సాక్షి, హైదరాబాద్: పోడుభూములకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను అత్యంత పారదర్శకంగా పరిశీలించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గురువారం డీఎస్‌ఎస్ భవన్‌లో ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. వచ్చే నెలలో పోడురైతులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని, వేగవంతంగా పరిశీలనను పూర్తి చేయాలన్నారు.
పోడుభూముల సర్వే ప్రక్రియను సైతం పక్కాగా నిర్వహించాలని సూచించారు. ఈ అంశంపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారని చెప్పారు. గ్రామ, డివిజన్, జిల్లా సభలను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా పూర్తిచేయాలన్నారు. దరఖాస్తుల పరిశీలన, సర్వే కోసం అవసరమైనచోట అదనపు బృందాలను ఏర్పాటు చేసుకుని ఆ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు. పోడుభూముల సర్వేతోపాటు గ్రామీణ రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి స్పష్టం చేశారు. గిరి వికాస్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. అనంతరం మంత్రి ఐటీడీఏ పీవోలకు ఆపిల్ ట్యాబ్‌లను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment