tribal welfare commissioner
-
ఆదివాసీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్/ములకలపల్లి: ఆదివాసీ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాచన్న గూడెం పంచాయతీ పరిధిలో ఆదివాసీ గూడెం, సాకివాగుకు చెందిన ముగ్గురు గొత్తికోయ ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ బీట్ గార్డులు అమానుషంగా ప్రవర్తించారన్న సంఘటనపై ఆమె స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఆదివాసీ మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అన్ని విధాలా న్యాయం జరుగుతుందని హామీఇచ్చారు. అడవిలో జీవనాధారం కోసం అటవీ ఉత్పత్తుల కోసం వెళ్లే ఆదివాసీల జోలికి వెళ్లొద్దని పలుమార్లు హెచ్చరించామని, అయినప్పటికీ కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, వారిని ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. మంత్రి ఆదేశాలతో గిరిజన సంక్షేమ శాఖ.. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని విచారణ అధికారిగా నియమించింది. దీంతో ములకలపల్లి తహసీల్దార్ వీరభద్రం ఐటీడీఏ అధికారులతో కలసి దాడి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అటవీ సిబ్బందిని విచారించారు. మరో పక్క బాధిత మహిళలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు తమకు జరిగిన అన్యాయంపై తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. తమతోపాటు ఇద్దరు బాలికలపై కూడా అటవీ సిబ్బంది దాడి చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై గొత్తికోయ మహిళలతోపాటు అటవీ సిబ్బంది కూడా తమకు ఫిర్యాదు చేశారని స్థానిక ఎస్సై తెలిపారు. మహిళలు తమ విధులకు ఆటంకం కలిగించినట్లు అటవీ సిబ్బంది ఫిర్యాదులో పేర్కొన్నారని ఆయన వెల్లడించారు. -
ఒక్కటే.. ఐటీడీఏ
ఒక్కరే ప్రాజెక్టు అధికారి మూడు జిల్లాలకు ఏజెన్సీ విస్తరణ ప్రతి మండలానికి ప్రత్యేక అధికారి చైర్మన్‌గా గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఏటూరునాగారం : జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏజెన్సీ మండలాలు మూడు జిల్లాల్లోకి వెళ్తున్నప్పటికీ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఒక్కటే ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలోని 13 ఏజెన్సీ మండలాలు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పాలనలో కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో ఐటీడీఏలోని కొన్ని మండలాలు భూపాలపల్లికి, మరికొన్ని మండలాలు మహబూబాబాద్(మానుకోట), మరికొన్ని వరంగల్ జిల్లాలో ఉండనున్నాయి. ఆ మండలాలు వేర్వేరు జిల్లాల్లోకి వెళ్లినా ప్రాజెక్టు అధికారి మాత్రం ఒక్కరే ఉంటారు. వాటిని ఏజెన్సీ నుంచి నాన్ ఏజెన్సీగా మార్చే అవకాశం లేకపోవడంతో అవి అలాగే కొనసాగుతాయి. ఇతర జిల్లాలోకి వెళ్లే ఏజెన్సీ మండలాలకు పరిపాలన అధికారి లేదా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారులను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీడీఏ పరిధిలో పనిచేసే ఉద్యోగల జాబితాలు, వారి హోదాలు, డిప్యూటేషన్లు వివరాలను కమిషనర్ కార్యాలయానికి పంపినట్టు తెలిసింది. ఐటీడీఏ పరిధిలోని ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సొంత జిల్లాకు కాకుండా మరో జిల్లాకు పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అందు కోసం ఉద్యోగుల నివాసం, చేస్తున్న ఉద్యోగం హోదా కూడిన పూర్తి సమాచారం ఐటీడీఏ నుంచి ఉన్నతాధికారులకు చేరింది. 13 మండలాలు మూడు జిల్లాల్లోకి.. ఏజెన్సీ పరిధిలో 13 మండలాలు ఉండగా జయశంకర్ జిల్లాలోకి భూపాలపల్లి, ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, గోవిందరావుపేట, ములుగు, వెంకటాపురం మండలాలు వెళ్లనున్నాయి. మహబూబాబాద్, కొత్తగూడ, గూడూరు మండలాలు మహబూబాబాద్ జిల్లాలోకి వెళ్లాయి. నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం మండలాలు వరంగల్ జిల్లా పరిధిలో ఉంటాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఐటీడీఏ మండలాల్లో 5.30 లక్షల మంది గిరిజనులు నివాసం ఉంటున్నారు. శ్రీశైలం ఐటీడీఏ మాదిరిగానే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా శ్రీశైలం ఐటీడీఏ లాగానే ఏటూరునాగారం ఐటీడీఏ కూడా మారనుంది. శ్రీశైలం ఐటీడీఏ కింద కూడా కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలు ఉన్నాయి. మండలాలు వేరే జిల్లాల ఉన్నా ఐటీడీఏ ద్వారానే నడుస్తాయని అధికారులు వెల్లడించారు. ఐటీడీఏ చైర్మన్ కమిషనరే... ఇప్పటి వరకు వరంగల్ జిల్లా కలెక్టర్ ఐటీడీఏ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే జిల్లాల విభజనతో ఐటీడీఏ చైర్మన్‌గా గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మూడు జిల్లాలోని కలెక్టర్లకు కూడా ఐటీడీఏ ద్వారా సమాచారాన్ని అందిస్తుంటారు. కాగా, ఇతర జిల్లాల్లో ఉండే ఆయా మండలాల్లోని పరిపాలన విభాగానికి గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారిని నియమించి ఆయన ద్వారా పరిపాలన కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టు ఆఫీసర్ నేతృత్వంలో గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి పనిచేసే చర్యలు తీసుకోనున్నారు. -
జీహెచ్ఎంసీకి ముగ్గురు ఐఏఎస్‌లు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. మంగళవారం జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా జీహెచ్ఎంసీకి కొత్తగా ముగ్గురు ఐఏఎస్‌లు వస్తున్నారు. కమిషనర్ ఎంటీ కృష్ణబాబు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను ప్రభుత్వం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమించింది. ప్రస్తుతం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) డెరైక్టర్‌గా ఉన్న డాక్టర్ జ్యోతిబుద్ధప్రకాశ్‌ను జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్‌గా బదిలీ చేసింది. ఎన్నికల సంఘం సెక్రటరీ నవీన్‌మిట్టల్ ప్రస్తుతం జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్ (ఎస్టేట్స్)గా ఉన్న జి.డి. ప్రియదర్శిని స్థానంలో పి.వెంకటరామిరెడ్డిని నియమించింది. వెంకటరామిరెడ్డిని ఇటీవలే కమర్షియల్ ట్యాక్స్ (కాకినాడ) డిప్యూటీ కమిషనర్‌గా నియమించగా, ఆ ఉత్తర్వును రద్దు చేస్తూ జీహెచ్ఎంసీకి బదిలీ చేసింది. బీహార్‌కు చెందిన సోమేష్‌కుమార్ గతంలో అనంతపురం జిల్లా కలెక్టర్‌గా.. గ్రామీణాభివృద్ధి, విద్యా శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. గత ఎంసీహెచ్‌లో అడిషనల్ కమిషనర్‌గా కూడా కొంతకాలం పని చేసినట్లు జీహెచ్ఎంసీ ఉద్యోగులు చెబుతున్నారు. జ్యోతిబుద్ధప్రసాద్ గతంలో భద్రాచలం ఐటీడీఏలో, కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. వెంకటరామిరెడ్డి గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. బదిలీ అయిన కృష్ణబాబు, ప్రియదర్శినిలకు ఇంకా పోస్టింగులు ఇవ్వలేదని సమాచారం. గ్రేటర్‌పై ‘కృష్ణ’ముద్ర.. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా కృష్ణబాబు గ్రేటర్‌పై తనదైన ముద్ర వేశారు. 2011 జూన్ 20న బాధ్యతలు చేపట్టిన ఆయన.. 28 నెలల కాలంలో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకందాల్సిన సేవలు.. జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆదాయం రెండింటిపైనా సమతుల్యం పాటించారు. తద్వారా ఆయన కమిషనరైన సంవత్సరంలో (2011-12) మున్నెన్నడూ లేని విధంగా రూ.650 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. గడచిన సంవత్సరం (2012-13) సైతం దాదాపు రూ. 780 కోట్లు వసూలు చేశారు. అయ్యప్ప సొసైటీలో బడాబాబుల అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కిన ఆయన.. ఒత్తిళ్లు, వివిధ కారణాలతో దాన్ని కొనసాగించ లేకపోయారు. టౌన్‌ప్లానింగ్‌లో అక్రమార్కుల భరతం పట్టేందుకు విజిలెన్స్ విచారణ జరిపించాలని ప్రభుత్వానికి లేఖ రాయగా, ప్రభుత్వం అందుకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కూడా విచారణ జరిపి టౌన్‌ప్లానింగ్‌లో భారీ అవినీతి ఉన్నట్లు నిర్ధారించింది. ఆరోగ్యం-పారిశుద్ధ్యం విభాగంలో బోగస్ కార్మికుల ఆట కట్టించేందుకు కాంట్రాక్టర్ల విధానాన్ని రద్దుచేసి, కార్మికులతోనే కొత్త గ్రూపుల్ని ఏర్పాటు చేసి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోనే వేతనాలు జమయ్యేలా చర్యలు తీసుకున్నారు. వృత్తిపన్ను, మోటారు వాహనపన్ను వంటి వాటిని రప్పించేందుకు ఎంతో కృషి చేశారు. ప్రసాదరావు కమిటీ సిఫార్సుల అమలుకు చొరవ చూపారు. ఆ మేరకు ప్రభుత్వం జీఓ జారీ చేయడంతో జీహెచ్ఎంసీకి కొత్తగా 2607 ఉద్యోగాలు రానున్నాయి. ఇంకా.. {పజా సమస్యల పరిష్కారానికి కాల్‌సెంటర్ {పజావాణి వంటివి అందుబాటులోకి తెచ్చారు బర్త్ సర్టిఫికెట్ల జారీలో జాప్యాన్ని అరికట్టే చర్యలు తీసుకున్నారు ప్లాస్టిక్ నిషేధం, సైకిల్‌ట్రాక్‌ల వంటివి పూర్తి చేయలేక పోయారు {పజలకవసరమైన ఫుట్‌పాత్‌లు, డక్టింగ్ వంటివి చేయలేకపోయారు గతేడాది సీఓపీ సదస్సు నిర్వహణలో ముఖ్యభూమిక పోషించారు జీహెచ్ఎంసీకి సంబంధించిన కొన్ని చట్టాల సవరణలో కీలకపాత్ర వహించారు