సాక్షి, హైదరాబాద్/ములకలపల్లి: ఆదివాసీ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాచన్న గూడెం పంచాయతీ పరిధిలో ఆదివాసీ గూడెం, సాకివాగుకు చెందిన ముగ్గురు గొత్తికోయ ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ బీట్ గార్డులు అమానుషంగా ప్రవర్తించారన్న సంఘటనపై ఆమె స్పందించారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఆదివాసీ మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అన్ని విధాలా న్యాయం జరుగుతుందని హామీఇచ్చారు. అడవిలో జీవనాధారం కోసం అటవీ ఉత్పత్తుల కోసం వెళ్లే ఆదివాసీల జోలికి వెళ్లొద్దని పలుమార్లు హెచ్చరించామని, అయినప్పటికీ కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, వారిని ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. మంత్రి ఆదేశాలతో గిరిజన సంక్షేమ శాఖ.. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని విచారణ అధికారిగా నియమించింది.
దీంతో ములకలపల్లి తహసీల్దార్ వీరభద్రం ఐటీడీఏ అధికారులతో కలసి దాడి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అటవీ సిబ్బందిని విచారించారు. మరో పక్క బాధిత మహిళలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు తమకు జరిగిన అన్యాయంపై తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. తమతోపాటు ఇద్దరు బాలికలపై కూడా అటవీ సిబ్బంది దాడి చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై గొత్తికోయ మహిళలతోపాటు అటవీ సిబ్బంది కూడా తమకు ఫిర్యాదు చేశారని స్థానిక ఎస్సై తెలిపారు. మహిళలు తమ విధులకు ఆటంకం కలిగించినట్లు అటవీ సిబ్బంది ఫిర్యాదులో పేర్కొన్నారని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment