానికులు కాదంటూ నియామకాలకు అడ్డంకి
కోర్టు కరుణించినా ఖాతరు చేయని ఐటీడీఏ!
నెల్లిపాక : రాష్ట్ర విభజన గిరిజన నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. కష్టపడి చదివిన వారిని స్థానికత కష్టాల పాలు చేసింది. అర్హత ఉన్నా వారికి ఉద్యోగాలు అందని ద్రాక్షలా మారాయి. విలీన మండలాల ఏజెన్సీ డీఎస్సీలో ఆ మండలాల అభ్యర్థుల పట్ల ప్రభుత్వ నిర్ణయం వారికి తీరని ఆవేదనను మిగుల్చుతోంది. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఆధ్వర్యంలో 2016 అక్టోబర్ 29న ప్రత్యేక డీఎస్సీ అర్హత పరీక్షను నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన వారిని గత ఏడాది డిసెంబర్ 29న ఉపాధ్యాయ ఉద్యోగాల్లో నియమించారు. అయితే రాష్ట్ర విభజనతో తూర్పుగోదావరి జిల్లాలో కలిపిన నాలుగు విలీన మండలాల్లోని కొందరు అభ్యర్థులు అర్హత సాధించినా స్థానికత పేరుతో నియామకాలను నిలిపివేశారు. దీంతో వారు గత మూడు నెలలుగా ఉద్యోగాల కోసం పోరాటం చేసూ్తనే ఉన్నారు. కోర్టును కూడా ఆశ్రయించి అనుకూలంగా ఉత్తర్వులు సాధించుకున్నా అధికారుల నుంచి స్పందన లేదని వారు వాపోతున్నారు. విలీన మండలాల్లో మొత్తం 10 మంది అభ్యర్థుల నియామకాలను ప్రస్తుతం నిలిపివేశారు. వీరిలో ఎటపాక మండలంలోని ఆదివాసీ తెగకు చెందిన ముగ్గురు మహిళా అభ్యర్థులు, నలుగురు లంబాడా తెగకు చెందిన వారు కాగా చింతూరు మండలంలో ఒకరు, వీఆర్ పురం మండలంలో ఇద్దరు ఆదివాసీ అభ్యర్థులు ఉన్నారు. వీరి నియామకాలను స్థానికత లేదనే కారణంగా నియామకపు ఉత్తర్వులు ఇవ్వలేదు.
కోడళ్లుగా వచ్చిన వారికీ అడ్డంకే
ఆరుగురు ఆదివాïసీ అభ్యర్థులకు తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ స్థానికత లేదని ఉద్యోగావకాశం కల్పించలేదు. అయితే వీరిలో ఎటపాకకు చెందిన కోర్స సుజాత, పొడియం కౌసల్య, వీఆర్‌పురానికి చెందిన కారం అరుణ, సీహెచ్ వెంకటలక్ష్మి ఈ ప్రాంతానికి కోడళ్లుగా వచ్చారు. మిగతా ఇద్దరు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఉంటున్నవారే. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ఏజెన్సీలోనే ఉంటూ వీరి చదువులు పూర్తి చేశారు. వివాహాలు కూడా రాష్ట్ర విభజనకు ముందే జరిగాయి. ప్రత్యేక డీఎస్సీలో కొలువులు సాధించేందుకు అహర్నిశలు కష్టపడి చదివి అర్హత పొందారు. కానీ వీరిని ఈ ప్రాంతానికి చెందిన వారు కాదని నియామకాలు నిలిపివేయటం పట్ల తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సాధించుకున్న ఉద్యోగాలు గత మూడునెలలుగా దూరం కావటంతో వీరు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు.
Advertisement
Advertisement