కోరుట్ల ఊసేది..?
Published Thu, Oct 6 2016 1:06 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
రెవెన్యూ డివిజన్‌పై వీడని ఉత్కంఠ
కోరుట్ల: జిల్లాల పునర్విభజన విషయంలో కోరుట్ల ప్రజలు రెవెన్యూ డివిజన్ ఆకాంక్షను వెలిబుచ్చుతూ పెద్ద మొత్తంలో వినతులు పంపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 17,612 అభ్యంతరాలు వచ్చాయి. ఈ విషయంలో సర్కార్ సానుకూలంగా స్పందిస్తుందని స్థానికులు ఆశించారు. అభ్యంతరాలు గడువు ముగిసి పదిహేను రోజులైనా కోరుట్ల రెవెన్యూ డివిజన్ గురించి పట్టించుకోకపోవడం స్థానికంగా చర్చనీయమైంది.
పరిశీలన జరిగిందా..?
కోరుట్ల రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతూ వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యంతరాలు సరైనవి కావనుకుంటే ఈ విషయంపై ఏ ప్రకటన చేయకపోవడం చర్చనీయమైంది. తప్పుడు పద్ధతిలో అభ్యంతరాలు పంపారని గద్వాల జిల్లాను మొదట పక్కన పెట్టిన ప్రభుత్వం తరువాత వచ్చిన రాజకీయ ఒత్తిళ్లతో జిల్లా ఏర్పాటు అంశాన్ని పరిశీలించేందుకు నిర్ణయం తీసుకుంది. కోరుట్ల రెవెన్యూ డివిజన్ విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకపోవడంతోనే సర్కార్ ఎలాంటి ప్రకటన చేయడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకే ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో అభ్యంతరాల స్వీకరణ ఎందుకు చేశారన్న అంశం ప్రస్తావనలోకి వస్తోంది.
వీడని ఉత్కంఠ..
కోరుట్ల డివిజన్ ఏర్పాటు అంశంపై ప్రజలు నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మెట్‌పల్లి, కోరుట్ల రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి, కొత్తగా ఏర్పాటయ్యే రుద్రంగి, కోరుట్ల అర్బన్ మండలాలను కలుపుకుని కోరుట్ల రెవెన్యూ డివిజన్ ప్రతిపాదనలు రూపొందించారు. వారం క్రితం ఈ ప్రతిపాదనలను సీఎం పేషికి అందించినట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే సహకారంతో మెట్‌పల్లితో పాటు కోరుట్ల కొత్త రెవెన్యూ డివిజన్‌గా రూపుదిద్దుకుంటుందన్న అశలు ప్రజల్లో చిగురించాయి. కానీ ఈ విషయంలో ఎలాంటి ప్రగతి కనబడలేదు. ఎమ్మెల్యే ప్రతిపాదనలు, పెద్ద ఎత్తున ప్రజల నుంచి కోరుట్ల డివిజన్ కోసం వచ్చిన అభ్యంతరాలు పరిగణనలోకి రాకపోవడంతో డివిజన్ ఏర్పాటు అంశంపై ఉత్కంఠ నెలకొంది.
Advertisement