సిరివరాలు | vip Reporter itda Rajat Kumar Saini | Sakshi
Sakshi News home page

సిరివరాలు

Published Sun, Dec 14 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM

సిరివరాలు

సిరివరాలు

పీఓ ఏమన్నారంటే..
 తనకు ఆప్యాయంగా ఆహ్వానం పలికిన అమాయకపు సిరివర గ్రామ గిరిజనులపై పీఓ రజత్ కుమార్ సైనీ వరాల జల్లు కురిపించారు. గెడ్డ నుంచి గ్రామానికి తాగునీటిని తెచ్చుకునేందుకు పైపులు. 1000ఏలో వ్యవసాయ గట్లకు ఉపాధి పనులు,  30 సోలార్ లైట్లు, సబ్సిడీ రుణాలు, ట్రైకార్‌లో రైస్ మిల్లు, ఆటోలు, ఉచిత విత్తనాలు, సుఖ ప్రసవాలు జరిపించేందుకు మహిళలకు శిక్షణ, యువతకు డ్రైవింగ్, కంప్యూటర్ తదితర వాటిలో శిక్షణ తదితర అనుమతులు ఇచ్చారు.  ఈ సందర్భంగా బడి ముఖం చూడని తాడిపుట్టి, సిరివర ఉపాధ్యాయుల సస్పెన్షన్‌కు డీఈఓకు సిఫారసు
 చేయాలని అధికారులను ఆదేశించారు.
 
 భారీ వృక్షాలతో నిండిన కొండలు. ఎత్తై లోయలు..ఎవరి ఊపిరి వారికే భయం గొలిపే భయంకర నిశ్శబ్ద వాతావరణం..మా వోయిస్టు ప్రభావిత ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో భీకర వాతావరణం. ఎక్కడ  ఏ మూల నుంచి ఏ జంతువు వచ్చి దాడిచేస్తుందో...? ఏ విషపురుగులు మీద డతాయో..తెలియని ప్రమాదకర దారి..అక్కడక్కడా విసిరేసినట్లున్న గిరిజన డలు..రాయనక..రప్పనక..కొండనక..కాననక..వాగనక..వంకనక..శ్రమ అనక..చెమట అనక..ఎత్తై ఆరు కొండలను దాటి...సుమారు 7 గంటల పాటు నడిచారు ఐటీడీఏ పీఓ రజత్‌కుమార్ సైనీ. పార్వతీపురం సబ్-ప్లాన్‌లో గిరిశిఖరాలలో ఉన్న సాలూరు మండలం కొదమ పంచాయతీలోని ఆంధ్రా-ఒడిశా మధ్య  శతాబ్దాలుగా సర్వేకు నోచుకోకుండా మిగిలిన  ‘సిరివర’ గిరిజన గ్రామంలో గిరిజనుల సమస్యలు,

వారి జీవన విధానాన్ని అవలోకనం చేసుకునేందుకు ఐటీడీఏ పీఓ రజత్ కుమార్ సైనీ  ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా  మారారు. ఆ గ్రామ గిరిజనుల సమస్యలు వింటూ..తక్షణమే పరిష్కరిస్తూ.. ‘సిరివర’కు వరాలజల్లు కురిపించారు.  నా పేరు రజత్ కుమార్ సైనీ...ఐటీడీఏ పీఓను: సాలూరు మండలం, కొదమ పంచాయతీ, ‘సిరివర’ గ్రామ గిరిజనులందరికీ నమస్కారం...నేను ఈ రోజు ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మీ సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాను. మీ సమస్యలను ఒక్కొక్కటి..ఒక్కొక్కరుగా నాకు చెప్పండి. ‘సిరివర’ గ్రామస్తులు: నమస్కారం సారూ..మా సమస్యలు తెలుసుకోడానికి ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మా గూడెంకు వచ్చినం దుకు...స్వాగతం...ఐటీడీఏ పీఓ వచ్చారంటే...నమ్మలేని నిజంగా  ఉంది... మీరొచ్చినందుకు సంతోషంగా ఉంది.

 తాగు నీటికి పైపులు...!
 ఐటీడీఏ పీఓ: మీ పేరేంటి చెప్పండి...?
 సిరివర గ్రామ గిరిజనుడు: నా పేరు సీదరపు సిత్తురు...
 పీఓ :మీ ప్రధానమైన సమస్య చెప్పండి...?
 సిత్తురు: మాకు తాగు నీరు కష్టంగా ఉంది. గెడ్డ దూరంగా ఉంది. ఆ నీరు తాగితే రోగాల బారిన పడుతున్నాం.
 పీఓ: గెడ్డ ఎంత దూరముంది...? నీరు క్లోరినేషన్ చేస్తున్నారా...? వేడి నీరు తాగుతున్నారా...?
 సిత్తురు: కిలో మీటరు దూరముంది. అలా తెచ్చి తాగుతుంటాం. వర్షాకాలంలో బురద నీరు. ఆకులు, పుల్లలు కుళ్లిపోయిన కలుషిత నీరే తాగుతూ రోగాల బారిన పడుతున్నాం.
 పీఓ : సరే...సోషల్ కన్జర్వేషన్‌లో...గెడ్డ నుంచి గ్రామానికి నీరు తీసుకురావడానికి ఎన్ని పైపులు కావాలంటే అన్ని మంజూరు చేస్తున్నాను. ఆ నీరు గ్రామానికి తెచ్చి ట్యాంకులో వేసి, క్లోరినేషన్ మాత్రలు అందులో కలుపుకొని తాగండి. అప్పుడు జబ్బులు వచ్చే ప్రమాదం ఉండదు.
 ఉపాధిలో పొలం గట్లకు టైంగ్
 పీఓ : మీ పేరు చెప్పండి...?
 గ్రామస్తుడు: నా పేరు సీదరపు సింగురు...
 పీఓ :  ఉపాధి పనులు చేస్తున్నారా..?
 సింగురు: ఉపాధి పనులు చేయలేదు...!
 ఉపాధి ఏపీఓ దిలీప్: ఇది అన్ సర్వేయ్‌డ్ ఏరియా....అందుకే ఇక్కడ భూ అభివృద్ధిలో ఉపాధి పనులు లేవు. గతంలో ట్యాంకులు చేశాం సార్...ఈ మధ్యనే 1000ఏలో సర్వే చేశాం సార్...80 మంది పనులు కావాలన్నారు.
 పీఓ : సరే...1000ఏలో ఇక్కడ ఉపాధి పనులివ్వండి. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులివ్వండి.
 పీఓ : సింగురూ...ఉపాధి పనులు ఇస్తే...చేస్తారా...? ఏ పనులు చేస్తారు...?
 సింగురు: ఎందుకు చేయం. అందరం చేస్తాము. అయితే పొలాలకు రాళ్లతో గట్లు వేసుకుంటాము...అనుమతివ్వండి...?
 పీఓ : సరే..మీకు ఎన్ని రోజులు కావాలంటే.. అన్ని రోజులు ఉపాధి పనులను ఏపీఓ ఇస్తారు. చేయండి. అలాగే మీ పొలాలకు టైంగ్(రాతి కట్టడాలు) వేసుకోండి. ఇది మీకు మాత్రమే స్పెషల్ పర్మిషన్.
 టీచర్ల సస్పెన్షన్‌కు ఆదేశాలు..
 పీఓ : మీరు చెప్పండి మీ పేరేమిటి..?
 సిరివర గిరిజనుడు: నా పేరు సీదరపు సొంబురు సామంతు
 పీఓ : మీరు చెప్పండి.  మీ ఊరిలో ఇంకా ఏ సమస్య ఉంది...? టీచర్లు రోజూ బడికి వస్తారా...? చిన్న పిల్లలు వీధుల్లో తిరుగుతున్నారెందుకు...? బడికి పంపించ లేదా...?
 సామంతు:టీచర్లు బడికి రారు.
 పీఓ : బడి ఎక్కడుంది...? ఎంతమంది టీచర్లున్నారు..?
 సామంతు: బడి లేదు...ఒకరి ఇంటి దగ్గర అప్పుడు చెప్పేవారు. ఇద్దరు టీచర్లున్నారు.
 పీఓ : ఎన్ని రోజులకొకసారి వస్తారు...?
 సామంతు: టీచర్లొచ్చి ఎన్ని నెలలయ్యిందో...? గురుతు లేదు. ఇద్దరు రారు. సుధీష్ టీచర్ అప్పుడప్పుడు సంతకొచ్చి కలుస్తాడు. హెడ్మాస్టర్ అస్సలు రాడు. అందుకే పిల్లలు అ..ఆ..లు రాకుండా ఊరి మీద, పొలాల కాడ...కొండకాడ తిరిగి గాలిబారిపోతున్నారు.
 పీఓ : సరే ఆ టీచర్ల సంగతి నేను చూస్తాను. కొద్దిగా పెద్ద పిల్లల్ని మన ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలకు పంపించండి.
 పీఓ: సురేష్(సీసీతో)  ఇక్కడ స్కూలు ఎంపీపీదా...? ఐటీడీఏదా...? ఆ టీచర్ల వివరాలు తీసుకోండి.
 డెలివరీ చేసేందుకు శిక్షణ
 పీఓ : మీ పేరు చెప్పండి...? ప్రసవాలకు ఆస్పత్రికి వెళ్తున్నారా...?
 సిరివరపు గిరిజన మహిళ: నా పేరు సీదరపు బిందిరి...ప్రసవాలు ఇంటి దగ్గరే అవుతాయి. ఆస్పత్రికి కొండ దిగి వెళ్లలేము. అందుకే...
 పీఓ : ఇక్కడ ఏఎన్‌ఎం ఎవరు...? ఆవిడ వస్తుందా...?
 ఏఎన్‌ఎం:సార్...నేనే ఇక్కడ ఏఎన్‌ఎంని నా పేరు సీహెచ్.బుజ్జి
 పీఓ : చెప్పండి...డెలివరీకి ఆస్పత్రికి ఎదుకు తీసుకెళ్లడం లేదు..? మీరు ఎన్ని పంచాయతీలు చూస్తున్నారు...? పల్లకీలు ఉపయోగపడుతున్నాయా...? ఏడాదికి ఎన్ని డెలివరీలు అవుతున్నాయి...? డెలివరీ తర్వాత మీరు చూస్తున్నారా...? ఇక్కడ ఆశ కార్యకర్త ఉన్నారా? మందులు ఉన్నాయా...? క్లోరినేషన్ మాత్రలున్నాయా..?
 ఏఎన్‌ఎం : సార్ డెలివరీకి ఆస్పత్రికి రారు. కొండలు దిగడం కష్టం. ఏడాదికి 10 నుంచి 12 డెలివరీలు అవుతున్నాయి. ఒక్క కొదమ పంచాయతీ చూస్తున్నాను. మొత్తం 16 గ్రామాలున్నాయి. డెలివరీ తర్వాత మెడికల్ కేర్ ఇస్తున్నాం. ఆశ వర్కర్ ఈ గ్రామంలోనే ఉంది.  బరువు వల్ల పల్లకీ ఉపయోగించడం లేదు సార్...
 పీఓ: సరే...డెలివరీ చేసేందుకు గ్రామస్తులకు మనమే శిక్షణ ఇద్దాం. కొంతమందిని ఎంపిక చేయండి..!
 సబ్సిడీ రుణాలు...  
 పీఓ సైనీ: మీ పేరు చెప్పండి...? ఐకేపీ సీసీ వస్తారా...? మహిళా సంఘాలు ఎలా ఉన్నాయి..? సమస్య ఏమైనా ఉందా...?
 సిరివర గిరిజన మహిళ: నా పేరు సీదారపు నీలస...మహిళా సంఘం ఉంది. సీసీ రాదు. బ్యాంకుకు వస్తది. మాకు ఈ ఏడాది, గత ఏడాది...లోను రాలేదు. మ్యాచింగ్ గ్రాంట్ రాలేదు.
 పీఓ : సరే...మీ వద్దకు సీసీ కంటే పెద్ద ఆఫీసర్ని పంపిస్తాను. బ్యాంకులోను అయితే సబ్సిడీ ఉండదు. నేను మీకు సబ్సిడీ లోను లిస్తాను. ఏమి లోను కావాలి. కోరుకోండి.
 సీదారపు నీలస: మాకు గొర్రెల లోను ఇవ్వండి. రైసు మిల్లు ఇవ్వండి.
 పీఓ : సరే ట్రైకార్‌లో మీకు రూ.2లక్షల రైస్ మిల్లు. ఆటోలు కావాలంటే ఇస్తాను. దుగ్గేరు నుంచి మెండ ంగి వరకు నడుపుకోండి. మంచి డబ్బులు వస్తాయి. పంచాయతీ సెక్రటరీ పాపారావు గారూ...ట్రైకార్ అప్లికేషన్లు సిద్ధం చేయండి.
 విత్తనాలు, ఆయిల్ ఇంజిన్లు ...
 పీఓ : మీ పేరు చెప్పండి...? పంటలు ఏమి పండిస్తారు...? విత్తనాలు ఎక్కడ నుంచి వస్తాయి...? పంటలు ఎక్కడ అమ్ముతారు...?
 గిరిజనుడు: నా పేరు సీదరపు లాహిరి సార్...మేము విత్తనాలు సొంతంగా తయారు చేసుకుంటాం. వరి, చిక్కుడు, సామలు, సోలు(రాగులు), గోధుమలు, జొన్న, కందులు పంటలు పండిస్తాం.  కందులు మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మకాలు చేస్తాం. వరితో పాటు మిగతా పంటలన్నీ తిండికి ఉపయోగిస్తాం.
 పీఓ సైనీ: వ్యవసాయానికి ఏమి కావాలి...అడగండి...?
 లాహిరి: ఆయిల్ ఇంజిన్లు ఇవ్వండి.
 పీఓ సైనీ: ఆయిల్ ఇంజిన్లతోపాటు మీకు ఐటీడీఏ నుంచి మంచి విత్తనాలిస్తాం. ఆ విత్తనాలు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది. వాటిలో కొన్ని మీరు తిని, మిగతావి విశాఖ, విజయనగరం లాంటి పట్టణాలకు పట్టుకెళ్లి అమ్మండి. మంచి ధర వస్తుంది. ఆ పంటల అమ్మకానికి కూడా ఏర్పాట్లు చేస్తాం.
 పీఓ ప్రయాణం ఎలా సాగిందంటే...!
 కోడి కూత కూయగానే ఉదయం 5గంటలకు తన బంగ్లా నుంచి చేత లోగో పట్టుకొని ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా పార్వతీపురం ఐటీడీఏ పీఓ రజత్ కుమార్ సైనీ బయలు దేరారు. అక్కడ నుంచి పార్వతీపురం మండలం పెదబొండపల్లి, తాళ్లబురిడి మీదుగా మక్కువ మండలం దుగ్గేరుపై నున్న మెండంగి గ్రామానికి 6గంటల ప్రాంతంలో తన వాహనంలో చేరుకున్నారు. అప్పుడప్పుడే మంచు తెరలు వీడుతుండడంతో తట్ట,పార పట్టుకుని..కాయకష్టం కోసం పయనమవుతున్న గిరిజనులంతా..ఇంత తెల్లవారి తమగ్రామానికి ఐటీడీఏ  పీఓ రావడం చూసి...ఒకింత ఆశ్చర్యం...మరింత సంతోషంతో..చుట్టూ చేరి...తమ గూడెం పల్లెకొచ్చిన పీఓను పిల్లా పాపలతో వారు కొండపైకి సాదరంగా సాగనంపారు. అలా ఓ గంటసేపు కొండలెక్కాక...దారిలో వచ్చిన ‘తాడిపుట్టి’ గ్రామంలో గిరిజనులతో పీఓ కాసేపు ముచ్చటించి...వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అక్కడే ఆదేశించారు. అనంతరం కాలు జారితే లోయలోకి జారిపోతామన్న రాళ్లరప్పల భయంకర దారిలో నడక ప్రయాణం కొనసాగించారు. గంటసేపు ప్రయాణం తర్వాత ‘డొయివర’ అంచున వెళ్తున్న సమయంలో ఆ గ్రామానికి చెందిన సీదరపు పొన్న అయ్యా...నాకు రేషన్, ఆధార్, ఉపాధి...ఏ కార్డూ లేదు. నేను ఆంధ్రావావాడినే...అంటూ పీఓకు తన ఆవేదన చెప్పాడు. అక్కడే  ఉపాధి ఏపీఓ దిలీప్‌ను పీఓ పిలిచి తక్షణమే ఉపాధి హామీ కార్డు ఇచ్చి, పనులిచ్చి...ఆ కార్డుతో మిగతా కార్డులు చేయించాలని ఆదేశించారు. అనంతరం వాగులు, వంకలు, గెడ్డలు...కర్రల వంతెనలు దాటి...గిరిశిఖరంలో ఉన్న ‘సిరివర’కు చేరుకున్నారు.  
 తనకు ఆప్యాయంగా ఆహ్వానం పలికిన ఆ అమాయకపు గిరిజనులకు పీఓ రజత్ కుమార్ సైనీ వరాల జల్లు కురిపించారు.
 పొట్టతగ్గుతుంది కదా..!
 పీఓ తన ప్రయాణంలో బడి ముఖం చూడని తాడిపుట్టి, సిరివర ఉపాధ్యాయులను సస్పెన్షన్‌కు డీఈఓకు సిఫార్సు చేయాలని ఆదేశించారు.
 అనంతరం తనను బతిమాలుతున్న టీచర్ని చూసి...వారానికోసారైనా బడికొస్తే...జీతంతోపాటు బరువు కూడా తగ్గుతారు కదా...? అని చలోక్తులు విసిరారు. అలాగే తన దఫేదార్ ఎస్.రమణతో వారానికి ఓ హిల్‌టాప్ గ్రామానికి వెళ్దామా...? నీ పొట్ట తగ్గుతుందని హాస్యమాడారు. కొండ దిగొచ్చే సమయంలో కొండనుంచి వెదురు బొంగుల ద్వారా వస్తున్న నీటితో ముఖం కడుక్కుని, ఆ నీరు తాగారు.  పీఓ రాకతో సిరివర పున్నమై పూసింది. పది మంది మేలు కోరిన ‘సాక్షి’కి  పులకించిన ‘సిరివర’ తన దీవెనలు గుమ్మరించింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement