జీహెచ్‌ఎంసీకి ముగ్గురు ఐఏఎస్‌లు | 3 IAS officers to GHMC | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీకి ముగ్గురు ఐఏఎస్‌లు

Published Wed, Oct 23 2013 2:31 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM

3 IAS officers to GHMC

 సాక్షి, సిటీబ్యూరో:
 జీహెచ్‌ఎంసీలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. మంగళవారం జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా జీహెచ్‌ఎంసీకి కొత్తగా ముగ్గురు ఐఏఎస్‌లు వస్తున్నారు. కమిషనర్ ఎంటీ కృష్ణబాబు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమించింది. ప్రస్తుతం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) డెరైక్టర్‌గా ఉన్న డాక్టర్ జ్యోతిబుద్ధప్రకాశ్‌ను జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్‌గా బదిలీ చేసింది. ఎన్నికల సంఘం సెక్రటరీ నవీన్‌మిట్టల్ ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో అడిషనల్ కమిషనర్ (ఎస్టేట్స్)గా ఉన్న జి.డి. ప్రియదర్శిని స్థానంలో పి.వెంకటరామిరెడ్డిని నియమించింది. వెంకటరామిరెడ్డిని ఇటీవలే కమర్షియల్ ట్యాక్స్ (కాకినాడ) డిప్యూటీ కమిషనర్‌గా నియమించగా, ఆ ఉత్తర్వును రద్దు చేస్తూ జీహెచ్‌ఎంసీకి బదిలీ చేసింది. బీహార్‌కు చెందిన సోమేష్‌కుమార్ గతంలో అనంతపురం జిల్లా కలెక్టర్‌గా.. గ్రామీణాభివృద్ధి, విద్యా శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. గత ఎంసీహెచ్‌లో అడిషనల్ కమిషనర్‌గా కూడా కొంతకాలం పని చేసినట్లు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు చెబుతున్నారు.
 
  జ్యోతిబుద్ధప్రసాద్ గతంలో భద్రాచలం ఐటీడీఏలో, కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. వెంకటరామిరెడ్డి గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. బదిలీ అయిన కృష్ణబాబు, ప్రియదర్శినిలకు ఇంకా పోస్టింగులు ఇవ్వలేదని సమాచారం.
 
   గ్రేటర్‌పై ‘కృష్ణ’ముద్ర..
 జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా కృష్ణబాబు గ్రేటర్‌పై తనదైన ముద్ర వేశారు. 2011 జూన్ 20న బాధ్యతలు చేపట్టిన ఆయన.. 28 నెలల కాలంలో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకందాల్సిన సేవలు.. జీహెచ్‌ఎంసీకి రావాల్సిన ఆదాయం రెండింటిపైనా సమతుల్యం పాటించారు. తద్వారా ఆయన కమిషనరైన సంవత్సరంలో (2011-12) మున్నెన్నడూ లేని విధంగా రూ.650 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. గడచిన సంవత్సరం (2012-13) సైతం దాదాపు రూ. 780 కోట్లు వసూలు చేశారు. అయ్యప్ప సొసైటీలో బడాబాబుల అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కిన ఆయన.. ఒత్తిళ్లు, వివిధ కారణాలతో దాన్ని కొనసాగించ లేకపోయారు. టౌన్‌ప్లానింగ్‌లో అక్రమార్కుల భరతం పట్టేందుకు విజిలెన్స్ విచారణ జరిపించాలని ప్రభుత్వానికి లేఖ రాయగా, ప్రభుత్వం అందుకు ఆదేశించింది.
 
  హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కూడా విచారణ జరిపి టౌన్‌ప్లానింగ్‌లో భారీ అవినీతి ఉన్నట్లు నిర్ధారించింది. ఆరోగ్యం-పారిశుద్ధ్యం విభాగంలో బోగస్ కార్మికుల ఆట కట్టించేందుకు కాంట్రాక్టర్ల విధానాన్ని రద్దుచేసి, కార్మికులతోనే కొత్త గ్రూపుల్ని ఏర్పాటు చేసి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోనే వేతనాలు  జమయ్యేలా చర్యలు తీసుకున్నారు. వృత్తిపన్ను, మోటారు వాహనపన్ను వంటి వాటిని రప్పించేందుకు ఎంతో కృషి చేశారు. ప్రసాదరావు కమిటీ సిఫార్సుల అమలుకు చొరవ చూపారు. ఆ మేరకు ప్రభుత్వం జీఓ జారీ చేయడంతో జీహెచ్‌ఎంసీకి కొత్తగా 2607 ఉద్యోగాలు రానున్నాయి. ఇంకా..
     {పజా సమస్యల పరిష్కారానికి కాల్‌సెంటర్  
     {పజావాణి వంటివి అందుబాటులోకి తెచ్చారు
     బర్త్ సర్టిఫికెట్ల జారీలో జాప్యాన్ని అరికట్టే చర్యలు తీసుకున్నారు
     ప్లాస్టిక్ నిషేధం, సైకిల్‌ట్రాక్‌ల వంటివి పూర్తి చేయలేక పోయారు
     {పజలకవసరమైన ఫుట్‌పాత్‌లు, డక్టింగ్ వంటివి చేయలేకపోయారు
     గతేడాది సీఓపీ సదస్సు నిర్వహణలో ముఖ్యభూమిక పోషించారు
     జీహెచ్‌ఎంసీకి సంబంధించిన కొన్ని చట్టాల సవరణలో కీలకపాత్ర వహించారు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement