రాష్ట్రపతి ద్రౌపదీముర్ముతో గవర్నర్ సౌందరరాజన్, మంత్రి సత్యవతి రాథోడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గిరిజనులు, ఆదివాసీలు, అత్యంత వెనుకబడిన గిరిజన తెగల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వివరించారు. గురువారం రాష్ట్రపతి నిలయంలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారంతో ద్రౌపదీ ముర్ము ముందు ప్రజెంటేషన్ ఇచ్చారు.
రాష్ట్రంలో పది గిరిజన సమూహాలైన లంబాడా, కోయ, గోండు, ఎరుకల, పర్దాన్, ఆందులు, కొలాములు, చెంచు, తోటి ఇంకా కొండారెడ్డి తెగల కోసం నాలుగు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లను ఏర్పాటు చేసినట్లు మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో షెడ్యూల్ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయని, వీటిలో 3,146 గిరిజన గ్రామపంచాయతీలు ఉన్నాయని వివరించారు.
రాష్ట్రంలోని 8.5 లక్షల మంది గిరిజన, ఆదివాసీ రైతులకు ఏటా రెండు విడతలురైతుబంధు పథకం కింద ఆర్థిక సాయా న్ని చేస్తున్నామని, ఇప్పటివరకు ఈ వర్గాలకు రూ.7,349 కోట్ల రూపాయలను వ్యవసాయ పెట్టుబడి సహాయంగా అందించామని మంత్రి.. రాష్ట్ర పతి ముర్ముకు తెలిపారు. అలాగే గిరిజన ఆవాసా లకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందిస్తున్నామని, గిరిజనుల ఆరోగ్య వస తుల కోసం కొత్తగా 437 సబ్ సెంటర్లు, 32 బర్త్ వెయిటింగ్ హాళ్లు, 7 డయాగ్నొస్టిక్ హబ్‌లను నిర్మించామన్నా రు. ఆదిమ గిరిజన తెగల ప్రాంతాలలో 31 పాఠశాలలు, కొలాముల సమూహం కోసం ప్రత్యేకించి ప్రైమరీ పాఠశాలలు, సైనిక్ పాఠశాల, న్యాయ విద్య, ఫైన్‌ఆర్ట్స్ కోసం ప్రత్యేక కళాశాలు ఏర్పాటు చేశామని, దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేక పాఠశాలలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
పంచాయతీలకు పక్కా భవనాలు, రహదారుల సౌకర్యాలు..
చెంచు, కొలాములు, కొండారెడ్డి తెగలకు అటవీ ఉత్పత్తులపై ప్రభుత్వ సహకారం అందుతోందని మంత్రి సత్యవతి తెలిపారు. అలాగే 440 ఆదిమ జాతి గిరిజన గ్రామాలలో రూ.60 కోట్లతో అంతర్గత రోడ్ల సదుపాయం, 53 ఆదిమ జాతి ఆవాసాలలో రూ.2.39 కోట్లతో సౌర విద్యుదీకరణ చేపట్టి 443 గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూర్చామన్నారు.
3,467 గిరిజన గ్రామాలకు రూ.221 కోట్లతో త్రీఫేజ్ విద్యుదీకరణ కల్పించామని, గిరిజన గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు మంజూరు చేశామని, రూ.3,275 కోట్లతో 5,162 కిలోమీటర్ల రహదారులను నిర్మించామని, 16,375 ఆదిమ జాతి పిల్లలు, గర్భిణిలు, బాలింతలకు, కౌమార దశలో ఉన్న అమ్మాయిలకు గిరి పోషణ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నామని మంత్రి సత్యవతి వివరించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర గిరిజన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment