డబుల్‌ ఇళ్లు, చెరువుల ప్రక్షాళన వారిదే | Women IAS Officers Special Story Hyderabad | Sakshi
Sakshi News home page

యూ ఆర్‌ గ్రేట్‌

Published Mon, Jul 30 2018 11:42 AM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

Women IAS Officers Special Story Hyderabad - Sakshi

సిక్తా పట్నాయక్‌, హరిచందన,శృతి ఓజా, భారతి హొళికేరి

‘రాష్ట్రంలోని ఐఏఎస్‌ అధికారుల్లో దాదాపు 15 మంది మున్సిపల్‌ పరిపాలనశాఖలోనే ఉన్నారు. ఈ శాఖకు ప్రభుత్వమిచ్చిన ప్రాధాన్యమిది’.. ఇటీవల మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్య ఇది. ఆ అధికారుల్లో ఏడుగురు జీహెచ్‌ఎంసీలోనే పనిచేస్తున్నారు. అందులో నలుగురు మహిళా ఆఫీసర్లే. కోటిజనాభా ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ, ప్లాస్టిక్‌ నిషేధం వంటి పనులతో పాటు ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పర్యవేక్షణ, చెరువుల సుందరీకరణ తదితర వ్యవహారాలను సైతం వారే చూస్తున్నారు. కీలకజోన్లు, విభాగాలకు బాధ్యతలు వహిస్తున్న వారు తమ విధుల్లో కొత్త ఆలోచనలతో దూసుకెళుతున్నారు. ఆ అధికారులపై ప్రత్యేక కథనం.

జీహెచ్‌ఎంసీలోని ఆరు జోన్లలో ఎంతో కీలకమైన ఖైరతాబాద్‌ జోన్‌కుమహిళా ఐఏఎస్‌ బాధ్యతలు వహిస్తున్నారు. ఐటీ రంగం, మల్టీ నేషనల్‌ కంపెనీలు కొలువుదీరిన శేరిలింగంపల్లి జోన్‌ కమిషనర్‌గానూ మహిళే ఉన్నారు. కీలక జోన్లు, కీలక విభాగాలకు బాధ్యతలు వహిస్తున్న ఈ అధికారులు మహానగరాన్ని ‘క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీ’గా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.సరికొత్త ఆలోచనలతో దూసుకెళుతున్నారు.

సాక్షి, సిటీబ్యూరో  :డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు.. ఇటు లక్షలాది ప్రజలు ఆశల కల. అటు దేశంలో మరెక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బృహత్కార్యం.  మూసీ సుందరీకరణ.. ముక్కుమూసుకునే పరిస్థితి నుంచి దాన్ని ప్రక్షాళన చేసి, సుందరీకరించేందుకు ప్రభుత్వం పెట్టుకున్న పెద్ద లక్ష్యం.జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ హోదాలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పర్యవేక్షణతో పాటు మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సీఈఓగా, చెరువుల సుందరీకరణ స్పెషల్‌ ఆఫీసర్‌గా, జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌గా బహుముఖ విధులు నిర్వహిస్తున్నారు భారతి హొళికేరి. వచ్చే ఏప్రిల్‌ నాటికి నగరంలో లక్ష డబుల్‌ ఇళ్ల ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. డిసెంబర్‌ నాటికి 40వేల ఇళ్లను పూర్తిచేస్తామని ధీమాగా చెబుతున్న ఈమె.. పనుల నాణ్యతలోనూ ఏమాత్రం రాజీ పడడం లేదన్నారు. ఇళ్లు పూర్తయ్యేనాటికే నివాసానికి వీలుగా తాగునీరు, డ్రైనేజీ, రహదారులు వంటి అన్ని సదుపాయాలు పూర్తి చేయనున్నారు. దశలవారీగా పాఠశాల, ఆస్పత్రుల భవనాలు తదితరమైనవన్నీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఈమేరకు సంబంధిత ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో పనిచేస్తున్నారు. 15 వేల పైచిలుకు ఇళ్లతో కొల్లూరు టౌన్‌షిప్‌గా మారనుంది. రాంపల్లి ప్రతాప్‌ సింగారం తదితర ప్రాంతాల్లోనూ వేల ఇళ్ల నిర్మాణంతో ఆ ప్రాంతాల రూపురేఖలే మారిపోనున్నాయి. పేదలకు గౌరవప్రద హోదా కల్పించే బృహత్‌ కార్యక్రమాన్ని గడువులోగా పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఇళ్లు పూర్తయ్యేందుకు టన్నెల్‌ఫామ్‌ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. అహ్మద్‌గూడలో నిర్మించే ఇళ్ల నమూనాను లక్నోలో ‘ట్రాన్స్‌ఫార్మింగ్‌ అర్బన్‌ లాండ్‌ స్కేపింగ్‌’ అంశంపై శుక్రవారం జరిగిన సదస్సులో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి ఇచ్చిన పవర్‌పాయింట్‌ ప్రెజంటేషన్‌ పలువురిని ఆకట్టుకుంది. నగరంలోని చెరువుల ఎఫ్‌టీఎల్‌ గుర్తింపు సరిగ్గా జరగని నేపథ్యంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖలతో తిరిగి ఎఫ్‌టీఎల్‌లను నిర్ధారించి చెరువుల  సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. తొలిదశలో 40 చెరువుల సుందరీకరణ చేపట్టనుండగా, వీటిల్లో 20 జీహెచ్‌ఎంసీ నిధులతో, 20 హెచ్‌ఎండీఏ నిధులతో చేపట్టనున్నారు. జీహెచ్‌ఎంసీకి వచ్చిన ఏడు నెలల్లోనే భారతి ఎన్నో కీలక నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. 

హరిచందనం.. సేవలకు వందనం
‘మాకూ ఇవాంకా రోడ్లు కావాలి’.. అంటూ నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలు సోషల్‌ మీడియాలో డిమాండ్‌ చేశారంటే.. అందుకు కారణం జీఈఎస్‌ (ప్రపపంచ పారిశ్రామికవేత్తల సదస్సు) సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంఫ్‌ కుమార్తె ఇవాంకా రాకను పురస్కరించుకొని హైటెక్‌ సిటీ ప్రాంతంలో నిర్మించిన అద్దం లాంటి రోడ్లే. ఇంజినీరింగ్‌ విభాగం సహకారంతో మైక్రో సర్ఫేసింగ్, తదితర విధానాల్లో నిర్మించిన ఈ రోడ్లను చూసి ఇతర ప్రాంతాల వారు ఈర‡్ష్య పడ్డారు. కొత్తగా ఆలోచించడం.. సరికొత్తగా పనులు చేయడంలో అందెవేసిన హరిచందన ‘పంచతంత్రం’ పేరిట గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన పార్కులో పంచతంత్రాన్ని ప్రజల కళ్ల ముందుంచారు. పిల్లలు నీతి కథలను చదవడానికి తీరికలేని నగర జీవనంలో ఆహ్లాదం కోసం పార్కుకు వెళ్లినా.. ‘పంచతంత్రం’ కథలు తెలుసుకునేలా చేశారు. కుక్కల కోసం కొండాపూర్‌లో ఓ పార్కును తీర్చిదిద్దుతున్నారు. హరిచందన చేసిన ఇతర ముఖ్యమైన పనుల్లో.. 

 ‘లూ కేఫ్‌’.. పేరులోనే కాదు ప్రజలను ఆకట్టుకుంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న  లగ్జరీ పబ్లిక్‌ టాయ్‌లెట్స్‌. అత్యవసరం అయినా.. పబ్లిక్‌ టాయ్‌లెట్లలోకి వెళ్లలేక జడుసుకునే స్థాయి నుంచి స్మార్ట్‌గా కొత్త రూపమిచ్చారు. వీటికి లభిస్తున్న స్పందనతో మరో 80 లూ కేఫ్‌ల ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ టెండర్లు పిలిచింది. 

 2015 జనవరిలో నార్త్‌జోన్‌ కమిషనర్‌గా జీహెచ్‌ఎంసీలో చేరారు. అనంతరం సెంట్రల్‌జోన్‌ కమిషనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం శేరిలింగంపల్లి జోన్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. జోనల్‌ కార్యాలయంలో పర్యావరణహిత వెదురు గదుల నిర్మాణంతో పాటు కుత్బుల్లాపూర్‌లో యానిమల్‌ షెల్టర్, సంజీవయ్యపార్కు రోడ్‌లో చెత్త రవాణా కేంద్రం, కేకేఆర్‌ పార్కులో ఎల్‌ఈడీ స్క్రీన్లు, ట్యాంక్‌బండ్‌పై ‘లవ్‌ హైదరాబాద్‌’ సింబల్, ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి పర్మియబుల్‌ కాంక్రీట్‌ ప్రయోగం,  గ్రీన్‌ ఆఫీస్‌ బిల్డింగ్‌ అమలు ఈమే ఆలోచనలే. వెస్ట్‌జోన్‌ కార్యాలయానికి ‘ఐఎస్‌ఓ 14001’ సర్టిఫికెట్‌ పొందడం ద్వారా ప్రత్యేకత సాధించారు.

ఆస్పత్రుల పనుల్లో సిక్తా..
దాదాపు ఆర్నెళ్ల క్రితం జీహెచ్‌ఎంసీకి బదిలీపై వచ్చిన సిక్తా పట్నాయక్‌కు ఆరోగ్యం, రవాణా, ఎంటమాలజీ, ఎన్‌యూహెచ్‌ఎం(నేషనల్‌ అర్బన్‌ హెల్త్‌ మిషన్‌) విభాగాల  అడిషనల్‌ కమిషనర్‌ విధులతో పాటు జీవవైవిధ్య విభాగం పర్యవేణ బాధ్యతలు చూసుక్తన్నారు. బస్తీల్లోని పేదలకు ప్రాథమిక వైద్యం, వైద్యపరీక్షలతో పాటు అవసరమైన వారిని పెద్దాస్పత్రులకు పంపించే బస్తీ దవాఖానాల ఏర్పాటుపై దృష్టి సారించారు. తొలిదశలో 17 బస్తీ దవాఖానాలు పని ప్రారంభించాయి. మరో 53 ఏర్పాటు ప్రక్రియలో ఉన్నాయి. నగరంలోని 280 ప్రాంతాల్లో డెంగీ, మలేరియా వ్యాధుల వ్యాప్తికి కారణమైన దోమలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. అక్కడ దోమల తీవ్రత తగ్గించే కార్యక్రమాలపై దృష్టి సారించారు. జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ, యూసీడీ విభాగాలతో పాటు జిల్లా మలేరియా విభాగం, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం నుంచి మెటర్నిటీ లీవు తీసుకున్న సిక్తా పట్నాయక్‌ తిరిగి జనవరిలో విధుల్లోకి రానున్నారు.  

పారిశుధ్య సేవలో శ్రుతి ఓజా..
నాలుగు నెలల క్రితం బదిలీపై జీహెచ్‌ఎంసీకి వచ్చిన శ్రుతి ఓజా పారి«శు«ధ్యం, ఘనవ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛ భారత్‌ మిషన్‌(ఎస్‌బీఎం) కార్యక్రమాల అడిషనల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. నగరాన్ని ‘ప్లాస్టిక్‌ ఫ్రీ సిటీ’ చేసే కార్యక్రమంతో పాటు తడి–పొడి చెత్తను ఉత్పత్తి స్థానాల్లోనే వేరు చేసేందుకు ప్రజల్లో చైతన్యం కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. పర్యావరణానికి హానిచేసే ప్లాస్టిక్‌ను తమ పరిధిలో ఎంతమేర వినియోగిస్తున్నారో ప్రజలకు అర్థమయ్యేందుకు బ్లాక్‌ బ్యాగ్‌ కాంపైన్‌లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లోని ప్లాస్టిక్‌వ్యర్థాలను నల్లబ్యాగుల్లో నింపి రోజుకు ఎంత ప్లాస్టిక్‌ను వాడిపారేస్తున్నారో స్థానికులకు ప్రదర్శించే కార్యక్రమాలు నిర్వహించారు. తద్వారా వారిలో మార్పు తేగలమని భావిస్తున్నారు. స్వచ్ఛ పౌరులుగా తామేం చేయగలరో ప్రజలతో సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. వివిధ ప్రచార, ప్రసార సాధనాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు చేపట్టారు. అవగాహనతో పాటు నిబంధనలు పాటించని వారికి జరిమానాలూ విధిస్తున్నారు. 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌ నిషేధం అమల్లో భాగంగా వాటిని విక్రయిస్తున్న, వినియోగిస్తున్న వ్యాపారులకు ఒక్క జూన్‌లోనే రూ.5,22,300 జరిమానాలు విధించారు. రోజుకు 50 టన్నుల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే సంస్థలు ఆగస్టు 15 నుంచి తమ ఆవరణలోనే కంపోస్ట్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలనే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement