ఒక్కటే.. ఐటీడీఏ
-
ఒక్కరే ప్రాజెక్టు అధికారి
-
మూడు జిల్లాలకు ఏజెన్సీ విస్తరణ
-
ప్రతి మండలానికి ప్రత్యేక అధికారి
-
చైర్మన్‌గా గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్
ఏటూరునాగారం : జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏజెన్సీ మండలాలు మూడు జిల్లాల్లోకి వెళ్తున్నప్పటికీ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఒక్కటే ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలోని 13 ఏజెన్సీ మండలాలు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పాలనలో కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో ఐటీడీఏలోని కొన్ని మండలాలు భూపాలపల్లికి, మరికొన్ని మండలాలు మహబూబాబాద్(మానుకోట), మరికొన్ని వరంగల్ జిల్లాలో ఉండనున్నాయి.
ఆ మండలాలు వేర్వేరు జిల్లాల్లోకి వెళ్లినా ప్రాజెక్టు అధికారి మాత్రం ఒక్కరే ఉంటారు. వాటిని ఏజెన్సీ నుంచి నాన్ ఏజెన్సీగా మార్చే అవకాశం లేకపోవడంతో అవి అలాగే కొనసాగుతాయి. ఇతర జిల్లాలోకి వెళ్లే ఏజెన్సీ మండలాలకు పరిపాలన అధికారి లేదా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారులను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీడీఏ పరిధిలో పనిచేసే ఉద్యోగల జాబితాలు, వారి హోదాలు, డిప్యూటేషన్లు వివరాలను కమిషనర్ కార్యాలయానికి పంపినట్టు తెలిసింది. ఐటీడీఏ పరిధిలోని ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సొంత జిల్లాకు కాకుండా మరో జిల్లాకు పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అందు కోసం ఉద్యోగుల నివాసం, చేస్తున్న ఉద్యోగం హోదా కూడిన పూర్తి సమాచారం ఐటీడీఏ నుంచి ఉన్నతాధికారులకు చేరింది.
13 మండలాలు మూడు జిల్లాల్లోకి..
ఏజెన్సీ పరిధిలో 13 మండలాలు ఉండగా జయశంకర్ జిల్లాలోకి భూపాలపల్లి, ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, గోవిందరావుపేట, ములుగు, వెంకటాపురం మండలాలు వెళ్లనున్నాయి. మహబూబాబాద్, కొత్తగూడ, గూడూరు మండలాలు మహబూబాబాద్ జిల్లాలోకి వెళ్లాయి. నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం మండలాలు వరంగల్ జిల్లా పరిధిలో ఉంటాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఐటీడీఏ మండలాల్లో 5.30 లక్షల మంది గిరిజనులు నివాసం ఉంటున్నారు.
శ్రీశైలం ఐటీడీఏ మాదిరిగానే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా శ్రీశైలం ఐటీడీఏ లాగానే ఏటూరునాగారం ఐటీడీఏ కూడా మారనుంది. శ్రీశైలం ఐటీడీఏ కింద కూడా కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలు ఉన్నాయి. మండలాలు వేరే జిల్లాల ఉన్నా ఐటీడీఏ ద్వారానే నడుస్తాయని అధికారులు వెల్లడించారు.
ఐటీడీఏ చైర్మన్ కమిషనరే...
ఇప్పటి వరకు వరంగల్ జిల్లా కలెక్టర్ ఐటీడీఏ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే జిల్లాల విభజనతో ఐటీడీఏ చైర్మన్‌గా గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మూడు జిల్లాలోని కలెక్టర్‌లకు కూడా ఐటీడీఏ ద్వారా సమాచారాన్ని అందిస్తుంటారు. కాగా, ఇతర జిల్లాల్లో ఉండే ఆయా మండలాల్లోని పరిపాలన విభాగానికి గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారిని నియమించి ఆయన ద్వారా పరిపాలన కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టు ఆఫీసర్ నేతృత్వంలో గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి పనిచేసే చర్యలు తీసుకోనున్నారు.