ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం
-
కొత్త మండలాలపై ప్రతిపాదనలు పంపండి
-
జిల్లా అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
-
ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్ష
-
ప్రస్తావనకురాని హన్మకొండ, వరంగల్ రూరల్ జిల్లాలు
సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. దసరా నుంచే కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసం ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లో జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు, రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝా ఈ సమావేశానికి హాజరయ్యారు.
జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22న జారీ చేసిన ముసాయిదాలోని అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొనని... ప్రజల్లో డిమాండ్ ఉన్న అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజల అభిప్రాయం మేరకు కొత్త మండలాల ఏర్పాటు కోసం అవసరమైన ప్రతిపాదనలను పంపించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మన జిల్లాలో టేకుమట్ల(చిట్యాల), చిన్నగూడూరు(మరిపెడ) మండలాల ఏర్పాటు కోసం కొత్తగా ప్రతిపాదనలు తయారు చేసే అవకాశం ఉంది. రెవెన్యూ డివిజన్ల విషయంలోనూ ఇదే విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లపై జిల్లా ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు మూడు రోజుల్లో నివేదిక పంపే అవకాశం ఉంది.
వరంగల్ జిల్లాలను... వరంగల్, హన్మకొండ, జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా పునర్విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 22న జారీ చేసిన ముసాయిదాలో పేర్కొంది. అందులో హన్మకొండ జిల్లా ఏర్పాటుపై వరంగల్ నగరంలోని పలు వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం హన్మకొండ జిల్లాకు బదులుగా వరంగల్ రూరల్(కాకతీయ) జిల్లా ఏర్పాటు అంశాన్ని తెరపైకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై అధికారికంగా ప్రకటించకున్నా... వరంగల్ రూరల్ జిల్లా ప్రతిపాదనపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ నగరానికి దగ్గరగా ఉండే మండలాలను వేరు చేస్తూ, దూరంగా ఉన్న మండలాలను కలపడంపై విమర్శలు వస్తున్నాయి.
గ్రేటర్ వరంగల్‌లో భాగమైన కొన్ని ప్రాంతాలను గ్రామీణ జిల్లాలో చేర్చుతున్నారనే ప్రతిపాదనలపైనా ఇదే అభిప్రాయం ఉంది. గ్రేటర్ వరంగల్‌లోని గీసుగొండ, ఐనవోలు, సంగెం ప్రాంతాలను ఏ జిల్లాలో చేర్చుతారనే అంశంపై సందేహాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మాత్రం హన్మకొండ, వరంగల్ రూరల్ జిల్లాల ప్రతిపాదనలపై ఎలాంటి చర్చా జరగలేదు. దీంతో జిల్లా పునర్విభజన అంశం చివరి దశలో ఎలా ఉంటుందనేది మరింత ఆసక్తి కలిగిస్తోంది.