Hanamkonda district
-
ఒకే వ్యక్తికి మూడు ఉద్యోగాలు
దండేపల్లి: దండేపల్లి మండల కేంద్రానికి చెందిన పెండ్యాల సత్యనారాయణ–శకుంతల కుమారుడు పెండ్యాల సాయికిరణ్ మూడు ఉద్యోగాలు సాధించాడు. సాయికిరణ్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్, మహారాష్ట్రలోని దపోలీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశాడు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ, గ్రూప్–4, ఇండియన్బ్యాంక్, మండల వ్యవసాయ అధికారి ఉద్యోగాల కోసం పరీక్షలు రాశాడు.. ఇందులో గ్రూ ప్–4లో జిల్లా 14వ ర్యాంకు సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇండియన్ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాడు. ఇటీవల విడుదలైన మండ ల వ్యవసాయ అధికారి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 42వ ర్యాంకు సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యా డు. సాయికిరణ్ మూడు ఉద్యోగాలకు ఎంపికవ్వడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏవో ఉద్యోగానికి ఎంపిక..జన్నారం: మండలంలోని పొనకల్ గ్రామానికి చెందిన జాడి రాజలింగం–రేణుక దంపతుల కూతురు స్పందన మండల వ్యవసాయ అధికారి ఉద్యోగానికి ఎంపికైంది. ఆమెను జగిత్యాల డిప్యూటీ కలెక్టర్ చిత్రుపటేల్ ఆదివారం పొనకల్లో అభినందించా రు. 2022లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేసిన స్పందన, 2023 జనవరిలో భారత ఆహార సంస్థ నిర్వహించిన ఉద్యోగ పరీక్షలో టెక్నికల్ అసెస్టింట్ ఉద్యోగం సాధించి మంచిర్యాలలో ఉద్యోగం చేస్తున్నారు. 2023 మేలో నిర్వహించిన మండల వ్యవసాయ అధికారిగా ఉద్యోగ పరీక్షల ఫలితాలు తాజా గా విడుదల కాగా ఏవో ఉద్యోగం సాధించింది. తమ కూతురు ప్రభుత్వ కొలువులు సాధించినందుకు సంతోషంగా ఉందని స్పందన తల్లిదండ్రులు తెలిపారు. -
హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి
సాక్షి, వరంగల్: హనుమకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కటాక్షపూర్-ఆత్మకూరు మధ్య టిప్పర్, కారు ఢీనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతులు వరంగల్‌లోని కాశిబుగ్గకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మేడారం వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ఆరుగురు ఉండగా నలుగురు మృతి చెందారు.. డ్రైవర్‌తో పాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చదవండి: బైక్‌కు అడ్డొచ్చిన కోతి.. భార్య కోమాలోకి.. భర్త పరిస్థితి విషమం -
TS: ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. బీటెక్ విద్యార్థి మృతి
నడికూడ: సెల్ఫీ సరదా ఓ బీటెక్ విద్యార్థి ప్రాణం తీసింది. వాగు మాటు వద్ద సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి అందులో పడి మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామం వాగులో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కాజీపేటకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ (19) హసన్‌పర్తిలోని కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గురువా రం ఉదయం కాలేజీ స్నేహితులు సయ్యద్ జాహెద్‌షా, అబ్దుల్ షాదాబ్తో కలిసి బైక్‌పై సరదాగా కంఠాత్మకూర్ వాగు వద్దకు వచ్చారు. ఇస్మాయిల్ వాగులోని ఓ మాటు (నీటిని నిల్వచేసేందుకు అడ్డంగా వేసిన కట్ట) వద్ద సెల్ఫీ దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి అందులో పడిపోయాడు. దూరంగా ఉన్న స్నేహితులు గట్టిగా అరవడంతో స్థానికంగా ఉన్న వారు వచ్చి కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే అతను మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న దామెర ఎస్సై రాజేందర్ సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. ఇది కూడా చదవండి: ఎంపీ భార్య, కుమారుడి కిడ్నాప్ కేసులో ఐదుగురి అరెస్ట్ -
దేవాదుల పైప్‌లైన్ లీకేజీ
దామెర: దేవాదుల పైప్‌లైన్ లీకేజీతో ఒక్కసారిగా నీరు నింగిని తాకే విధంగా పైకి ఎగజిమ్మింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి సమీపంలో శనివారం చోటుచేసుకుంది. పులుకుర్తిలోని దేవాదుల పంప్ హౌజ్ నుంచి భీంఘన్‌పూర్ పంప్‌హౌజ్‌కు నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పులుకుర్తి శివారులో శనివారం ఉదయం గేట్‌వాల్వ్ లీకేజీ కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు నీరు ఎగిసిపడింది. దీంతో సమీపప్రాంతం మొత్తం జలమయమైంది. పులుకుర్తి గ్రామానికి చెందిన రైతు పండుగ రవి తన రెండెకరాల పొలంలో ఇటీవల నాట్లు వేయగా పొలం పూర్తిగా మునిగిపోయింది. లీకేజీ విషయమై సంబంధిత అధికారులకు, సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ ఎవరూ స్పందించడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలోనూ పైప్‌లైన్ లీకేజీతో రెండెకరాల పత్తి పూర్తిగా మునిగి నష్టం వాటిల్లిందని రవి వాపోయారు. -
గుండెపోటుతో ఆర్మీ మేజర్ మృతి
పరకాల: పండుగ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడిపేందుకు వారం క్రితం సెలవుల్లో ఇంటికి వచ్చిన ఆర్మీ మేజర్ దూడపాక సాయికిరణ్ (31)గుండెపోటుతో మృతిచెందాడు. హనుమకొండ జిల్లా పరకాలలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పరకాల పట్టణంలోని మల్లారెడ్డి కాలనీకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి దూడపాక పోశయ్య, సుశీల దంపతులకు సాయికృష్ణ, సాయికిరణ్‌లు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరినీ చిన్నప్పుడే తండ్రి గోల్కొండ సైనిక్ స్కూల్లో చేర్చారు. ప్రస్తుతం సాయికిరణ్ అమృత్సర్ లో మేజర్‌గా విధులు నిర్వహిస్తుండగా సోదరుడు సాయికృష్ణ జోధ్‌పూర్‌లో పనిచేస్తున్నాడు. సాయికిరణ్‌కు 5 ఏళ్ల క్రితం అపూ ర్వతో వివాహం జరిగింది. వీరికి రెండున్నర సంవత్సరాలు కుమారుడు ఉన్నాడు. సంక్రాంతి పండుగ కోసం ఈ నెల 7న సాయికిరణ్ పరకాలకు చేరుకున్నాడు. అంతకన్నా ముందే సోదరు సాయికృష్ణ కూడా సెలవుల్లో ఇంటికి వచ్చాడు. కాగా, సాయికిరణ్ శనివారం బూత్‌రూమ్‌కు వెళ్లి వచ్చిన కొద్ది సేపటికే గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు పరకాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. ఆదివారం సాయికిరణ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేసినట్లు పరకాల సీఐ పుల్యాల కిషన్ తెలిపారు. -
భర్త నిర్వాకం.. రెండో వివాహం చేసుకొని.. మొదటి భార్యను..
పరకాల(హనుమకొండ జిల్లా): రెండో వివాహం చేసుకున్న ఓ భర్త మొదటి భార్యను తీవ్రంగా చితకబాది అంతమొందించాడు. పరకాల మండలం వెంకటాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ పుల్యాల కిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తురాయి శంకర్ రెండో వివాహం చేసుకుని మొదటి భార్య తురాయి సక్కుబాయి(34)ని వేధిస్తూ తీవ్రంగా కొట్టేవాడు. ఈ నెల 5న సక్కుబాయిని తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితికి చేరుకుని పడిపోయింది. చిరంజీవి అనే ఓ యువకుడు గమనించి ఆమె సోదరుడికి సమాచారం అందించాడు. దీంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి సక్కుబాయి మృతిచెందింది. మృతురాలి సోదరుడు మోరె రాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా, ఈ ఘటనపై ఏసీపీ శివరామయ్య, సీఐ కిషన్ శనివారం గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. చదవండి: పంట చేనుకు కాపలా వెళ్లిన యువతి.. చివరికి ఊహించని ఘటన.. అసలేం జరిగింది? -
స్వగృహానికి పీవీ కారు
భీమదేవరపల్లి: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఉపయోగించిన కారును హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని ఆయన స్వగృహానికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. పీవీ నరసింహారావు 1980 ప్రాంతంలో ఈ కారును కొనుగోలు చేసినట్లు పీవీ సోదరుడి కుమారుడు పీవీ మదన్మోహన్ తెలిపారు. ఇంతకాలం కారు హైదరాబాద్‌లో ఉండగా.. ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు పీవీ ఉపయోగించిన కారు, కంప్యూటర్, టీవీ, కుర్చీ, మంచం తదితర వస్తువులను వంగరకు తీసుకొచ్చారు. కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉంది. పీవీ 18వ వర్ధంతి సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు శుక్రవారం వంగరలోని ఆయన ఇంటిని సందర్శించి.. ఆవరణలో నిలిపిన కారును ఆసక్తిగా తిలకించారు. -
బిల్లుల కోసం ఇల్లు అమ్ముకున్నాం.. సర్పంచ్ ప్రమీల భర్త ఆవేదన
భీమదేవరపల్లి: గ్రామాభివృద్ధి కోసం పనులు చేసి బిల్లులు సకాలంలో రాకపోవడంతో ఇల్లు అమ్మి మరీ చెల్లించా మని హనుమకొండ జిల్లా భీమదేవ రపల్లి మండలం కొత్తకొండ సర్పంచ్ దూడల ప్రమీల భర్త సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పల్లెప్రగతి’ లో భాగంగా కొత్తకొండలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ డాక్టర్ మారేపల్లి సుధీర్‌కుమార్ హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే సర్పంచ్ దూడల ప్రమీల భర్త సంపత్ మాట్లా డుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న పల్లెప్రగతి కార్యక్రమం బాగుందని, కానీ చేసిన పనులకు బిల్లులు రావడం ఆసల్యం అవుతుండటంతో సర్పంచ్‌లు ఇబ్బందుల పాలవుతున్నారని తెలిపారు. రెండేళ్ల క్రితం గ్రామంలో 500 ఇంకుడు గుంతలు నిర్మించామని, వాటికి రూ.20 లక్షలకు గాను రూ.5 లక్షలే వచ్చాయని, మిగతా రూ.15 లక్షలు ఇంకా రాలేదని వాపోయారు. చివరికి తన ఇల్లును రూ.20 లక్షలకు అమ్మి, అప్పులు కట్టి కిరాయి ఇంట్లో ఉంటున్నట్లు తెలిపారు. గ్రామంలో నీటిఎద్దడి నివారించేందుకు 6 బోర్లు వేశామని, నెలకు రూ.లక్ష వరకు వస్తున్న కరెంటు బిల్లు కూడా పంచాయతీకి భారంగా మారిందని చెప్పా రు. జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్క రి స్తానని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధికి రూ. 2లక్షలు ప్రకటించారు. -
గ్రీన్‌ఫీల్డ్ హైవే భూసేకరణలో ఉద్రిక్తత
దామెర: నాగపూర్– విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా చేపట్టిన సర్వేలో ఉద్రిక్తత నెలకొంది. తమ భూములను లాక్కోవద్దంటూ ఇద్దరు రైతులు ఆత్మహత్యకు యత్నించారు. హను మకొండ జిల్లా దామెర మండలంలోని ఊరుగొండ, దుర్గంపేట్ రెవెన్యూ గ్రామాల్లో సర్వే నిర్వహించేందుకు అధికారులు వారం రోజులుగా ప్రయత్నిస్తుండగా, రైతులు ఆం దోళనలకు దిగుతూ అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి కొంతమంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. శనివారం ఉదయం అధికారులు ఊరుగొండ, దుర్గంపేట్ రెవెన్యూ గ్రామాల్లో తిరిగి సర్వే ప్రారంభించారు. ఏసీపీ శివరా మయ్య ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రైతులు పొలాల వద్దకు వెళ్లకుండా 163 జాతీయ రహదారి వద్ద అడ్డుకున్నారు. ఆందోళనలు చేసిన పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఇతరమార్గాల ద్వారా కొందరు రైతులు అక్కడికి చేరుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఊరుగొండకు చెందిన చెల్పూరి అశోక్ అనే రైతు ఉరేసుకోవడానికి యత్నించడంతో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఓదెల రజిత అనే మరో మహిళారైతు ఆత్మహత్యే శరణ్యమని, ఇంటిల్లిపాది పురుగులమందు తాగి చనిపోతామంటూ రోదించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, అధికారులు వారికి నచ్చజెప్పి సర్వే కొనసాగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరిసరాల్లోని వ్యవసాయబావుల వద్ద, ఎస్సార్ఎస్పీ కెనాల్ వద్ద, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు రెండు 108 వాహనాలను అందుబాటులో ఉంచారు. -
వీరభద్రుని సన్నిధిలో సంక్రాంతి వేడుకలు
భీమదేవరపల్లి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో శనివారం జరిగిన మకర సంక్రాంతి ఉత్సవాలు అంబరాన్నంటాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవార్ల మొక్కుల సమర్పణతోపాటు కొత్తపల్లికి చెందిన 65 ఎడ్లబండ్ల రథాలు, వేలేరుకు చెందిన మేకల బండ్లను తిలకించేందుకు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్ తదితర జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హనుమకొండ జెడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎడ్లబండిపై గుడి చుట్టూ తిరిగి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. -
క్వారీలో టిప్పర్ బోల్తా.. ముగ్గురి మృతి
మడికొండ: చీకట్లోనే విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కూలీలను క్వారీ గుంత మింగేసింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామశివారులోని లక్ష్మి గ్రానైట్ క్వారీలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన చిత్రం చందు(20), జార్ఖండ్ రాష్టానికి చెందిన మహ్మద్ హకీమ్(22)లు హెల్పర్లుగా, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండకు చెందిన కొతల ముఖేశ్(23) లారీడ్రైవర్‌గా ఆరునెలల నుంచి లక్ష్మి గ్రానైట్‌లో పనిచేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటలు దాటిన తర్వాత హకీమ్, చందులు క్వారీలోని వేస్ట్ మెటీరియల్‌ను టిప్పర్‌లో తరలిస్తుండగా అది అదుపుతప్పి క్వారీ గుంతలో బోల్తాపడింది. దీంతో మహ్మద్ హకీమ్ అక్కడిక్కడే మృతి చెందాడు. గాయపడిన చందు, డ్రైవర్ ముఖేశ్‌లను ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చందు చనిపోయాడు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ ముఖేశ్ మృతిచెందాడు. చదవండి: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి -
4 గంటలు మట్టిలో ఇరుక్కుని
శాయంపేట: మంచినీటి బావి ఓడలు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటి స్థానంలో కొత్తవి పోసేందుకు ఓ యువకుడు మట్టిని తీస్తుండగా ఒక్కసారిగా కుంగిపోయి లోతుకు జారిపోయాడు. పోలీసులు నాలుగు గంటలపాటు శ్రమించి ఆ యువకుడిని క్షేమంగా బయటకు తీశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోతుగంటి వెంకటేష్ తన ఇంటి ముందు ఉన్న మంచినీటి బావి ఓడలను మార్చి కొత్తవి వేసేందుకు మట్టిని తొలగిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా మట్టి కుంగిపోవడంతో సుమారు ఏడు ఓడల లోతు జారిపోయాడు. గమనించిన అతని భార్య పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే 100కు డయల్ చేయడంతో ఎస్ఐ అక్కినపల్లి ప్రవీణ్‌కుమార్ ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే రెండు జేసీబీలు తెప్పించి మట్టి, ఓడలను తొలగిస్తూ పోయారు. సుమారు నాలుగు గంటలపాటు శ్రమించి యువ కుడిని బయటకు తీశారు. వెంకటేష్‌ను సురక్షితంగా బయటకు తీసుకొస్తున్న దృశ్యం ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే వెంకటేష్‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. సర్పంచ్ రాజిరెడ్డి, ఉపసర్పంచ్ వలి హైదర్, ఎంపీటీసీ ఐలయ్యలతోపాటు పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
పోలీసు అధికారులుండే అపార్ట్మెంట్లోనే భారీ చోరీ
కాజీపేట: ఇద్దరు ఏసీపీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్సైలు నివాసముండే అపార్ట్మెంట్లోనే దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ధనవంతులు, వ్యాపారులు, ఉద్యోగులుండే ప్రాంతం కావడంతో చుట్టూ సీసీ కెమెరాలున్నా దొంగలు దర్జాగా లోపలికి చొరబడి బంగారు నగలను మాత్రమే చోరీ చేసి వెండి నగలతోపాటు నగదును చిందరవందరగా పడేసి వెళ్లారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట 61వ డివిజన్ వడ్డెపల్లి ట్యాంక్‌బండ్ ప్రాంతంలోని పీజీఆర్ అపార్ట్మెంట్లో జరిగింది. మూడు ఫ్లాట్లలో దాదాపు 190 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. స్థానిక సీఐ గట్ల మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం... పీజీఆర్ అపార్ట్మెంట్లో 60 కుటుంబాలు ఉంటున్నాయి. 202 ఫ్లాట్‌లో ఉండే ‘నిట్’రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్వీ చలం, 203లో ఉండే వెలిచర్ల కుమార్, 102 ఫ్లాట్ వాస్తవ్యుడు మనీశ్‌కుమార్ ఇళ్లకు తాళాలు వేసి బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లారు. ఇదే అదనుగా ఆదివారంరాత్రి దొంగలు వడ్డెపల్లి రిజర్వాయర్ ట్యాంక్‌బండ్ పైభాగం నుంచి ఫెన్సింగ్ కట్ చేసి లోపలికి దిగి వాచ్మెన్ గంగారపు కొమురయ్య ఇంటికి బయటి నుంచి గొళ్లెం పెట్టి అపార్ట్మెంట్లోకి చొరబడ్డారు. మూడు ఫ్లాట్లకున్న తాళాలను పగులగొట్టి బీరువాల్లోని దాదాపు 190 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. సోమవారంరాత్రి తమ ఇళ్లలో దొంగతనం జరిగినట్లుగా సమాచారం అందుకున్న చలం ఇంటికి వచ్చి చూడగా పక్క ఫ్లాట్లలోనూ చోరీలు జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని డీసీపీ పుష్ప తెలిపారు. -
వరంగల్: రెండు వారాలు కావస్తున్నా, ఇంకా అప్డేట్ కాలే!
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా ఏర్పడి రెండు వారాలు కావస్తున్నా.. ఇటు అధికారులు, అటు ప్రజలను మార్గదర్శనం చేసే భౌగోళిక వివరాలతో కూడిన జిల్లా వెబ్సైట్ ఇంకా పూర్తిస్థాయిలో అప్డేట్ కాలేదు. పూర్వ వరంగల్ అర్బన్ జిల్లా నుంచి కలిసిన వరంగల్, ఖిలావరంగల్ కలుపుకొని మిగిలిన 11 మండలాలతో వరంగల్ జిల్లా చిత్రపటం(మ్యాప్) మాత్రమే వెబ్సైట్లో పొందుపరిచారు. అసలు విషయం ఏమిటంటే.. వరంగల్‌రూరల్.తెలంగాణ.జీవోవీ.ఇన్తోనే వెబ్సైట్ ప్రజలకు అందుబాటులో ఉంది. అయితే ఈ సైట్ క్లిక్ చేయగానే తొలుత హోంపేజీలో వరంగల్ జిల్లా అని కనిపిస్తోంది. చదవండి: సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పునర్విభజన? మిగతా రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల లెక్క చూసుకుంటే వరంగల్ రూరల్ జిల్లా లెక్కల ప్రకారం మూడు రెవెన్యూ డివిజన్లు, మూడు మున్సిపాలిటీలు, 16 మండలాలు, 401 గ్రామాలుగానే ఉంది. హనుమకొండ జిల్లాలో కలిసిన ఆత్మకూరు, దామెర, పరకాల, నడికూడ, శాయంపేట మండలాలు కూడా వరంగల్ రూరల్ కిందనే ఉన్నట్టుగా సైట్లో కనిపిస్తోంది. ఆధునిక సాంకేతికత అందిపుచ్చుకుంటున్న నేటి సమాజంలో వీటిని అప్డేట్ చేయాల్సిన జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంపై జనాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ప్రజలతో పాటు ఈ ప్రాంతాలకు వివిధ పనుల కోసం వచ్చేవారికి జిల్లా అధికారుల పాత సమాచారమే ఉండడంతో కొంత గందరగోళం నెలకొంది. వెంటనే వెబ్సైట్ అప్డేట్ చేయాల్సిన అవసరముందనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. చదవండి: చివరి రక్తపు బొట్టు దాకా దళితుల కోసం పోరాడతా: సీఎం కేసీఆర్ గాడిన పడని ప్రభుత్వ విభాగాలు జిల్లా స్వరూపం మారడంతో అందుకు సంబంధించిన వివరాలతో హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు జిల్లా ఎౖMð్స జ్ శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే వరంగల్ జిల్లాలో చేరిన వరంగల్, ఖిలావరంగల్ మండలాలతో కలుపుకొని 13 మండలాల వైన్‌షాప్‌లు, బార్లు.. తదితరాల పనులు పర్యవేక్షించనున్నారు. ప్రస్తుతం పూర్వ వరంగల్ రూరల్ జిల్లాలోని మండలాల వారిగానే ఎక్సైజ్ కార్యకలాపాలు సాగుతున్నాయని సంబంధిత విభాగాధికారి తెలిపారు. అలాగే ఆరోగ్య విభాగానికొస్తే పూర్వ వరంగల్ రూరల్ నుంచి నాలుగు పీహెచ్‌సీలు, ఓ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హనుమకొండ జిల్లాకు వెళ్తుండగా.. హనుమకొండ జిల్లా నుంచి ఒక పీహెచ్సీ, నాలుగు సబ్‌సెంటర్లు, ఏడు అర్బన్ హెల్త్ సెంటర్లు, ఎంజీఎం, ఆయుర్వేదిక ఆసుపత్రి.. తదితరాలు వరంగల్ జిల్లాలోకి వచ్చాయి. అయితే జిల్లాస్థాయిలో అధికారులు వీటిని విభజించుకున్నా.. ఎలా రిపోర్టింగ్ చేయాలన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఆయా జిల్లాల సమగ్ర సమాచారంతో కూడిన లేఖను హైదరాబాద్‌లోని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌కు ఇరు జిల్లాల ఆరోగ్యవైద్యాధికారులు పంపారు. అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ రా గానే.. రోజువారి వివరాలను కొత్త జిల్లాల వారిగా పంపించనున్నారు. ప్రస్తుతం సమన్వయంతో కలిసి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఆ విభాగ వర్గాలు తెలిపాయి. అలాగే భూ గర్భజల గనుల శాఖ, మత్స్య విభాగం, పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖలు కూడా త్వరలోనే కొత్త జిల్లాల వారీగా కార్యకలాపాలు సాగించేందుకు అధికారికంగా ఉన్నతాధికారుల నుంచి అనుమతులు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. కొత్త జిల్లా ప్రకారమే.. ఇక రెవెన్యూ విషయానికొస్తే వరంగల్ జిల్లాలో చేరిన వరంగల్, ఖిలావరంగల్తో సహా 13 మండలాలవారీగా భూమి, ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, భూ వివాదాలకు సంబంధించిన సమస్యలు సంబంధిత అధికారులు చూసుకుంటున్నారు. జిల్లా విద్యావిభాగాధికారులు కొత్తగా ఏర్పడిన వరంగల్ జిల్లా ప్రకారమే ప్రభుత్వ పాఠశాలలు పర్యవేక్షిస్తున్నారు. ఇక వర్షపాతం వివరాలు కూడా వరంగల్ జిల్లా ప్రకారమే అధికారులు లెక్కలు చేస్తున్నారు. అయితే కొత్త జిల్లా ప్రకారం అన్ని ప్రభుత్వ విభాగాలు పూర్తిస్థాయిలో పనిచేయాల్సిన అవసరముందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఎటో..స్పష్టత ఏదీ? కాకతీయ మెడికల్ కాలేజీ 130.30 ఎకరాల్లో విస్తరించి ఉంటే ఇందులో వరంగల్ జిల్లాలో 55 ఎకరాలు, హనుమకొండ జిల్లాలో 75.30 ఎకరాలు ఉంది. సెంట్రల్ జైలు విషయానికొస్తే 56.39 ఎకరాల్లో ఉన్న జైలు 44.34 ఎకరాలు వరంగల్ జిల్లాలో, 12.15 ఎకరాలు హనుమకొండ జిల్లాలో ఉంది. 15.30 ఎకరాల్లో ఉన్న బాలుర, బాలికల పాలిటెక్నిక్ కాలేజీ వరంగల్ జిల్లాలో రెండు ఎకరాలు, హనుమకొండ జిల్లాలో 13.30 ఎకరాలు ఉంది. 530 ఎకరాల్లో ఉన్న భద్రకాళి బండ్ ప్రాంతం వరంగల్ జిల్లాలో 113 ఎకరాలు, హనుమకొండ జిల్లాలో 417 ఎకరాలు ఉంది. 5.17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వెటర్నరీ హాస్పిటల్ అండ్ కాలేజ్ వరంగల్ జిల్లాలో 3.17 ఎకరాలు, హనుమకొండలో రెండు ఎకరాల్లో ఉంది. వీటిని ఏ జిల్లాలో ఉంచాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందని అధికారులు అంటున్నారు. -
స్వార్థ ప్రయోజనాల కోసమే విభజన
మార్పునకు కేంద్రం కాకుండా కుట్ర జిల్లా బంద్‌కు సంపూర్ణ మద్దతు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వరంగల్ : టీఆర్ఎస్ ప్రభుత్వ మార్పునకు భవిష్యత్‌లో గ్రేటర్ వరంగల్ కేంద్రంగా ఉంటుందన్న భయంతోనే రెండు జిల్లాలుగా విభజించే కుట్ర జరుగుతోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. హన్మకొండలోని హరిత కాకతీయలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా కాకుండా స్వార్థపూరిత ప్రయోజనాల కోసం జరుగుతున్నాయన్నారు. ఓరుగల్లు చరిత్రను తుంగలోకి తొక్కేందుకు కుట్ర జరుగుతోందన్నారు. హన్మకొండ జిల్లా ఏర్పాటుతో చరిత్ర విచ్ఛిన్నం అవుతుందన్న వేదన అందరిలో ఉందన్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ప్రజలు కూడా వరంగల్‌ను విడదీయెుద్దన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పరిపాలన సౌలభ్యం అంటే కోటి జనాభా ఉన్న హైదరాబాద్, సికిందరాబాద్, సైబరాబాద్‌లను ఎందుకు విడదీయడం లేదన్నారు. సీఎం సొంత జిల్లా మెదక్‌లో ఒక్కో జిల్లా కేంద్రానికి మధ్య 55 నుంచి 75 కిలోమీటర్లు ఉన్నదని, కానీ ఎనిమిది కిలోమీటర్ల దూరం లేని హన్మకొండ, వరంగల్‌ను ఎలా విడదీస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్ తర్వాత ఎక్కువ పెట్టుబడులు వచ్చేందుకు వరంగల్ జిల్లా అనుకూలంగా ఉందని, దాన్ని అడ్డుకునేందుకే ఈ విభజన అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందన్నారు. జిల్లా పరిరక్షణ కమిటీ నేతృత్వంలో మంగళవారం జరిగే బంద్‌కు ఎమ్మార్పీఎస్ పూర్తిగా మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రతి కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంఎస్పీ జాతీయ ప్రతినిధి ప్రదీప్, ఎమ్మార్పీఎస్ నాయకులు మంద కుమార్, మల్లేష్, వినోద పాల్గొన్నారు. -
నేడు జిల్లా బంద్
హన్మకొండ జిల్లా వద్ధని, జనగామ కావాలని డిమాండ్ ఏకమైన అన్ని రాజకీయ పార్టీలు విజయవంతం చేయాలని పరిరక్షణ కమిటీ వినతి వరంగల్ : నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా హన్మకొండ జిల్లా ఏర్పాటు నిర్ణయాన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. వరంగల్ నుంచి హన్మకొండను వేరు చేయడాన్ని అడ్డుకునేందుకు జిల్లా పరిరక్షణ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ అధ్వర్యంలో మంగళవారం జిల్లా బంద్ చేపట్టాలని తీర్మానించారు. జనగామ ప్రాంత ప్రజలు కోరుకున్న విధంగా జిల్లా ఏర్పాటు చేపట్టని ప్రభుత్వం.. అనూహ్యంగా హన్మకొండ జిల్లా పేరును తెరపైకి తెచ్చింది. చారిత్రక వారసత్వానికి నిలువుటుద్దమైన వరంగల్‌ను విడిదీయాలనే నినర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. టీఆర్ఎస్లోని కొందరి ప్రయోజనాల కోసమే హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేస్తున్నారని పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. హన్మకొండ జిల్లా ఏర్పాటు అంశం అ«ధికార టీఆర్ఎస్లో చిచ్చుపెడుతోంది. ఆ పార్టీకి చెందిన మెజార్టీ నేతలు వరంగల్‌ను విడదీయవద్దని అభిప్రాయపడుతుండగా, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, ఎమ్మెల్యే సురేఖ హన్మకొండ జిల్లా ఏర్పాటు చేయాల్సిందేనని బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం పూర్తిగా నిర్ణయం తీసుకోనందున బంద్ చేయాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. జిల్లా పరిరక్షణ కమిటీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న బంద్‌కు బిజెపీ, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ, సీపీఐ, ఎంఎస్ఎస్, ఆర్పీఐ, బీఎస్పీ, న్యూyð మోక్రసీ, ఎమ్మార్పీఎస్, కుల, ప్రజాసంఘాలు, కొన్ని ఉద్యోగ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. వాణిజ్య, వ్యాపార, ఉద్యోగ రంగాలకు చెందిన వారంతా బంద్‌ను విజయవంతం చేయాలని జిల్లా పరిరక్షణ కమిటీ కోరింది. -
హన్మకొండ జిల్లా ఏర్పాటు అప్రజాస్వామికం
రౌండ్ టేబుల్ సమావేశంలో పలు పార్టీలు, సంఘాల నేతలు వరంగల్ జిల్లా పరిరక్షణ కమిటీ ఏర్పాటు ఈ నెల 30న బంద్‌కు పిలుపు వరంగల్ లీగల్ : చారిత్రక నేపథ్యం ఉన్న వరంగల్ జిల్లాను విడదీసి హన్మకొండ జిల్లా ఏర్పాటుచేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై పలువురు మండిపడ్డారు. జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా ఏర్పాటుకు వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. సమావేశంలో పలువురు మాట్లాడుతూ రాత్రికి రాత్రి హన్మకొండ జిల్లా ఏర్పాటు నిర్ణయం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. జిల్లాల విభజన–నూతన జిల్లాల ఏర్పాటు కోసం ముందుగా ఎలాంటి నిబంధనలు పొందుపర్చని కారణంగా శాస్త్రీయత లోపించిందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వక్తలు వెల్లడించిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. స్వరం పెంచి ఉద్యమించాలి.. జిల్లాలోని రామప్ప, వేయి స్తంభాల గుడి, ఓరుగల్లు కోటను మూడు ముక్కలుగా విభజిస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి విమర్శించారు. జనగామ ప్రజలు పలురకాలుగా తమ ఆకాంక్షను వ్యక్తం చేసి చివరకు ఆమరణ దీక్షకు పూనుకున్న స్పందన లేదన్నారు. హన్మకొండ జిల్లా ఏర్పాటును వ్యతిరేకిస్తూ అఖిలపక్షం సమిష్టిగా స్వరం పెంచి లక్ష్యం సాధించేవరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ ఎవరు అడిగారని హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేస్తున్నారో సీఎం కేసీఆర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ వరంగల్ జిల్లా విభజనలో శాస్త్రీయత లేదని పేర్కొన్నారు. దీనికి జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, అధికార పార్టీ ప్రతినిధులు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ అకస్మాత్తుగా రాత్రికి రాత్రి హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ను విడగొట్టకుండా800 ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయ సామ్రాజ్య రాజధాని ఓరుగల్లును విడగొట్టడంలో మర్మమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. సీపీఐం ఎంఎల్(న్యూడెమోక్రసీ) జిల్లా నాయకుడు నున్నా అప్పారావు మాట్లాడుతూ ఆదివాసీల డిమాండ్ అయిన సమ్మక్క–సారలమ్మ జిల్లా ఏర్పాటును మరిచి ఆదివాసీ మండలాలను విభజిస్తూ అణిచివేసే కుట్రలు సాగిస్తున్నారని విమర్శించారు. టీడీపీ జాతీయ కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ మహానగర విభజనను ప్రధాన సమస్యగా భావించి అందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ వెంకటనారాయణ మాట్లాడుతూ హన్మకొండ ఏర్పాటును అందరూ వ్యతిరేకిస్తున్నా టీఆర్ఎస్ నేతలు మౌనంగా భరిస్తున్నారన్నారు. టీజీఓస్ జిల్లా అధ్యక్షుడు అన్నమనేని జగన్మోహన్రావు మాట్లాడుతూ చారిత్రక నగరాన్ని విడదీయడం ఎవ్వరు జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. మూడు జిల్లాలకే ఉన్న ఉద్యోగుల సర్దుబాటు సాధ్యం కాలేని పరిస్థితిలో నాలుగవ జిల్లాగా హన్మకొండ ఏర్పాటును ఉద్యగులందరూ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు పుల్లూరి సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అవసరాలను తీర్చే రెండవ నగరం వరంగల్‌ను విభజించవద్దని అన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు బైరపాక జయాకర్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముద్దసాని సహోదర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో బీజేపీ నాయకులు డాక్టర్ విజయలక్ష్మి, రావు పద్మ, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ డిప్యూటీ మేయర్ అశోక్‌రావు, కె.గోపాల్‌రెడ్డి, బుచ్చిబాబు, కే.వీ.నర్సింహరావు, డాక్టర్ సిరికొండ సంజీవరావు, రావు అమరేందర్‌రెడ్డి, అమరేందర్, జన్ను పరంజ్యోతి, ఆకుల వేణుగోపాల్‌రావు, చిల్లా రాజేంద్రప్రసాద్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టీ.వీ.రమణతో పాటు అల్లం నాగరాజు, మానేపల్లి కవిత, లావుడ్యా సిద్ధూనాయక్, బొమ్మ నాగరాజు, సత్యనారాయణ పాల్గొన్నారు. కమిటీ ఏర్పాటు.. బంద్‌కు నిర్ణయం వరంగల్ జిల్లా పరిరక్షణ కోసం భవిష్యత్ ఉద్యమాలు చేసేలా పరిరక్షణ కమిటీని ఈ సమావేశంలో ఏర్పాటుచేసుకున్నారు. కమిటీకి కన్వీనర్ బైరపాక జయాకర్, అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, సంఘాల ప్రతినిధులను పరిరక్షణ కమిటీలో సభ్యులుగా ఎన్నుకున్నారు. అంతేకాకుండా హన్మకొండ జిల్లా ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 30న బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ విజయవంతానికి అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తిచేశారు. -
ఒకటిగానే ఉండాలి
హన్మకొండ వద్దని సీఎంను కోరుదాం టీఆర్ఎస్ ముఖ్యనేతల అభిప్రాయం హైదరాబాద్‌లో కీలక నేతల భేటీ ప్రజాభీష్టం ప్రకారం వెళ్లాలని అభిప్రాయం హన్మకొండ జిల్లా ఉండాలన్న ఎమ్మెల్సీ కొండా సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన నేతలు అసంతృప్తితో వెళ్లిపోయిన కొండా మురళీ సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎలాంటి వైఖరి తీసుకోవాలనే విషయంపై అధికార పార్టీ దృష్టి పెట్టింది. హన్మకొండ జిల్లా ఏర్పాటుపై భిన్న వాదనలు వస్తున్నాయి. చారిత్రక వరంగల్ నగరాన్ని రెండుగా విభజించవద్దని పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వరంగల్ నగరాన్ని రెండు జిల్లాలకు కేటాయించడం వల్ల అభివృద్ధి ఆగిపోతుందని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అభిప్రాయపడుతున్నాయి. వరంగల్ జిల్లాను... వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలుగా విభిజించాలనే ప్రతిపాదన మొదట కొనసాగింది. పునర్విభజన ముసాయిదా నోటిఫికేషన్ వెలువడే తరుణంలో ఒక్కసారిగా హన్మకొండ జిల్లా అంశం తెరపైకి వచ్చింది. నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచే హన్మకొండ జిల్లా ఏర్పాటు వద్దనే డిమాండ్లు మొదలయ్యాయి. రోజురోజుకు ఈ డిమాండ్లు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిపై టీఆర్ఎస్ దృష్టి పెట్టింది. జిల్లా ప్రజల అభిప్రాయం ఎలా ఉంది.. పార్టీ వ్యూహం ఎలా ఉండాలనే అంశంపై చర్చించేందుకు టీఆర్ఎస్ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు గురువారం సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశంలో స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, మంత్రి ఎ.చందులాల్, ఎంపీలు పసునూరి దయాకర్, ఎ.సీతారాంనాయక్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యేలు టి.రాజయ్య, కొండా సురేఖ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డి.వినయభాస్కర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, కొండా మురళీధర్‌రావు, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు, నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జీ పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే బి.శంకర్‌నాయక్ తిరుపతిలో ఉన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే డి.ఎస్.రెడ్యానాయక్ అనారోగ్యం కారణంగా హాజరుకాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనపైనే చర్చ జరిగింది. వరంగల్‌ను వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలుగా విభజిస్తే సరిపోతుందని, హన్మకొండ జిల్లా వద్దని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా ఉన్న వరంగల్‌ను విభిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో నెలకొందని... ఇది ప్రభుత్వానికి, పార్టీకి మంచిదికాదని పలువురు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, ఉద్యోగు సంఘాలు, ప్రజా సంఘాల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని హన్మకొండ జిల్లా ప్రతిపాదనను ఉపసంహరించుకునేలా ప్రయత్నించాలని అభిప్రాయపడ్డారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు అందరూ త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి క్షేత్రస్థాయి అభిప్రాయాన్ని వివరించాలని నిర్ణయించారు. ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఇదే రకంగా చెప్పారు. అయితే హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. హన్మకొండ జిల్లా ఏర్పాటు వల్ల వరంగల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. హన్మకొండ జిల్లా ఏర్పాటు వల్ల వరంగల్ జిల్లా పరిపాలన కేంద్రం నర్సంపేట ప్రాంతానికి దగ్గరగా ఉంటుందని ఆ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జీ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొన్నదానికి భిన్నంగా... హన్మకొండ జిల్లా ఏర్పాటు వద్దని ఎక్కువ మంది నేతలు అనడంతో ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన ప్రజాప్రతినిధులు కొండా మురళికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. వారి అభిప్రాయంతో విభేదించిన కొండా మురళీధర్‌రావు, కొండా సురేఖ సమావేశం నుంచి బయటికి వచ్చారు. వీరిద్దరు బయటికి వచ్చిన సమయంలో అక్కడ వారి సెక్యూరిటీ సిబ్బంది, వాహనం లేవు. ఉప ముఖ్యమంత్రి కడియం సహా పలువురు బయటికి వచ్చి భోజనం చేసి వెళ్లాలని కోరినా కొండా మురళి, సురేఖ వినిపించుకోలేదు. వేరే వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం మిగిలిన నేతలు కొద్దిసేపు చర్చించి సమావేశం ముగించారు. మొత్తంగా జిల్లాల పునర్విభజన అంశం టీఆర్ఎస్లో విభేదాలకు కారణమవుతోంది. -
పట్టింపు లేదు
పరిపాలన సౌలభ్యం కోసమే హన్మకొండ ప్రజల అభీష్టం మేరకే కొత్త జిల్లాలు మన జిల్లా విభజనపై సీఎం కేసీఆర్ నేడు మండలాలపై స్పష్టత సాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్ నగరాన్ని రెండు జిల్లాలుగా విభజించే విషయంలో నెలకొన్న అయోమయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన ప్రక్రియ చేపడుతున్నామని, ప్రజల అభీష్టం మేరకే తుది నిర్ణయం ఉంటుందని చెప్పారు. జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఎక్కువ అంశాలపై వరంగల్ జిల్లా పునర్విభజన ప్రతిపాదనలనే ఉదహరించారు. ‘పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేపట్టాం. సగటున 16 మండలాలు ఉండాలని ప్రతిపాదించాం. వరంగల్ జిల్లాలో పునర్విభజనపై కొంత గందరగోళం ఉందని తెలిసింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న భూపాలపల్లి జిల్లా... ప్రస్తుతం ఉన్న నిజామాబాద్ జిల్లాతో సమానంగా ఉంది. భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోని మండలాలను మినహాయిస్తే 32 వరకు మండలాలు ఉంటున్నాయి. ఇన్ని మండలాలతో ఒక జిల్లా అంటే మళ్లీ పరిపాలన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అన్నీ పరిశీలించాకే వరంగల్, హన్మకొండ జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. వరంగల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతవాసులు నగరంతోనే అనుసంధానమవుతారు. అందుకే వరంగల్ కేంద్రంగా రెండు జిల్లాలను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. దీనివల్ల వరంగల్ నగరం ఉనికికి, అభివృద్ధికి ఏ ఇబ్బందీ ఉండదు. గ్రేటర వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థలు... వరంగల్ నగర అభివృద్ధి, సేవల కల్పనను పర్యవేక్షిస్తాయి. పరిపాలన పరంగా రెండు జిల్లాలు ఉంటాయి. ఇవన్నీ ప్రజలు అంగీకరిస్తేనే. హన్మకొండ జిల్లా ఏర్పాటుపై పట్టింపులేదు. ప్రజలు వద్దంటే ఒకే జిల్లాగా ఉంటుంది. జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ప్రజలు తమ ప్రతిపాదనలు ఇవ్వవచ్చు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వాఖ్యల నేపథ్యంలో ప్రజల అభిప్రాయం మేరకు హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రక్రియ ఉండనుంది. హన్మకొండపై భిన్నాభిప్రాయాలు వరంగల్ జిల్లాలను నాలుగు జిల్లాలుగా విభజించాలనే ప్రతిపాదనపై రాజకీయ నేతలు, ఉద్యోగులు, ప్రజల్లో గందరగోళం ఉంది. అని రాజకీయ పార్టీల్లోనూ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హన్మకొండ జిల్లా ఏర్పాటు అవసరం లేదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శుక్రవారం పరకాలలో అభిప్రాయపడ్డారు. జిల్లాల పునర్విభజనలో మెుదటి ప్రతిపాదించిన వరంగల్ జిల్లా నుంచి హన్మకొండ జిల్లాగా విభజించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ప్రకటించాయి. జిల్లా కేంద్రాన్ని రెండు జిల్లాలుగా విభజించడం సరికాదని పేర్కొన్నాయి. 22న ముసాయిదా విడుదల జిల్లాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరింది. వరంగల్ జిల్లాను... వరంగల్, హన్మకొండ, ఆచార్య జయశంకర్, మహబూబాబాద్ జిల్లాలుగా విభజించేలా ప్రతిపాదనలు ఖరారయ్యాయి. వరంగల్, హన్మకొండ జిల్లాలో 14 చొప్పున మండలాలు, ఆచార్య జయశంకర్ జిల్లాలో 16 మండలాలు, మహబూబాబాద్ జిల్లాలో 12 మండాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదాను సిద్ధం చేసింది. కొత్తగా హన్మకొండ, భూపాలపల్లి, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్లతో పాటు కొత్త మండలాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ముసాయిదాను విడుదల చేయనుంది. అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు గడువు విధించనుంది. ఈ ప్రక్రియ తర్వాత తుది మార్పులు చేసి అక్టోబరు 11(దసరా) నుంచి కొత్త జిల్లాల నుంచి పరిపాలన మొదలుకానుంది. మండలాలపై నేడు స్పష్టత జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై ముసాయిదా సిద్ధమైన నేపథ్యంలో కొత్తగా ఎన్ని మండలాలు ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొత్తగా ఎనిమిది మండలాలు ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి గతంలో ప్రతిపాదనలు పంపింది. ఖిలా వరంగల్(వరంగల్), కాజీపేట(హన్మకొండ), ఐనవోలు(వర్ధన్నపేట), వేలేరు(ధర్మసాగర్), చిల్పూరు(స్టేషన్‌ఘన్‌పూర్), టేకుమట్ల(చిట్యాల), ఇనుగుర్తి(కేసమద్రం), చిన్నగూడురు(మరిపెడ) మండలాలను కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. మండలాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం కొత్తగా మార్గదర్శకాలు రూపొందించింది. పట్టణ ప్రాంతాల్లో 1.50 లక్షల జనాభా, గ్రామీణ ప్రాంతాల్లో 35 వేల జనాభా ఉండాలని స్పష్టం చేసింది. తాజా మార్గదర్శకాలతో ఈ ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం మళ్లీ ప్రతిపాదనలు తయారు చేసి ఆదివారం ఉదయం 11 గంటల వరకు పంపించాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) రేమండ్ పీటర్, జిల్లా కలెక్టర్ వాకాటి కరుణను ఆదేశించారు. కలెక్టర్ వాకాటి కరుణ జిల్లాలోని ఆర్డీవోలతో సమాచారం సేకరించి దీనిపై నివేదిక రూపొందించే పనిలో నిమగ్నయ్యారు. -
కొన్ని మార్పులు
జిల్లాల పునర్విభన ముసాయిదాకు తుదిరూపు వరంగల్, హన్మకొండలో 14 చొప్పున మండలాలు హన్మకొండ జిల్లాలోకి పాలకుర్తి, కొడకండ్ల జయశంకర్ జిల్లాలోకి శాయంపేట మహబూబాబాద్‌లోనే కొత్తగూడ కొత్తగా హన్మకొండ, భూపాలపల్లి, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్లు సాక్షిప్రతినిధి, వరంగల్ : అన్ని వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్న జిల్లాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరింది. శనివారం హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం జరగనున్న నేపథ్యంలో జిల్లాల పునర్విభజనపై ముసాయిదా సిద్ధమైంది. జిల్లాలతోపాటు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైనా ప్రతిపాదనలు రూపొందించారు. వరంగల్ జిల్లాను వరంగల్, హన్మకొండ, ఆచార్య జయశంకర్, మహబూబాబాద్ జిల్లాలుగా విభజించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తుది ముసాయిదాలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. 16 మండలాలతో వరంగల్ జిల్లాను, 12 మండలాలతో హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేయాలని మొదట ప్రతిపాదనలు చేశారు. తాజా మార్పుల ప్రకారం... వరంగల్, హన్మకొండ జిల్లాల్లో 14 చొప్పున మండలాలు ఉంటున్నాయి. ఆచార్య జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలోని మండలాల సంఖ్యలో మార్పేమీ జరగలేదు. తాజా ప్రతిపాదన ప్రకారం శాయంపేట మండలం ఆచార్య జయశంకర్ జిల్లాలో కలవనుంది. వరంగల్ జిల్లాలో కొనసాగించాలని ఆ మండల ప్రజలు పోరాటాలు చేసినా ప్రతిపాదనల్లో మాత్రం దీనికి విరుద్ధంగానే ఉంది. పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి, కొడకండ్ల మండలాలను హన్మకొండ జిల్లాలో కలిపేలా, రాయపర్తి మండలాన్ని వరంగల్ జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు ఉన్నాయి. కొత్తగూడ మండలాన్ని మొదట పేర్కొనట్లుగా మహబూబాబాద్ జిల్లాలోనే కలపనున్నారు. జిల్లాల వారీగా మండలాలు... వరంగల్ జిల్లా : వరంగల్, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు, పరకాల, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ, రాయపర్తి. హన్మకొండ జిల్లా : హన్మకొండ, హసన్‌పర్తి, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, రఘునాథపల్లి, పాలకుర్తి, కొడకండ్ల, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపురం. ఆచార్య జయశంకర్ జిల్లా : భూపాలపల్లి, చిట్యాల, గణపురం, రేగొండ, శాయంపేట, మొగుళ్లపల్లి, కాటారం, మహదేవపూర్, మల్హర్రావు, మహాముత్తారం, ఏటూరునాగారం, గోవిందరావుపేట, మంగపేట, ములుగు, తాడ్వాయి, వెంకటాపురం. మహబూబాబాద్ : డోర్నకల్, కేసముద్రం, కురవి, మహబూబాబాద్, మరిపెడ, నర్సింహులపేట, నెల్లికుదురు, తొర్రూరు, గూడురు, కొత్తగూడ, బయ్యారం, గార్ల. యాదాద్రి జిల్లా : జనగామ, లింగాలగణపురం, దేవరుప్పుల, బచ్చన్నపేట. సిద్ధిపేట జిల్లా : చేర్యాల, మద్దూరు. కొత్త రెవెన్యూ డివిజన్లు ఇలా.. ప్రతిపాదిత నాలుగు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటవుతున్నాయి. భూపాలపల్లిని రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల క్రితమే ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భూపాలపల్లి కేంద్రంగా ఆచార్య జయశంకర్ జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. దీంతో భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంటోంది. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటును ముసాయిదాలో పేర్కొంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న హన్మకొండ జిల్లాలో హన్మకొండ, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానున్నాయి. రెవెన్యూ డివిజన్ల వారీగా మండలాలు... నర్సంపేట : నెక్కొండ, పరకాల, చెన్నారావుపేట, దుగ్గొండి, ఖానాపురం, నల్లబెల్లి, నర్సంపేట. వరంగల్ : ఆత్మకూరు, గీసుగొండ, పర్వతగిరి, రాయపర్తి, సంగెం, వరంగల్, వర్ధన్నపేట. హుజూరాబాద్ : భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపురం. హన్మకొండ : రఘునాథపల్లి, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, హన్మకొండ, హసన్‌పర్తి, జఫర్‌గఢ్, కొడకండ్ల, పాలకుర్తి, నర్మెట. భూపాలపల్లి : కాటారం, మహదేవపూర్, మల్హర్రావు, మహాముత్తారం, భూపాలపల్లి, చిట్యాల, గణపురం, రేగొండ, శాయంపేట, మొగుళ్లపల్లి. ములుగు : ఏటూరునాగారం, గోవిందరావుపేట, మంగపేట, ములుగు, తాడ్వాయి, వెంకటాపురం. మహబూబాబాద్ : బయ్యారం, గార్ల, డోర్నకల్, కేసముద్రం, కురవి, మహబూబాబాద్, మరిపెడ, నర్సింహులపేట, నెల్లికుదురు, తొర్రూరు, గూడురు, కొత్తగూడ. జనగామ : జనగామ, లింగాలగణపురం, దేవరుప్పుల, బచ్చన్నపేట, ఆలేరు, గుండాల, మోటకొండూరు(న్యూ), రాజాపేట, అడ్డగూడురు(న్యూ), మోత్కూరు. -
నాలుగు జిల్లాలుగా వరంగల్
12 మండలాలతో హన్మకొండ జిల్లా చారిత్రక నగరం రెండుగా విభజన అన్ని వర్గాల్లో అయోమయం డ్రాఫ్టు నోటిఫికేషన్‌పై ఉత్కంఠ సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనపై స్పష్టత వచ్చినట్లే వచ్చి మరింత గందరగోళంలో పడింది. జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని కొన్ని నెలలుగా వస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోగా.. ఎవరూ డిమాండ్ చేయకుండానే హన్మకొండ జిల్లా ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ముసాయిదా నోటిఫికేషన్ రూపకల్పన దాదాపు పూర్తయింది. వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించారు. వరంగల్, హన్మకొండ, ఆచార్య జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా విభజించేలా ముసాయిదా రూపొందించారు. జనాభా ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. జనాభాను ఆధారంగా చేసుకుని కొత్తగా హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేసే ప్రతిపాదనను రూపొందించారు. తాజా ప్రతిపాదనల ప్రకారం వరంగల్ జిల్లాలో 16 మండలాలు, హన్మకొండ జిల్లాలో 12 మండలాలు, ఆచార్య జయశంకర్ జిల్లాలో 16 మండలాలు, మహబూబాబాద్ జిల్లాలో 12 మండలాలు ఉంటున్నాయి. మూడు నుంచి నాలుగుకు ప్రభుత్వం జూన్ మొదటి వారంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియను మొదలుపెట్టింది. వరంగల్ జిల్లాలను వరంగల్, ఆచార్య జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా విభజిస్తున్నట్లు అప్పుడు ప్రతిపాదనలు రూపొందించింది. వరంగల్ జిల్లాలో 28 మండలాలు, ఆచార్య జయశంకర్ జిల్లాలో 15 మండలాలు, మహబూబాబాద్ జిల్లాలో 13 మండలాలు ఉండేలా ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. జనగామ జిల్లా చేయాలని కొనసాగుతున్న డిమాండ్‌ను పట్టించుకోలేదనే అభిప్రాయం ఆ ప్రాంత ప్రజల్లో నెలకొంది. ఆ తర్వాత జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం... అన్ని జిల్లాల ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. జనగామ జిల్లా చేయాలనే ప్రతిపాదనను పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, టి.రాజయ్య మంత్రివర్గ ఉపసంఘానికి సూచించారు. ముసాయిదా ప్రకటనలో జనగామ జిల్లా అంశం ఉంటుందని ఈ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆశించారు. ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా నిర్ణయం తీసుకున్నది. బుధవారం ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం... మన జిల్లాను నాలుగు జిల్లాలు విభజించేలా ప్రతిపాదనలను రూపొందించింది. జనగామ జిల్లా అంశాన్ని ప్రతిపాదనల్లో పేర్కొనలేదు. వరంగల్ జిల్లాలో కొత్తగా హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను తయారు చేసింది. మొదట రూపొందించిన ప్రతిపాదనల ప్రకారం... వరంగల్ జిల్లాలో 28 మండలాలు ఉండాలని పేర్కొంది. తాజాగా నాలుగు జిల్లాలుగా విభజించాలనే ప్రతిపాదన నేపథ్యంలో వరంగల్‌కు 16 మండలాలను, హన్మకొండకు 12 మండలాలను కేటాయిస్తూ జాబితా రూపొందించింది. ఏ ఒక్కరూ కోరని, ఎవరూ అడగని హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రస్తావన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జిల్లాలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సైతం హన్మకొండ జిల్లా ప్రతిపాదనపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉద్యోగ వర్గాలు, ప్రజల్లోనూ ఈ విషయంపై గందరగోళం నెలకొంది. తుది జాబితాలో హన్మకొండ జిల్లాకు చోటు ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. జనగామలో మార్పు లేదు... జనగామ జిల్లా ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని తాజా ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి. జనగామ నియోజకవర్గంలోని ఐదు మండలాల విషయంలోనూ కొత్తగా ఎలాంటి మార్పులూ చేయలేదు. మొదటి ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లుగానే ఈ సెగ్మెంట్లోని ఐదు మండలాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల్లో కలుపుతున్నారు. జనగామ, బచ్చన్నపేట మండలాలను యాదాద్రి(భువనగిరి) జిల్లాలో... చేర్యాల, మద్దూరు మండలాలను సిద్ధిపేట జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు ఉన్నాయి. దేవరుప్పులు, లింగాలగణపురం మండలాలను సైతం యాదాద్రి జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు తయారు చేశారు. జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం రెండుమూడు రోజుల్లో వెల్లడించే ముసాయిదా నోటిఫికేషన్‌తో ప్రస్తుత గందరగోళానికి తెరపడే అవకాశం ఉంది. జిల్లాల వారీగా మండలాలు ఇలా... వరంగల్ జిల్లా : వరంగల్, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు, పరకాల, నర్సంపేట, నల్లబెల్లి, చెన్నారావుపేట, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ, పాలకుర్తి, రాయపర్తి, శాయంపేట. హన్మకొండ జిల్లా : హన్మకొండ, హసన్‌పర్తి, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, రఘునాథపల్లి, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హూజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్. ఆచార్య జయశంకర్ జిల్లా : భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, గణపురం, వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కొత్తగూడ, కాటారం, మహదేవపూర్, మల్హర్రావు, మహాముత్తారం. మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, కురవి, మరిపెడ, నర్సింహులపేట, తొర్రూరు, కొడకండ్ల, గార్ల, బయ్యారం. యాదాద్రి జిల్లా : జనగామ, బచ్చన్నపేట, లింగాలఘణపురం, దేవరుప్పుల సిద్ధిపేట జిల్లా : చేర్యాల, మద్దూరు. ప్రతిపాదిత జిల్లాల వారీగా గణాంకాలు... జిల్లా పేరు మండలాలు జనాభా విస్తీర్ణం(చదరపు కిలో మీటర్లు) వరంగల్ 16 11,26,096 2638.50 హన్మకొండ 12 11,52,579 2481.06 ఆచార్య జయశంకర్ 16 6,95,145 6032.65 మహబూబాబాద్ 12 7,54,845 3463.89