ఒకటిగానే ఉండాలి | Be one of | Sakshi
Sakshi News home page

ఒకటిగానే ఉండాలి

Published Fri, Aug 26 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

ఒకటిగానే ఉండాలి

ఒకటిగానే ఉండాలి

  • హన్మకొండ వద్దని సీఎంను కోరుదాం
  • టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతల అభిప్రాయం
  • హైదరాబాద్‌లో కీలక నేతల భేటీ
  • ప్రజాభీష్టం ప్రకారం వెళ్లాలని అభిప్రాయం
  • హన్మకొండ జిల్లా ఉండాలన్న ఎమ్మెల్సీ కొండా
  • సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన నేతలు
  • అసంతృప్తితో వెళ్లిపోయిన కొండా మురళీ
  • సాక్షిప్రతినిధి, వరంగల్‌ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎలాంటి వైఖరి తీసుకోవాలనే విషయంపై అధికార పార్టీ దృష్టి పెట్టింది. హన్మకొండ జిల్లా ఏర్పాటుపై భిన్న వాదనలు వస్తున్నాయి. చారిత్రక వరంగల్‌ నగరాన్ని రెండుగా విభజించవద్దని పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. వరంగల్‌ నగరాన్ని రెండు జిల్లాలకు కేటాయించడం వల్ల అభివృద్ధి ఆగిపోతుందని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అభిప్రాయపడుతున్నాయి. వరంగల్‌ జిల్లాను... వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాలుగా విభిజించాలనే ప్రతిపాదన మొదట కొనసాగింది. పునర్విభజన ముసాయిదా నోటిఫికేషన్‌ వెలువడే తరుణంలో ఒక్కసారిగా హన్మకొండ జిల్లా అంశం తెరపైకి వచ్చింది. నోటిఫికేషన్‌ వెలువడిన రోజు నుంచే హన్మకొండ జిల్లా ఏర్పాటు వద్దనే డిమాండ్‌లు మొదలయ్యాయి. రోజురోజుకు ఈ డిమాండ్లు పెరుగుతూనే ఉన్నాయి.
     
    ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై టీఆర్‌ఎస్‌ దృష్టి పెట్టింది. జిల్లా ప్రజల అభిప్రాయం ఎలా ఉంది.. పార్టీ వ్యూహం ఎలా ఉండాలనే అంశంపై చర్చించేందుకు టీఆర్‌ఎస్‌ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు గురువారం సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశంలో స్పీకర్‌ ఎస్‌.మధుసూదనాచారి, మంత్రి ఎ.చందులాల్, ఎంపీలు పసునూరి దయాకర్, ఎ.సీతారాంనాయక్, జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దల పద్మ, గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యేలు టి.రాజయ్య, కొండా సురేఖ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డి.వినయభాస్కర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, కొండా మురళీధర్‌రావు, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జీ పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బి.శంకర్‌నాయక్‌ తిరుపతిలో ఉన్నారు. డోర్నకల్‌ ఎమ్మెల్యే డి.ఎస్‌.రెడ్యానాయక్‌ అనారోగ్యం కారణంగా హాజరుకాలేదు. 
     
    విశ్వసనీయ సమాచారం ప్రకారం... హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనపైనే చర్చ జరిగింది. వరంగల్‌ను వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాలుగా విభజిస్తే సరిపోతుందని, హన్మకొండ జిల్లా వద్దని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత రెండో నగరంగా ఉన్న వరంగల్‌ను విభిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో నెలకొందని... ఇది ప్రభుత్వానికి, పార్టీకి మంచిదికాదని పలువురు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, ఉద్యోగు సంఘాలు, ప్రజా సంఘాల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని హన్మకొండ జిల్లా ప్రతిపాదనను ఉపసంహరించుకునేలా ప్రయత్నించాలని అభిప్రాయపడ్డారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు అందరూ త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి క్షేత్రస్థాయి అభిప్రాయాన్ని వివరించాలని నిర్ణయించారు.
     
    ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఇదే రకంగా చెప్పారు. అయితే హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. హన్మకొండ జిల్లా ఏర్పాటు వల్ల వరంగల్‌ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. హన్మకొండ జిల్లా ఏర్పాటు వల్ల వరంగల్‌ జిల్లా పరిపాలన కేంద్రం నర్సంపేట ప్రాంతానికి దగ్గరగా ఉంటుందని ఆ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇంచార్జీ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొన్నదానికి భిన్నంగా...  హన్మకొండ జిల్లా ఏర్పాటు వద్దని ఎక్కువ మంది నేతలు అనడంతో ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు.
     
    మిగిలిన ప్రజాప్రతినిధులు కొండా మురళికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. వారి అభిప్రాయంతో విభేదించిన కొండా మురళీధర్‌రావు, కొండా సురేఖ సమావేశం నుంచి బయటికి వచ్చారు. వీరిద్దరు బయటికి వచ్చిన సమయంలో అక్కడ వారి సెక్యూరిటీ సిబ్బంది, వాహనం లేవు. ఉప ముఖ్యమంత్రి కడియం సహా పలువురు బయటికి వచ్చి భోజనం చేసి వెళ్లాలని కోరినా కొండా మురళి, సురేఖ వినిపించుకోలేదు. వేరే వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం మిగిలిన నేతలు కొద్దిసేపు చర్చించి సమావేశం ముగించారు. మొత్తంగా జిల్లాల పునర్విభజన అంశం టీఆర్‌ఎస్‌లో విభేదాలకు కారణమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement