‘గ్రేటర్’ టీమ్ రెడీ
‘గ్రేటర్ టీమ్’ వచ్చేసింది. మహానగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు పనిమంతులను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆశలు, ఆశయాలు నెరవేరేలా... యువ ఐఏఎస్ అధికారులను తగినంతమందిని నియమించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పలు కీలక పోస్టుల్లో ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వగా వారిలో కొందరు విధుల్లో చేరారు.
‘గ్రేటర్’ టీమ్ వచ్చేసింది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కంకణబద్ధమైన ప్రభుత్వం, ఆదిశగా తగినంత మంది ఐఏఎస్ అధికారులను కేటాయించింది. గ్రేటర్‌లో కీలకబాధ్యతలు నిర్వహించే జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్, రంగారెడ్డిజిల్లాలకు అధికారులను నియమించింది. వీరిలో యువతకు ప్రాధాన్యతనిస్తూనే, అనుభవజ్ఞుల సేవలను వినియోగించుకునేందుకు సిద్ధమైంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కంప్యూటర్ రంగంలో పరిజ్ఞానమున్నవారితోపాటు ..నగర రూపురేఖలు మార్చడంలో ముఖ్యశాఖలైన పట్టణాభివృద్ధి, రెవెన్యూ విభాగాల్లో సమర్థవంతంగా పనిచేయగలరనుకున్న వారిని నియమించారు. హైదరాబాద్ ముఖచిత్రాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దడమేకాకుండా, సమస్యల్లేని షహర్‌గా, ఆకాశహర్మ్యాలతో అద్భుత నగరంగా మార్చేందుకు ప్రభుత్వం వీరి సేవలను వినియోగించుకోనుంది. జీహెచ్‌ఎంసీకి ఐదుగురు ఐఏఎస్‌లను కేటాయించడంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను, చీఫ్ రేషనింగ్ అధికారిని నియమించింది. భూముల క్రమబద్ధీకరణ, పేదలకు ఆహారభద్రత, పెన్షన్లు, నగర సుందరీకరణ తదితర పనులను సవాల్‌గా తీసుకొని కొత్త అధికారులు పనిచేయాల్సి ఉంది.
నగరంలో చేసే ఏపని అయినా రాష్ట్రంలోనే కాక ఇతర ప్రాంతాల్లోనూ ప్రతిబింబించే అవకాశం ఉండటంతో కొత్త అధికారులు పనితీరు నిరూపించుకోవాల్సి ఉంది. జీహెచ్‌ఎంసీకి సంబంధించినంతవరకు విశ్వనగరంగా అభివృద్ధి, స్మార్ట్‌సిటీలో భాగంగా ఈ-ఆఫీస్ అమలు వంటివి కీలకం. దీంతోపాటు హరితహారం, క్లీన్ సిటీలకు ప్రాధాన్యతనిస్తున్నారు. వీరిలో ఈ రంగాల్లో తగిన అనుభవమున్నవారు ఉన్నారు. జీహెచ్‌ంఎసీకి ఒక ఐఎఫ్‌ఎస్ అధికారి కూడా వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా, జీహెచ్‌ఎంసీ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన ఇద్దరు స్పెషల్ కమిషనర్లు ఎ.బాబు, ప్రద్యుమ్నల స్థానంలో ఇద్దరు స్పెషల్ కమిషనర్లను జీహెచ్‌ఎంసీకి బదిలీ చేశారు. మిగతా ముగ్గురు ఐఏఎస్‌లను ప్రధాన కార్యాలయంలో ఉంచుతారా, లేక వారి సేవలు జోన్లలో వినియోగించుకుంటారా అనేది కమిషనర్ సోమేశ్‌కుమార్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. జీహెచ్‌ఎంసీలోని ఐదు జోన్లకుగాను సెంట్రల్, వెస్ట్, నార్త్‌జోన్ల కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, అందరూ విధుల్లో చేరాక వారికప్పగించాల్సిన బాధ్యతలపై నిర్ణయం తీసుకుంటామని స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. ఇదిలా ఉండగా, స్పెషల్ కమిషనర్‌గా నవీన్‌మిట్టల్, అడిషనల్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సోమవారమే విధుల్లో చేరారు. మిగతా ముగ్గురు రావాల్సి ఉంది. ఇంతకు ముందు కూడా నవీన్ మిట్టల్ జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్‌గా పనిచేశారు.
నవీన్‌మిట్టల్, (స్పెషల్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ)
నవీన్‌మిట్టల్ స్వరాష్ట్రం పంజాబ్. ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చేసిన ఆయన 1996 బ్యాచ్‌కు చెందిన వారు. విజయవాడ, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్‌గా, హైదరాబాద్, కృష్ణా జిల్లాల కలెక్టర్‌గా కూడా పనిచేశారు. గతంలో వరంగల్ సబ్‌కలెక్టర్‌గా, ఆదిలాబాద్ గిరిజనాభివృద్ధిసంస్థ ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా, తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా, వాణిజ్యపన్నుల విభాగం డిప్యూటీ కమిషనర్‌గా కూడా పనిచేసిన ఆయనకు నగరంలోని వివిధ అంశాలపై మంచి అవగాహన ఉంది. పట్టణాభివృద్ధి, రెవెన్యూ విభాగాలపై తగిన పట్టు ఉంది. అంతే కాకుండా స్వీపింగ్ కార్మికుల ఏ నెల జీతం ఆనెల వారి బ్యాంకు ఖాతాల్లోనే పడేలా అవసరమైన చర్యలు చేపట్టారు. ఒకేరోజు ఏకకాలంలోనిర్వహించిన తనిఖీలతో బోగస్ స్వీపింగ్ యూనిట్ల అవినీతిని బట్టబయలు చేశారు. ఇంకా, ఆరోగ్యం-పారిశుధ్యం విభాగంలో పలు సంస్కరణలు తెచ్చి కార్మికులకు అన్యాయం జరుగకుండా అడ్డుకున్నారు. 12 మంది సభ్యులతో ఉన్న స్వీపింగ్ యూనిట్లలోని సభ్యుల సంఖ్యను 7కు తగ్గించడంలో ఇతరత్రా అంశాల్లో ఎంతో శ్రద్ధ చూపారు.