district bifurcation
-
'జిల్లాల రద్దు ఉండదు..'
సాక్షి, వరంగల్: తెలంగాణలో పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన 31 జిల్లాలలో దేన్ని రద్దు చేయమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఆయనిక్కడ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని జిల్లాలను రద్దు చేయునున్నట్టు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. జిల్లాలను రద్దు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు సంబంధించి ఎక్కడైనా గ్రామాలు, సరిహద్దు విషయంలో సమస్యలు ఉంటే సర్దుబాటు చేస్తామన్నారు. మరోవైపు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ పై ప్రజా ప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం లేదని.. ఈ సమస్య పరిష్కారానికి సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. -
'కొత్త జిల్లాలతో ఏం సాధించారు'
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి ఏం సాధించారని బీజేపీ నాయకుడు ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. కొత్త కలెక్టరేట్లు ప్రారంభించి ఏడాది పూరైనా ఇప్పటివరకు నూతన భవనాలు ఎందుకు నిర్మించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. కొత్త జిల్లా కార్యాలయాల్లో 50 శాతం మంది స్టాఫ్ కూడా లేదు. నాలుగు నెలలుగా పెద్దపల్లి జిల్లాకు కలెక్టర్ లేరు అయినా సీఎం పట్టించుకోవడం లేదు. పాలన చేరువ చేయడం కోసం జిల్లాల విభజన అన్న కేసీఆర్ సమస్యల పరిష్కారానికి మాత్రం ముందుకు రావడం లేదన్నారు. -
దొంగల్లా కొండంగల్ ను విభజించారు: రేవంత్
-కొడంగల్‌ను పాలమూరు జిల్లాలో ఉంచాలి -పట్టణాన్ని డివిజన్ కేంద్రంగా ప్రకటించాలి -దుద్యాల, గుండుమాల్ను మండలాలు చేయాలి -రిలే దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కొడంగల్ : కొడంగల్ నియోజకవర్గాన్ని పాలమూరు జిల్లాలో ఉంచాలని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అఖిల పక్షం, కొడంగల్ నియోజకవర్గ సాధన కమిటీ ఆధ్వర్యంలో 12 రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహర దీక్షలో ఆయన పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొడంగల్ పట్టణాన్ని డివిజన్ కేంద్రంగా ప్రకటించాలన్నారు. బొంరాస్‌పేట మండలం దుద్యాల, కోస్గి మండలం గుండుమాల్ గ్రామాలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేస్తున్న ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. కనీసం వార్డు మెంబర్‌కు కూడా గెలవలేని నిరంజన్‌రెడ్డి మాటలు వింటున్న ముఖ్యమంత్రి తెలంగాణా ప్రజల మనోభావాలను గౌరవించడం లేదని ఆరోపించారు. తనపై రాజకీయంగా గెలవలేక కుట్రలు, కుతంత్రాలు చేసి నియోజకవర్గాన్ని ఛిన్నాభిన్నం చేశారన్నారు. జిల్లా మంత్రులకు, ఎంపీ జితేందర్‌రెడ్డికి, మంత్రి వర్గ ఉప సంఘానికి తాను వ్యక్తిగతంగా కలిసి కొడంగల్ నియోజకవర్గాన్ని పాలమూరులోనే ఉంచాలని సూచించినట్లు చెప్పారు. ఇక్కడి మాజీ ఎమ్మెల్యే లేఖ ఇవ్వడం వల్ల రాత్రికి రాత్రి దొంగల్లా కొడంగల్‌ను విభజించి మూడు మండలాలను వికారాబాద్‌లో, రెండు మండలాలను పాలమూరులో కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. కొడంగల్‌కు అన్యాయం జరగడానికి ప్రభుత్వ ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉందన్నారు. డ్రాప్ట్ నోటీఫికేషన్ వరకు కొడంగల్ నియోజకవర్గాన్ని పాలమూరు జిల్లాలో ఉంచిన తర్వాత విభజించడం వెనుక కుట్ర దాగుందన్నారు. తనపై రాజకీయ కక్ష సాధించాలంటే వ్యక్తిగతంగా చూసుకోవాలని సవాల్ విసిరారు. నియోజకవర్గ ప్రజలు ఏ పాపం చేశారని ప్రశ్నించారు. కొడంగల్ నుంచి 5 సార్లు శాసనసభ్యునిగా గెలిచిన గురునాథ్‌రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని అన్నారు. ఐదుసార్లు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం గురునాథ్‌రెడ్డి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వారం రోజుల్లోపు ముఖ్యమంత్రి అపాయిమెంట్ తీసుకోవాలని గురునాథ్‌రెడ్డికి సూచించారు. పార్టీలకు అతీతంగా స్థానిక ప్రజా ప్రతినిధులను తీసుకెళ్లి ముఖ్యమంత్రిని కలిసి ఇక్కడి ప్రజల ఆవేదన వినిపించడానికి తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. ఆయన ఆధ్వర్యంలో తాను ఎక్కడికైనా రావడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. న్యాయపరంగా పోరాటం చేయడానికి ఇప్పటికే బొంరాస్‌పేట, దౌల్తాబాద్ నాయకులు కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. -
సర్దుబాటు గుబులు!
కార్యాలయాల్లో కనిపించని దసరా సందడి వర్క్ టు సర్వ్ ఆర్డర్ల జారీపై మీమాంస కొత్త జిల్లాలతో పండగకు ఉద్యోగులు దూరం మీరే జిల్లాకు వెళ్తున్నారు? మీకెక్కడ పోస్టింగ్ ఇస్తున్నారు? వర్క్ టు సర్వ్ ఆర్డర్లను ఏ రోజున జారీ చేస్తారు? ఏ ఉద్యోగిని కదిలించినా ఇదే చర్చ. ఉన్నతాధికారి మొదలు కిందిస్థాయి సిబ్బంది వరకు ఇదే ఆలోచన. కొత్త జిల్లాల ప్రారంభానికి ముహూర్తం దగ్గర పడుతుండడంతో ఉద్యోగవర్గాల్లో కలవరం మొదలైంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మరో నాలుగు రోజుల్లో నూతన జిల్లాలు మనుగడలోకి రానున్నారుు. దీంతో ఆయా జిల్లాలకు ఉద్యోగులు తరలివెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవశేష రంగారెడ్డి జిల్లా మూడు ముక్కలుగా విడిపోనుంది. రంగారెడ్డి సహా వికారాబాద్, మేడ్చల్ పేరిట మరో రెండు కొత్త జిల్లాలకు అంకురార్పణ జరిగింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులనే మూడు జిల్లాలకు సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఇందులో భాగం గా ఇప్పటికే విభాగాధిపతులు, అధికారులు, సిబ్బంది మొదలు ప్రతి ఉద్యోగి విభజనకు సంబంధించిన జాబితాను సిద్ధం చేసింది. ఈ మేరకు ఆయా శాఖాధిపతులు ఉద్యోగుల కేటారుుంపుల ప్రక్రియను కొలిక్కి తెచ్చారు. అరుుతే, ఎవరికి ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారనే అంశాన్ని గోప్యంగా ఉంచారు. ఈ గోప్యతే ఉద్యోగవర్గాలను గందరగోళంలో పడేసింది. పోస్టింగ్‌లపై స్పష్టత లేకపోవడం.. వర్క్‌టు సర్వ్ ఆర్డర్లతో విధిగా నిర్దేశించిన చోటకు తరలివెళ్లాల్సిన పరిస్థితి అనివార్యం కానుంది. బదిలీల ఫీవర్! జిల్లాల పునర్విభజనతో ఉద్యోగవర్గాల్లో దసరా సందడి కనిపించడంలేదు. బదిలీల గుబులుతో విజయదశమిపై అంతగా ఆసక్తిని కనబరచడంలేదు. పునర్విభజనతో సంబంధం ఉన్న ఉద్యోగులకు పండగ సెలవు రద్దు చేయడమేకాకుండా.. 10వ తేదీన ప్రకటించిన ఐచ్చిక సెలవు రోజు కూడా విధిగా విధులకు హాజరుకావాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. దీనికితోడు ఇప్పటివరకు బదిలీలపై స్పష్టతనివ్వకపోవడం.. ప్రస్తుత జిల్లాలోనే కొనసాగుతామా? కొత్తగా ఏర్పడుతున్న జిల్లాలకు బదిలీ అవుతున్నామా అనే విషయాలను తేల్చుకోలేక సతమతమవుతున్నారు. కలెక్టరేట్, జిల్లాస్థారుులోని అన్ని కార్యాలయాల్లో 2,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిని మూడు జిల్లాలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుత రంగారెడ్డి జిల్లాను మినహారుుస్తే.. దాదాపు 1,800 మందికి స్థానచలనం తప్పదన్నమాట. ఇంతవరకు స్పష్టత ఉన్నా.. వర్క్ టూ సర్వ్ ఆర్డర్లను జారీ చేసేవరకు ఉత్కంఠకు తెరపడదు. మరోవైపు కిందిస్థారుు ఉద్యోగులే కాదు.. ఆఖరికి అఖిలభారత సర్వీసుల అధికారులు మొదలు ఆయా శాఖల విభాగాధిపతులకు కూడా బదిలీల ఫీవర్ పట్టుకుంది. -
కోరుట్ల ఊసేది..?
రెవెన్యూ డివిజన్‌పై వీడని ఉత్కంఠ కోరుట్ల: జిల్లాల పునర్విభజన విషయంలో కోరుట్ల ప్రజలు రెవెన్యూ డివిజన్ ఆకాంక్షను వెలిబుచ్చుతూ పెద్ద మొత్తంలో వినతులు పంపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 17,612 అభ్యంతరాలు వచ్చాయి. ఈ విషయంలో సర్కార్ సానుకూలంగా స్పందిస్తుందని స్థానికులు ఆశించారు. అభ్యంతరాలు గడువు ముగిసి పదిహేను రోజులైనా కోరుట్ల రెవెన్యూ డివిజన్ గురించి పట్టించుకోకపోవడం స్థానికంగా చర్చనీయమైంది. పరిశీలన జరిగిందా..? కోరుట్ల రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతూ వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యంతరాలు సరైనవి కావనుకుంటే ఈ విషయంపై ఏ ప్రకటన చేయకపోవడం చర్చనీయమైంది. తప్పుడు పద్ధతిలో అభ్యంతరాలు పంపారని గద్వాల జిల్లాను మొదట పక్కన పెట్టిన ప్రభుత్వం తరువాత వచ్చిన రాజకీయ ఒత్తిళ్లతో జిల్లా ఏర్పాటు అంశాన్ని పరిశీలించేందుకు నిర్ణయం తీసుకుంది. కోరుట్ల రెవెన్యూ డివిజన్ విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకపోవడంతోనే సర్కార్ ఎలాంటి ప్రకటన చేయడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకే ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో అభ్యంతరాల స్వీకరణ ఎందుకు చేశారన్న అంశం ప్రస్తావనలోకి వస్తోంది. వీడని ఉత్కంఠ.. కోరుట్ల డివిజన్ ఏర్పాటు అంశంపై ప్రజలు నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మెట్పల్లి, కోరుట్ల రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి, కొత్తగా ఏర్పాటయ్యే రుద్రంగి, కోరుట్ల అర్బన్ మండలాలను కలుపుకుని కోరుట్ల రెవెన్యూ డివిజన్ ప్రతిపాదనలు రూపొందించారు. వారం క్రితం ఈ ప్రతిపాదనలను సీఎం పేషికి అందించినట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే సహకారంతో మెట్‌పల్లితో పాటు కోరుట్ల కొత్త రెవెన్యూ డివిజన్‌గా రూపుదిద్దుకుంటుందన్న అశలు ప్రజల్లో చిగురించాయి. కానీ ఈ విషయంలో ఎలాంటి ప్రగతి కనబడలేదు. ఎమ్మెల్యే ప్రతిపాదనలు, పెద్ద ఎత్తున ప్రజల నుంచి కోరుట్ల డివిజన్ కోసం వచ్చిన అభ్యంతరాలు పరిగణనలోకి రాకపోవడంతో డివిజన్ ఏర్పాటు అంశంపై ఉత్కంఠ నెలకొంది. -
పోలీస్ శాఖలో మార్పులు
మూడు జిల్లాలుగా విభజన రఘునాథపల్లిలో కొత్తగా ఏసీపీ ఆఫీసు మడికొండకు తరలనున్న కాజీపేట ఏసీపీ కార్యాలయం పరకాల పరిధిలోకి ఆత్మకూరు, హసన్‌పర్తి పీఎస్‌లు సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా పోలీసు శాఖలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్ జిల్లాను.. వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి(జయశంకర్), మహబూబాబాద్ జిల్లాలుగా పునర్విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 22న ముసాయిదా విడుదల చేసింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వ శాఖలలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పునర్విభజన తర్వాత మూడు జిల్లాలు ఉంటాయా, నాలుగు జిల్లాలా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. నాలుగు జిల్లాలు ఉన్నా, మూడు జిల్లాలు ఉన్నా... పోలీసు శాఖ పరంగా మాత్రం వరంగల్ కమిషరేట్, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలుగానే ఉండనుంది. ప్రతిపాదిత వరంగల్, హన్మకొండ రెవెన్యూ జిల్లాలను పోలీసు శాఖ పరంగా వరంగల్ కమిషరేట్‌లో ఉండనున్నాయి. ఈ విషయంలో స్పష్టత రావడంతో దీనికి అనుగుణంగా కమిషరేట్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో 19 సాధారణ పోలీస్ స్టేషన్లు, మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, ఒక మహిళా పోలీస్ స్టేషన్, ఒక క్రైం పోలీస్ స్టేషన్ ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో 41 సాధారణ పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీస్ స్టేషన్, క్రైం పోలీస్ స్టేషన్ ఉన్నాయి. జిల్లాల పునర్విభజనతో ఇదంతా పూర్తిగా మారిపోనుంది. ప్రస్తుతం వరంగల్ రూరల్ పోలీస్ పరిధిలో ఉన్న రఘునాథపల్లి, నర్మెట, పాలకుర్తి, కొడకండ్ల, నెక్కొండ, ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, శాయంపేట, పరకాల, కరీంనగర్ జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, హుజూరాబాద్ టౌన్, హుజూరాబాద్ రూరల్, జమ్మికుంట టౌన్, జమ్మికుంట రూరల్ పోలీస్ స్టేషన్లు వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో కలపనున్నారు. కొత్త మండలాలుగా ఏర్పడే చెల్పూరు, వేలేరు, ఐనవోలు, ఇల్లంతకుంటలోనూ పోలీస్ స్టేషన్లను దసరా రోజు నుంచే ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలోకి వచ్చే మండలాల పోలీస్ స్టేషన్లను ఏయే అసిస్టెంట్ పోలీస్ కార్యాలయం పరిధిలో ఉండాలనే విషయంలో కసరత్తు జరుగుతోంది. కొత్త పోలీస్ స్టేషన్లు వచ్చి చేరుతుండడంతో కమిషరేట్ పరిధిలోనీ అసిస్టెంట్ పోలీస్ కమిషర్ కార్యాలయ పరిధులలో పలు మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం పరకాల డీఎస్పీ పోస్టు ఏసీపీగా మారనుంది. కాజీపేట ఏసీసీ పరిధిలో ఉన్న హసన్‌పర్తి, ఆత్మకూరు పోలీస్ స్టేషన్లను పరకాల ఏసీపీ పరిధిలోకి రానున్నాయి. కాజీపేట ఏసీసీ కార్యాలయాన్ని మడికొండ పోలీస్ స్టేషన్ ఆవరణలోకి మార్చనున్నారు. ఏసీపీ కార్యాలయం కోసం ఇక్కడ అవసరమైన నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. నర్సంపేట డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయం నర్సంపేట ఏసీపీ కార్యాలయంగా మారనుంది. దగ్గొండి, నల్లబెల్లి, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ, నర్సంపేట పోలీస్ స్టేషన్లు దీని పరిధిలో ఉండనున్నాయి. హుజూరాబాద్ డివిజన్ పోలీసు అధికారి కార్యాలయం కమిషరేట్ పరిధిలోకి వస్తుండడంతో హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయంగా మారనుంది. ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, హుజూరాబాద్ టౌన్, హుజూరాబాద్ రూరల్, జమ్మికుంట, జమ్మికుంట రూరల్, ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లు హుజూరాబాద్ ఏసీపీ పరిధిలో ఉండనున్నాయి. వరంగల్ కమిషరేట్ పరిధిలో కొత్తగా వర్ధన్నపేట, రఘునాథపల్లిలో ఏసీపీ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. కొడకండ్ల, పాలకుర్తి, రఘునాథపల్లి, వేలేరు, చిల్పూరు, నర్మెట, ఐనవోలు పోలీస్ స్టేషన్లను వీటి పరిధిలోకి తేచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడే దసరా రోజు నుంచే పోలీసు శాఖ పరంగానూ మార్పులు అమల్లోకి రానున్నాయి. -
అప్పీళ్ల దాఖలుకు నేడు ఆఖరు
► పునర్విభజన ముసాయిదాపై భారీగా అప్పీళ్లు ► అత్యధికంగా వరంగల్ జిల్లాపై 9500 ► 17వేల అభ్యంతరాల పరిశీలన పూర్తి హన్మకొండ అర్బన్: జిల్లాల పునర్విభజన ముసాయిదాపై అభ్యంతరాల (అప్పీళ్లు) దాఖలుకు గడువు మంగళవారం(20వ తేదీ)తో ముగియనుంది. వరంగల్ జిల్లాలో వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెల 22న ముసాయిదా ప్రకటన విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు ఉన్నట్లయితే 30రోజుల్లోగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్లో గానీ, ఆన్లైన్ ద్వారా గానీ తమ అభ్యంతరాలను అందజేయాలని కోరింది. జిల్లా నుంచి మొదటి రోజు నుంచే ఆన్లైన్ దరఖాస్తులు వెల్లువెత్తాయి. సోమవారం రాత్రి వరకు మొత్తం 21వేల దరఖాస్తులు అందాయి. వీటిలో ఆన్లైన్ ద్వారా అందిన దరఖాస్తులు 14,800 కాగా.. కలెక్టరేట్ సెల్లో అందజేసినవి సుమారు 7వేల వరకు ఉన్నాయి. చివరి రోజు కావడంతో మంగళవారం మరికొన్ని దరఖాస్తులు అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వెంట వెంటనే పరిశీలన జిల్లాకు సంబంధించి అందిన మొత్తం అప్పీళ్లను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. ప్రతిరోజూ వెబ్సైట్ ద్వారా వచ్చిన దరఖాస్తులు ప్రాథమికంగా పరిశీలన చేసి అవసరం మేరకు జిల్లా కలెక్టర్ ముందు ఉంచి కలెక్టర్ సంతకంతో వాటిని ప్రాధాన్యతా క్రమంలో మళ్లీ అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు అందిన సుమారు 21వేల దరఖాస్తుల్లో సుమారు 17వేల దరఖాస్తులకు పైగా అధికారులు పరిశీలన పూర్తి చేసి అప్లోడ్ చేశారు. నాలుగు కేటగిరీలుగా... జిల్లాల విభజనపై అందిన అప్పీళ్లు మొత్తం నాలుగు కేటగిరీలుగా అధికారులు విభజిస్తున్నారు. 1.పరిశీలనకు అర్హతలేనివి, 2.ఇతర జిల్లాలకు పంపించాల్సినవి, 3. ప్రభుత్వ పరిశీలనకు పంపాల్సినవి, 4. పరిశీలనకు స్వీకరించాల్సినవి. ఈ విధంగా ప్రస్తుతం దరఖాస్తులు పరిశీలించారు. అయితే వాటిలో సుమారు వెయ్యికి పైగా దరఖాస్తులు అధికారులు వివిధ కారణాలతో జిల్లా స్థాయిలోనే తిరస్కరించారు. ఉదాహరణకు... వ్యక్తుల తమ ఫొటోలతో అప్లోడ్ చేసినవి, సంబంధం లేని విషయాలు ప్రస్తావించినవి, ఆడియో క్లిప్పింగ్‌లు, వీడియో క్లిప్పింగ్‌లు అప్లోడ్ చేసినవి ... ఈ విధమైన అభ్యంతరాలను జిల్లా స్థాయిలో తరస్కరిస్తున్నారు. ప్రస్తుతం నాల్గవ స్థానంలో.. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో అత్యధిక అప్పీళ్లు వచ్చిన వాటిలో జిల్లా ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో కరీంనగర్, 2వ స్థానంలో నల్లగొండ, 3వ స్థానంలో మహబూబ్‌నగర్, 4వ స్థానంలో వరంగల్ జిల్లాలు ఉన్నాయి. వరంగల్ జిల్లాపై 9500, హన్మకొండపై 3091, జయశంకర్ జిల్లాపై 1236, మహబూబాబాద్‌పై 939 అప్పీళ్లు ఆన్లైన్ ద్వారా అందాయి. -
నాలుగు జిల్లాలు ఖాయం!
ఏర్పాట్లకు నిధులు విడుదల రూ.4 కోట్లు కేటాయించిన సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన ప్రణాళిక శాఖ జిల్లాల సంఖ్యపై పూర్తి స్థాయి స్పష్టత హన్మకొండ, కాకతీయ జిల్లాలపై ఆసక్తి సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజనలో మన జిల్లా పరిస్థితి సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. కొత్తగా ఏర్పడబోయే జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫర్నిచర్, ఫైళ్లు, కంప్యూటర్లు అమర్చుకునేందుకు ప్రతి జిల్లాకు కోటి రూపాయల చొప్పున విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా పునర్విభజించాలనే ప్రతిపాదనల మేరకు జిల్లాకు రూ.4 కోట్లు కేటాయించింది. నిధుల విడుదలతో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. ఇది పరిపాలన పరమైన అంశమే అయినా... మన జిల్లాకు నాలుగు కోట్లు కేటాయించడం ఆసక్తి కలిగిస్తోంది. వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా పునర్విభజించాలనే ప్రతిపాదనల మేరకు నాలుగు కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదాలో పేర్నొన్నట్లుగా నాలుగు జిల్లాలు ఉండవని... చివరికి మూడు జిల్లాలే ఉంటాయని ఎక్కువ మంది భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం తాజాగా జారీ చేసిన నిధుల కేటాయింపు ఉత్తర్వులతో నాలుగు జిల్లాలు ఉంటాయనేది స్పష్టమైంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా పునర్విభజించాలని ప్రభుత్వం ముసాయిదా విడుదల చేసింది. ఇతర జిల్లాల్లోని కొన్ని మండలాలను కలుపుతూ... వరంగల్, హన్మకొండ, జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలు ఏర్పాటు చేసేలా ముసాయిదాలో పేర్కొంది. జిల్లాల పునర్విభజన అంశంపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినప్పటి నుంచి వరంగల్ జిల్లాను మూడు జిల్లాలుగా పునర్విభజిస్తారని తెలిసింది. అధికారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22న విడుదల చేసిన ముసాయిదా అందరినీ ఆశ్చర్యపరిచింది. వరంగల్ జిల్లాను... నాలుగు జిల్లాలుగా పునర్విభజించేలా ముసాయిదాలో పేర్కొంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్ వరంగల్ నగరాన్ని రెండు జిల్లాలకు కేటాయించవద్దని రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని హన్మకొండ జిల్లాను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఉన్నత స్థాయి అధికారులు మీడియాకు సమాచారం ఇచ్చారు. హన్మకొండ స్థానంలో వరంగల్ రూరల్(కాకతీయ) జిల్లా ఏర్పాటు కానుందని తాజాగా చర్చ మొదలైంది. తుది దశలో నాలుగు జిల్లాలు కాకుండా మూడే ఉంటాయని ప్రచారం జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం రూ.నాలుగు కోట్లు విడుదల చేయడం ఆసక్తి కలిగిస్తోంది. దీంతో నాలుగు జిల్లాలు ఉండడం ఖాయమని స్పష్టత వచ్చింది. అయితే నాలుగో జిల్లా హన్మకొండ పేరుతో ఉంటుందా.. వరంగల్ రూరల్‌గా ఉంటుందా అనేది మరో రెండు వారాల్లో తేలనుంది. -
ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం
కొత్త మండలాలపై ప్రతిపాదనలు పంపండి జిల్లా అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్ష ప్రస్తావనకురాని హన్మకొండ, వరంగల్ రూరల్ జిల్లాలు సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. దసరా నుంచే కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసం ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లో జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు, రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝా ఈ సమావేశానికి హాజరయ్యారు. జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22న జారీ చేసిన ముసాయిదాలోని అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొనని... ప్రజల్లో డిమాండ్ ఉన్న అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజల అభిప్రాయం మేరకు కొత్త మండలాల ఏర్పాటు కోసం అవసరమైన ప్రతిపాదనలను పంపించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మన జిల్లాలో టేకుమట్ల(చిట్యాల), చిన్నగూడూరు(మరిపెడ) మండలాల ఏర్పాటు కోసం కొత్తగా ప్రతిపాదనలు తయారు చేసే అవకాశం ఉంది. రెవెన్యూ డివిజన్ల విషయంలోనూ ఇదే విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లపై జిల్లా ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు మూడు రోజుల్లో నివేదిక పంపే అవకాశం ఉంది. వరంగల్ జిల్లాలను... వరంగల్, హన్మకొండ, జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా పునర్విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22న జారీ చేసిన ముసాయిదాలో పేర్కొంది. అందులో హన్మకొండ జిల్లా ఏర్పాటుపై వరంగల్ నగరంలోని పలు వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం హన్మకొండ జిల్లాకు బదులుగా వరంగల్ రూరల్(కాకతీయ) జిల్లా ఏర్పాటు అంశాన్ని తెరపైకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై అధికారికంగా ప్రకటించకున్నా... వరంగల్ రూరల్ జిల్లా ప్రతిపాదనపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ నగరానికి దగ్గరగా ఉండే మండలాలను వేరు చేస్తూ, దూరంగా ఉన్న మండలాలను కలపడంపై విమర్శలు వస్తున్నాయి. గ్రేటర్ వరంగల్‌లో భాగమైన కొన్ని ప్రాంతాలను గ్రామీణ జిల్లాలో చేర్చుతున్నారనే ప్రతిపాదనలపైనా ఇదే అభిప్రాయం ఉంది. గ్రేటర్ వరంగల్‌లోని గీసుగొండ, ఐనవోలు, సంగెం ప్రాంతాలను ఏ జిల్లాలో చేర్చుతారనే అంశంపై సందేహాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మాత్రం హన్మకొండ, వరంగల్ రూరల్ జిల్లాల ప్రతిపాదనలపై ఎలాంటి చర్చా జరగలేదు. దీంతో జిల్లా పునర్విభజన అంశం చివరి దశలో ఎలా ఉంటుందనేది మరింత ఆసక్తి కలిగిస్తోంది. -
అందరి డిమాండ్లు నెరవేర్చడం అసాధ్యం
♦ కోట్‌పల్లి మండలం ఏర్పాటుపై మరోసారి సీఎంకు విన్నవిస్తా ♦ ఆసరా ఫింఛన్ల అవకతవకల్లో బాధ్యులపై చర్యలు ♦ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తాండూరు: జిల్లాల పునర్విభజనలో భాగంగా అందరి డిమాండ్లను నెరవేర్చడం ప్రభుత్వానికి సాధ్యం కాదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాండూరులో శుక్రవారం జరిగిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి అభివృద్ధి సంఘం సమావేశానికి మంత్రి హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చేవెళ్లను జిల్లా కేంద్రం, మెయినాబాద్, షాబాద్ తదితర ప్రాంతాలను శంషాబాద్ జిల్లాలో విలీనం చేయాలని స్థానిక ప్రజలు చేస్తున్న ఆందోళనలపై విలేకరులు మంత్రిని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా కేంద్రం చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉందని, దీనికి అనుగుణంగా ప్రభుత్వం జిల్లాగా ఏర్పాటు చేసిందన్నారు. చేవెళ్లను చేయాలని ప్రజలు కోరడం తప్పు కాదని, అందరి డిమాండ్లను నెరవేర్చడం సాధ్యం కాదన్నారు. కోట్‌పల్లిని మండలంగా చేయాలని మొదట తానే ప్రతిపాదించినట్టు చెప్పారు. 30-35 వేల జనాభా ఉంటే మండలంగా చేయడానికి వీలుందని, కోట్‌పల్లిలో 1 8వేల జనాభా మాత్రమే ఉందన్నారు. మండలం కాకుండా తాను అడ్డుపడ లేదన్నారు. బంట్వారం మండలం నుంచి చుట్టు పక్కల గ్రామాలను కలిపి కోట్‌పల్లిని మండలంగా ఏర్పాటు చేయడానికి మరోసారి సీఎం కేసీఆర్‌కు విన్నవిస్తానన్నారు. తాండూరు మున్సిపాలిటీలో ఆసరా పింఛన్ల అవకతవకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరున్నా తప్పకుండా చర్యలు ఉంటాయన్నారు. పక్కదారి పట్టిన ఫించన్ డబ్బులను రికవరీ చేయడంతోపాటు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ వ్యవహారంపై సీబీసీఐడీ విచారణకు ప్రభుత్వానికి లేఖ రాస్తానని మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి ప్రకటించడాన్ని మంత్రి స్వాగతించారు. -
ఒక్కటే.. ఐటీడీఏ
ఒక్కరే ప్రాజెక్టు అధికారి మూడు జిల్లాలకు ఏజెన్సీ విస్తరణ ప్రతి మండలానికి ప్రత్యేక అధికారి చైర్మన్‌గా గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఏటూరునాగారం : జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏజెన్సీ మండలాలు మూడు జిల్లాల్లోకి వెళ్తున్నప్పటికీ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఒక్కటే ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలోని 13 ఏజెన్సీ మండలాలు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పాలనలో కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో ఐటీడీఏలోని కొన్ని మండలాలు భూపాలపల్లికి, మరికొన్ని మండలాలు మహబూబాబాద్(మానుకోట), మరికొన్ని వరంగల్ జిల్లాలో ఉండనున్నాయి. ఆ మండలాలు వేర్వేరు జిల్లాల్లోకి వెళ్లినా ప్రాజెక్టు అధికారి మాత్రం ఒక్కరే ఉంటారు. వాటిని ఏజెన్సీ నుంచి నాన్ ఏజెన్సీగా మార్చే అవకాశం లేకపోవడంతో అవి అలాగే కొనసాగుతాయి. ఇతర జిల్లాలోకి వెళ్లే ఏజెన్సీ మండలాలకు పరిపాలన అధికారి లేదా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారులను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీడీఏ పరిధిలో పనిచేసే ఉద్యోగల జాబితాలు, వారి హోదాలు, డిప్యూటేషన్లు వివరాలను కమిషనర్ కార్యాలయానికి పంపినట్టు తెలిసింది. ఐటీడీఏ పరిధిలోని ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సొంత జిల్లాకు కాకుండా మరో జిల్లాకు పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అందు కోసం ఉద్యోగుల నివాసం, చేస్తున్న ఉద్యోగం హోదా కూడిన పూర్తి సమాచారం ఐటీడీఏ నుంచి ఉన్నతాధికారులకు చేరింది. 13 మండలాలు మూడు జిల్లాల్లోకి.. ఏజెన్సీ పరిధిలో 13 మండలాలు ఉండగా జయశంకర్ జిల్లాలోకి భూపాలపల్లి, ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, గోవిందరావుపేట, ములుగు, వెంకటాపురం మండలాలు వెళ్లనున్నాయి. మహబూబాబాద్, కొత్తగూడ, గూడూరు మండలాలు మహబూబాబాద్ జిల్లాలోకి వెళ్లాయి. నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం మండలాలు వరంగల్ జిల్లా పరిధిలో ఉంటాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఐటీడీఏ మండలాల్లో 5.30 లక్షల మంది గిరిజనులు నివాసం ఉంటున్నారు. శ్రీశైలం ఐటీడీఏ మాదిరిగానే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా శ్రీశైలం ఐటీడీఏ లాగానే ఏటూరునాగారం ఐటీడీఏ కూడా మారనుంది. శ్రీశైలం ఐటీడీఏ కింద కూడా కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలు ఉన్నాయి. మండలాలు వేరే జిల్లాల ఉన్నా ఐటీడీఏ ద్వారానే నడుస్తాయని అధికారులు వెల్లడించారు. ఐటీడీఏ చైర్మన్ కమిషనరే... ఇప్పటి వరకు వరంగల్ జిల్లా కలెక్టర్ ఐటీడీఏ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే జిల్లాల విభజనతో ఐటీడీఏ చైర్మన్‌గా గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మూడు జిల్లాలోని కలెక్టర్లకు కూడా ఐటీడీఏ ద్వారా సమాచారాన్ని అందిస్తుంటారు. కాగా, ఇతర జిల్లాల్లో ఉండే ఆయా మండలాల్లోని పరిపాలన విభాగానికి గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారిని నియమించి ఆయన ద్వారా పరిపాలన కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టు ఆఫీసర్ నేతృత్వంలో గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి పనిచేసే చర్యలు తీసుకోనున్నారు. -
కమిషనరేట్ పరిధిలోకి రెండు జిల్లాలు
వరంగల్, హన్మకొండ జిల్లాలు పూర్తిగా... మానుకోట, భూపాలపల్లిలో ఎస్పీ కార్యాలయాలు పోలీసు శాఖలో వేగంగా పునర్విభజన పూర్తిగా మారనున్న స్వరూపం సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజనతో పోలీసు శాఖ స్వరూపం పూర్తిగా మారిపోనుంది. ఆ శాఖ పునర్విభజనపై ఉన్నత స్థాయిలో వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్ రెవెన్యూ జిల్లాలోని వరంగల్ పోలీస్ కమిషరేట్, వరంగల్ రూరల్ జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ఐజీ స్థాయి అధికారి మల్లారెడ్డి నియమించింది. వరంగల్ జిల్లాను.. వరంగల్, హన్మకొండ, జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా పునర్విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా పోలీసు శాఖలోనూ విభజన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలకు పోలీసు శాఖ పరంగా ప్రత్యేకంగా ఎస్పీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ముసాయిదాలో పేర్కొన్న మండలాల పరిధిలోని పోలీస్ స్టేషన్లను మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లోకి తీసుకువస్తున్నారు. వరంగల్, హన్మకొండ జిల్లాలకు ప్రత్యేకంగా రూరల్ విభాగాలు ఏర్పాటు చేయడం వల్ల అదనంగా ఆర్థిక భారం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ముసాయిదాలో పేర్కొన్న వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని అన్ని పోలీస్ స్టేషన్లను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకువచ్చేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. – వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో 19 సాధారణ పోలీస్స్టేషన్లు, మూడు ట్రాఫిక్ పోలీస్స్టేషన్లు, ఒక మహిళా పోలీస్‌స్టేషన్, ఒక క్రైం పోలీస్‌స్టేషన్ ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో 41 సాధారణ పోలీస్స్టేషన్లు, ఒకటి మహిళా పోలీస్‌స్టేషన్, ఒకటి క్రైం పోలీస్‌స్టేషన్ ఉన్నాయి. జిల్లాల పునర్విభజనతో ఇదంతా పూర్తిగా మారిపోనుంది. – వరంగల్ పోలీస్ కమిషరేట్‌లో పరిధిలో ప్రస్తుతం ఉన్న 19 స్టేషన్లు యథావిధిగా కొనసాగనున్నాయి. ప్రస్తుతం వరంగల్ రూరల్ పోలీస్ పరిధిలో ఉన్న రఘునాథపల్లి, నర్మెట, పాలకుర్తి, కొడకండ్ల, నెక్కొండ, ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, శాయంపేట, పరకాల స్టేషన్లు పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి రానున్నాయి. – ప్రతిపాదిత హన్మకొండ జిల్లాలో కరీంనగర్ జిల్లాలోని ఐదు మండలాలు కలుస్తున్నాయి. ఇలా హన్మకొండలో కలుస్తున్న మండలాల్లోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, హుజూరాబాద్ టౌన్, హుజూరాబాద్ రూరల్, జమ్మికుంట టౌన్, జమ్మికుంట రూరల్ పోలీస్ స్టేషన్లు వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో కలపనున్నారు. పోలీసు శాఖ ప్రస్తుత స్వరూపం... వరంగల్ కమిషరేట్ : హన్మకొండ, కేయూసీ, సుబేదారి, మట్టెవాడ, మిల్స్‌కాలనీ, ఇంతేజార్గంజ్, మామునూరు, జఫర్‌గఢ్, రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు, హసన్‌పర్తి, కాజీపేట, మడికొండ, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్. వరంగల్ రూరల్ : జనగామ, రఘునాథపల్లి, లింగాలఘణపురం, నర్మెట, చేర్యాల, బచ్చన్నపేట, మద్దూరు, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, తొర్రూరు, నర్సింహులపేట, నెల్లికుదురు, సీరోలు, కురవి, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం, మహబూబాబాద్ టౌన్, మహబూబాబాద్ రూరల్, గూడూరు, కొత్తగూడ, నెక్కొండ, ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, శాయంపేట, పరకాల, మొగుళ్లపల్లి, రేగొండ, చిట్యాల, భూపాలపల్లి, గణపురం, వెంకటాపురం, ములుగు, పస్రా, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట. -
ఒకటిగానే ఉండాలి
హన్మకొండ వద్దని సీఎంను కోరుదాం టీఆర్ఎస్ ముఖ్యనేతల అభిప్రాయం హైదరాబాద్‌లో కీలక నేతల భేటీ ప్రజాభీష్టం ప్రకారం వెళ్లాలని అభిప్రాయం హన్మకొండ జిల్లా ఉండాలన్న ఎమ్మెల్సీ కొండా సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన నేతలు అసంతృప్తితో వెళ్లిపోయిన కొండా మురళీ సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎలాంటి వైఖరి తీసుకోవాలనే విషయంపై అధికార పార్టీ దృష్టి పెట్టింది. హన్మకొండ జిల్లా ఏర్పాటుపై భిన్న వాదనలు వస్తున్నాయి. చారిత్రక వరంగల్ నగరాన్ని రెండుగా విభజించవద్దని పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వరంగల్ నగరాన్ని రెండు జిల్లాలకు కేటాయించడం వల్ల అభివృద్ధి ఆగిపోతుందని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అభిప్రాయపడుతున్నాయి. వరంగల్ జిల్లాను... వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలుగా విభిజించాలనే ప్రతిపాదన మొదట కొనసాగింది. పునర్విభజన ముసాయిదా నోటిఫికేషన్ వెలువడే తరుణంలో ఒక్కసారిగా హన్మకొండ జిల్లా అంశం తెరపైకి వచ్చింది. నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచే హన్మకొండ జిల్లా ఏర్పాటు వద్దనే డిమాండ్లు మొదలయ్యాయి. రోజురోజుకు ఈ డిమాండ్లు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. జిల్లా ప్రజల అభిప్రాయం ఎలా ఉంది.. పార్టీ వ్యూహం ఎలా ఉండాలనే అంశంపై చర్చించేందుకు టీఆర్ఎస్ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు గురువారం సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశంలో స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, మంత్రి ఎ.చందులాల్, ఎంపీలు పసునూరి దయాకర్, ఎ.సీతారాంనాయక్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యేలు టి.రాజయ్య, కొండా సురేఖ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డి.వినయభాస్కర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, కొండా మురళీధర్‌రావు, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు, నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జీ పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే బి.శంకర్‌నాయక్ తిరుపతిలో ఉన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ అనారోగ్యం కారణంగా హాజరుకాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనపైనే చర్చ జరిగింది. వరంగల్‌ను వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలుగా విభజిస్తే సరిపోతుందని, హన్మకొండ జిల్లా వద్దని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా ఉన్న వరంగల్‌ను విభిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో నెలకొందని... ఇది ప్రభుత్వానికి, పార్టీకి మంచిదికాదని పలువురు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, ఉద్యోగు సంఘాలు, ప్రజా సంఘాల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని హన్మకొండ జిల్లా ప్రతిపాదనను ఉపసంహరించుకునేలా ప్రయత్నించాలని అభిప్రాయపడ్డారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు అందరూ త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి క్షేత్రస్థాయి అభిప్రాయాన్ని వివరించాలని నిర్ణయించారు. ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఇదే రకంగా చెప్పారు. అయితే హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. హన్మకొండ జిల్లా ఏర్పాటు వల్ల వరంగల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. హన్మకొండ జిల్లా ఏర్పాటు వల్ల వరంగల్ జిల్లా పరిపాలన కేంద్రం నర్సంపేట ప్రాంతానికి దగ్గరగా ఉంటుందని ఆ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జీ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొన్నదానికి భిన్నంగా... హన్మకొండ జిల్లా ఏర్పాటు వద్దని ఎక్కువ మంది నేతలు అనడంతో ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన ప్రజాప్రతినిధులు కొండా మురళికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. వారి అభిప్రాయంతో విభేదించిన కొండా మురళీధర్‌రావు, కొండా సురేఖ సమావేశం నుంచి బయటికి వచ్చారు. వీరిద్దరు బయటికి వచ్చిన సమయంలో అక్కడ వారి సెక్యూరిటీ సిబ్బంది, వాహనం లేవు. ఉప ముఖ్యమంత్రి కడియం సహా పలువురు బయటికి వచ్చి భోజనం చేసి వెళ్లాలని కోరినా కొండా మురళి, సురేఖ వినిపించుకోలేదు. వేరే వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం మిగిలిన నేతలు కొద్దిసేపు చర్చించి సమావేశం ముగించారు. మొత్తంగా జిల్లాల పునర్విభజన అంశం టీఆర్ఎస్లో విభేదాలకు కారణమవుతోంది. -
తీరొక్క జిల్లా
ఒక్కో జిల్లాది ఒక్కో విశిష్టత భిన్న సంస్కృతుల భూపాలపల్లి వ్యవసాయంలో కీలకంగా వరంగల్ నగర జిల్లాగా హన్మకొండ గిరిజన జిల్లా మహబూబాబాద్ సాక్షిప్రతినిధి, వరంగల్ : కాకతీయుల రాజధానిగా వరంగల్‌కు గొప్ప చారిత్రక వైభవం ఉంది. వందల ఏళ్లపాటు పాలించిన నైజాం రాజుల హయాంలోనూ వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. పరిపాలన పరంగా హైదరాబాద్ తర్వాత వరంగల్‌కు ప్రాధాన్యత ఉండేది. నిజాం పాలకుల హయాంలో వరంగల్ ప్రాంతీయ కేంద్రం(సుబేదార్)గా ఉంది. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వరంగల్ జిల్లా ప్రాంతీయ పరిపాలన కేంద్రంగా కొనసాగింది. పలు ప్రభుత్వ శాఖలకు ఉత్తర తెలంగాణ కేంద్రంగా ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఇప్పుడు జిల్లాల పునర్విభజనతో వరంగల్ జిల్లా నాలుగు జిల్లాలుగా మారుతోంది. వరంగల్, హన్మకొండ, జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ పేర్లతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా విడుదల చేసింది. అభ్యంతరాల ప్రక్రియ అనంతరం జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముగియనుంది. ఏ జిల్లాలో ఏ మండలం ఉండాలనే విషయంలో కొన్ని మార్పులు ఉంటాయేగానీ... నాలుగు జిల్లాలు ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్తగా ఏర్పడబోయే నాలుగు జిల్లాల్లో ఒక్కోటి ఒక్కో విశిష్టతను కలిగి ఉన్నాయి. రాష్ట్రంలోనే ప్రత్యేకంగా గుర్తింపు పొందేలా ఈ జిల్లాల స్వరూపం ఉండనుంది. వరంగల్ జిల్లా –వరంగల్ జిల్లాలో వరంగల్, ఖిలావరంగల్(కొత్తది), హసన్‌పర్తి, వర్ధన్నపేట, ఐనవోలు(కొత్తది), పర్వతగిరి, గీసుగొండ, సంగెం, ఆత్మకూరు, పరకాల, శాయంపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ మండలాలు ఉండనున్నాయి. నగర, గ్రామీణ ప్రజలు సమాన సంఖ్యలో ఉండే జిల్లాగా వరంగల్ ఉండనుంది. గ్రామీణ ప్రజలు ఎక్కువగా ఆధారపడే వ్యవసాయరంగానికి వరంగల్ కీలకంగా మారనుంది. ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ వరంగల్ జిల్లాలోనే ఉండనుంది. రాష్ట్రంలోని ఏకైక ఆరోగ్య విశ్వవిద్యాలయం, కాకతీయ వైద్య కళాశాల, వ్యవసాయ ప్రాంతీయ పరిశోధన కేంద్రం, వ్యవసాయ విద్యా సంస్థలు, పశుసంవర్థక పరిశోధన సంస్థలు, పశుసంవర్థక కాలేజీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలన్నీ వరంగల్‌లోనే ఉంటున్నాయి. ప్రఖ్యాత భద్రకాళి ఆలయం, ఖిలా వరంగల్, ప్రకృతిసిద్ధంగా పర్యాటక ప్రాంతంగా ఉండే పాకాల చెరువు వరంగల్ జల్లాలోనే ఉండనున్నాయి. హన్మకొండ జిల్లా – హన్మకొండ జిల్లాలో హన్మకొండ, కాజీపేట(కొత్తది), ధర్మసాగర్, వేలేరు(కొత్తది), స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూరు(కొత్తది), జఫర్‌గఢ్, రఘునాథపల్లి, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపురం, హుజూరాబాద్, జమ్మికుంట, ఇలందకుంట(కొత్తది) మండలాలు ఉంటాయని ముసాయిదాలో పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత నగర జనాభా ఎక్కువగా ఉండే జల్లాగా హన్మకొండ ఉండనుంది. గ్రేటర్ వరంగల్‌లోని సగభాగం, హుజూరాబాద్, జమ్మికుంటలో నగర జనాభా ఎక్కువ. జాతీయ సాంకేతిక సంస్థ(నిట్), కాకతీయ విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఇక్కడే ఉన్నాయి. వేయి స్తంభాల గుడి, పద్మాక్షి ఆలయం, పాలకుర్తిలోని సోమేశ్వరలక్ష్మీనర్సింహ ఆలయం హన్మకొండ జిల్లాలోనే ఉండనున్నాయి. భూపాలపల్లి జిల్లా – తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పేరిట ఏర్పాటవుతున్న భూపాలపల్లి జిల్లాకు ఎన్నో ప్రత్యేకతలు ఉండనున్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, దట్టమైన అడవులు, జలవనరులు, నీటి వసతితో సాగే వ్యవసాయం, గిరిజన ప్రాంతం, ఆదివాసీలు అన్ని ఈ జిల్లాలోనే ఉంటాయి. సింగరేణి కాలరీస్ కొత్తగా చేపడుతున్న బొగ్గు గనులు ఈ జిల్లాలోనే ఉన్నాయి. కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ జిల్లాలోనే ఉంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర, కాళేశ్వరం, రామప్ప, మల్లూరు వంటి ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు భూపాలపల్లి జిల్లాలోనే ఉంటున్నాయి. భూపాలపల్లి జిల్లాలోనే గోదావరి నదీ తీరం ఎక్కువగా ఉండనుంది. భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు దేవాదుల, త్వరలో నిర్మాణం మొదలయ్యే కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు భూపాలపల్లి జిల్లాలోనే ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలోనే పర్యాటక కేంద్రాలు ఎక్కువగా ఉన్న జిల్లాగా భూపాలపల్లి ఉండనుంది. లక్నవరం, మేడారం, రామప్ప, తాడ్వాయి అడవులు, గోదావరి తీరం వంటి ఎన్నో పర్యాటక కేంద్రాలు ఈ జిల్లాలో ఉన్నాయి. భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, గణపురం, వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కాటారం, మల్హర్రావు, మహాముత్తారం, మహదేవపూర్ మండలాలతో జయశంకర్(భూపాలపల్లి) జిల్లా ఏర్పడనుంది. –గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో మహబూబాబాద్ జిల్లా ఏర్పడుతోంది. మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, కురవి, మరిపెడ, నర్సింహులపేట, కొత్తగూడ, తొర్రూరు, గార్ల, బయ్యారం మండలాలు ఉండనున్నాయి. రాష్ట్రంలోనే గిరిజన జనాభా ఎక్కువగా ఉండే జిల్లాలో మహబూబాబాద్ మొదటి రెండు స్థానాల్లోనే నిలిచే అవకాశం ఉంది. ఇనుము, గ్రానైట్ ఖనిజ నిక్షేపాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు మహబూబాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన జిల్లాగానూ ఇదే ఉండనుంది. -
రూరల్ పోలీస్‌కు మళ్లీ అన్యాయం !
ఉన్నతాధికారులను కలిసేందుకు కార్యాచరణ వరంగల్ : జిల్లాల విభజన సందర్భంగా వరంగల్ జిల్లా రూరల్ సిబ్బందికి మళ్లీ అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని రూరల్ ఏఆర్, సివిల్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం త్వరలో వరంగల్‌ను మూడు జిల్లాలుగా విభజించే నేపథ్యంలో రూరల్ సిబ్బందిని మాత్రమే మూడు జిల్లాలకు పంచడం అన్యాయమని పేర్కొంటున్నారు. కమిషనరేట్ సిబ్బందిని మాత్రం ఇక్కడే ఉంచి కేవలం రూరల్ సిబ్బందిని మూడు జిల్లాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు వాపోతున్నారు. గతంలో జిల్లాను అర్బన్, రూరల్‌గా విభజించిన సందర్భంలో రూరల్ సిబ్బంది నష్టపోయిన విషయం విధితమే. మళ్లీ ఇప్పుడు జిల్లాల పునర్విభజనలో తమకు అన్యాయం జరుగుతుందంటున్నారు. అలా కాకుండా జిల్లా పోలీస్ విభాగాన్ని మొత్తం యూనిట్‌గా తీసుకుని కొత్తగా ఏర్పాటు అయ్యే జిల్లాలకు పంపిణీ చేయాలని కోరుతున్నారు. స్థానికత ఆధారంగా ఇతర జిల్లాల్లో పోలీసు సిబ్బంది విభజన జరుగుతున్న తరుణంలో అదే అంశం ప్రాతిపదికగా వరంగల్ జిల్లాలో విభజన చేపట్టాలని కోరుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిబ్బంది వరంగల్ డీఐజీ ప్రభాకర్‌రావు, డీజీపీ అనురాగ్‌శర్మను కలిసి విన్నవిస్తామని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు రూరల్ సిబ్బందిపై దృష్టి సారించి తాము మరో మారు అన్యాయానికి గురికాకుండా చూడాలని కోరుతున్నారు. -
నిర్మల్ జిల్లా కోసం పాదయాత్ర
నిర్మల్ నుంచి బాసర అఖిలపక్ష సమావేశంలో జిల్లా సాధన సమితి నిర్మల్‌రూరల్ : నిర్మల్ కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటును అధికారికంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేపట్టనున్నట్లు నిర్మల్ జిల్లా సాధన సమితి కన్వీనర్ నాయిడి మురళీధర్, కో–కన్వీనర్లు డాక్టర్ కృష్ణంరాజు, గండ్రత్ రమేశ్ తెలిపారు. స్థానిక ఆర్అండ్బీ విశ్రాంతి భవనంలో సోమవారం అఖిలపక్షాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 28న నిర్మల్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తామని, 29న బాసరకు చేరుకుంటామని అన్నారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు పేర్కొంటునప్పటికీ పూర్తి అధికారిక ప్రకటన వెలువడే వరకు తాము ఉద్యమిస్తామని చెప్పారు. నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాలు, నేరేడిగొండ, బోథ్ ప్రాంతాల ప్రజలు పాల్గొంటారని తెలిపారు. పాదయాత్రలో వివిధ పార్టీలు, సంఘాలు, సంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో జిల్లా సాధన సమితి, పార్టీలు, సంఘాల నాయకులు ఎంబడి రాజేశ్వర్, బొలిశెట్టి రాజేశ్, మాకు సాయి, ద్యాగ ప్రచోదయ్, వెంకటేశ్, అబ్దుల్ అజీజ్, ప్రవీణ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.