సాక్షి, హైదరాబాద్: అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో ‘మూడు నెలలుగా పాలు లేవ్’అనే శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. గురువారం ఉదయం ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆమె ప్రత్యేకంగా సమీక్షించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు మూడు నెలలుగా పాల సరఫరా నిలిచినందుకు గల కారణాలపై ఆరా తీశారు.
పాల పంపిణీ నిలిచిపోవడంతో పిల్లలకు పౌష్టికలోపాలను అధిగమించే కార్యక్రమం నీరుగారుతుందని చెబుతూ.. తక్షణమే పాల సరఫరా పునరుద్ధరించాలని ఆమె ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, టెండరు ఖరారు, కాంట్రాక్టరు ఎంపిక అయ్యే వరకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అందుకే పాలు సరఫరా చేయలేకపోయాం... కేఎంఎఫ్ వివరణ
ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడం వల్లే అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు పంపిణీ నిలిచిపోయిందని కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్(కేఎంఎఫ్) లిమిటెడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న తమ సంస్థ గతేడాది సెప్టెంబర్ నెల వరకు పూర్తిస్థాయిలో పక్కాగా సరఫరా చేసినట్లు వివరించింది.
గతేడాది సెప్టెంబర్‌తో కాంట్రాక్టు ముగిసిందని, కానీ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ వాఖ ప్రత్యేక ఆదేశాలతో పాల పంపిణీ కొనసాగించాలని నిర్ణయించినట్లు వివరించింది. కానీ పాడి పశువులు పెద్ద సంఖ్యలో లంపిస్కిన్ వ్యాధి బారిన పడడంతో పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని, దానికితోడు గత నవంబర్, డిసెంబర్‌లలో తీవ్ర వర్షాలు కురవడంతో పాల రవాణా పడిపోయిందని, దీంతో పాల కేంద్రాలకు కోటా రాలేదని వివరించింది. త్వరలోనే పాల పంపిణీకి చర్యలు తీసుకుంటామని కేఎంఎఫ్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment