సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా ఏర్పడి రెండు వారాలు కావస్తున్నా.. ఇటు అధికారులు, అటు ప్రజలను మార్గదర్శనం చేసే భౌగోళిక వివరాలతో కూడిన జిల్లా వెబ్‌సైట్ ఇంకా పూర్తిస్థాయిలో అప్‌డేట్ కాలేదు. పూర్వ వరంగల్ అర్బన్ జిల్లా నుంచి కలిసిన వరంగల్, ఖిలావరంగల్ కలుపుకొని మిగిలిన 11 మండలాలతో వరంగల్ జిల్లా చిత్రపటం(మ్యాప్) మాత్రమే వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అసలు విషయం ఏమిటంటే.. వరంగల్‌రూరల్.తెలంగాణ.జీవోవీ.ఇన్‌తోనే వెబ్‌సైట్ ప్రజలకు అందుబాటులో ఉంది. అయితే ఈ సైట్ క్లిక్ చేయగానే తొలుత హోంపేజీలో వరంగల్ జిల్లా అని కనిపిస్తోంది.
చదవండి: సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పునర్విభజన?
మిగతా రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల లెక్క చూసుకుంటే వరంగల్ రూరల్ జిల్లా లెక్కల ప్రకారం మూడు రెవెన్యూ డివిజన్‌లు, మూడు మున్సిపాలిటీలు, 16 మండలాలు, 401 గ్రామాలుగానే ఉంది. హనుమకొండ జిల్లాలో కలిసిన ఆత్మకూరు, దామెర, పరకాల, నడికూడ, శాయంపేట మండలాలు కూడా వరంగల్ రూరల్ కిందనే ఉన్నట్టుగా సైట్‌లో కనిపిస్తోంది. ఆధునిక సాంకేతికత అందిపుచ్చుకుంటున్న నేటి సమాజంలో వీటిని అప్‌డేట్ చేయాల్సిన జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంపై జనాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ప్రజలతో పాటు ఈ ప్రాంతాలకు వివిధ పనుల కోసం వచ్చేవారికి జిల్లా అధికారుల పాత సమాచారమే ఉండడంతో కొంత గందరగోళం నెలకొంది. వెంటనే వెబ్‌సైట్ అప్‌డేట్ చేయాల్సిన అవసరముందనే అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
చదవండి: చివరి రక్తపు బొట్టు దాకా దళితుల కోసం పోరాడతా: సీఎం కేసీఆర్
గాడిన పడని ప్రభుత్వ విభాగాలు
జిల్లా స్వరూపం మారడంతో అందుకు సంబంధించిన వివరాలతో హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు జిల్లా ఎౖMð్స జ్ శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే వరంగల్ జిల్లాలో చేరిన వరంగల్, ఖిలావరంగల్ మండలాలతో కలుపుకొని 13 మండలాల వైన్‌షాప్‌లు, బార్‌లు.. తదితరాల పనులు పర్యవేక్షించనున్నారు. ప్రస్తుతం పూర్వ వరంగల్ రూరల్ జిల్లాలోని మండలాల వారిగానే ఎక్సైజ్ కార్యకలాపాలు సాగుతున్నాయని సంబంధిత విభాగాధికారి తెలిపారు. అలాగే ఆరోగ్య విభాగానికొస్తే పూర్వ వరంగల్ రూరల్ నుంచి నాలుగు పీహెచ్‌సీలు, ఓ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హనుమకొండ జిల్లాకు వెళ్తుండగా.. హనుమకొండ జిల్లా నుంచి ఒక పీహెచ్‌సీ, నాలుగు సబ్‌సెంటర్లు, ఏడు అర్బన్ హెల్త్ సెంటర్లు, ఎంజీఎం, ఆయుర్వేదిక ఆసుపత్రి.. తదితరాలు వరంగల్ జిల్లాలోకి వచ్చాయి.
అయితే జిల్లాస్థాయిలో అధికారులు వీటిని విభజించుకున్నా.. ఎలా రిపోర్టింగ్ చేయాలన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఆయా జిల్లాల సమగ్ర సమాచారంతో కూడిన లేఖను హైదరాబాద్‌లోని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌కు ఇరు జిల్లాల ఆరోగ్యవైద్యాధికారులు పంపారు. అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ రా గానే.. రోజువారి వివరాలను కొత్త జిల్లాల వారిగా పంపించనున్నారు. ప్రస్తుతం సమన్వయంతో కలిసి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఆ విభాగ వర్గాలు తెలిపాయి. అలాగే భూ గర్భజల గనుల శాఖ, మత్స్య విభాగం, పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖలు కూడా త్వరలోనే కొత్త జిల్లాల వారీగా కార్యకలాపాలు సాగించేందుకు అధికారికంగా ఉన్నతాధికారుల నుంచి అనుమతులు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి.
కొత్త జిల్లా ప్రకారమే..
ఇక రెవెన్యూ విషయానికొస్తే వరంగల్ జిల్లాలో చేరిన వరంగల్, ఖిలావరంగల్‌తో సహా 13 మండలాలవారీగా భూమి, ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, భూ వివాదాలకు సంబంధించిన సమస్యలు సంబంధిత అధికారులు చూసుకుంటున్నారు. జిల్లా విద్యావిభాగాధికారులు కొత్తగా ఏర్పడిన వరంగల్ జిల్లా ప్రకారమే ప్రభుత్వ పాఠశాలలు పర్యవేక్షిస్తున్నారు. ఇక వర్షపాతం వివరాలు కూడా వరంగల్ జిల్లా ప్రకారమే అధికారులు లెక్కలు చేస్తున్నారు. అయితే కొత్త జిల్లా ప్రకారం అన్ని ప్రభుత్వ విభాగాలు పూర్తిస్థాయిలో పనిచేయాల్సిన అవసరముందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఏది ఎటో..స్పష్టత ఏదీ?
కాకతీయ మెడికల్ కాలేజీ 130.30 ఎకరాల్లో విస్తరించి ఉంటే ఇందులో వరంగల్ జిల్లాలో 55 ఎకరాలు, హనుమకొండ జిల్లాలో 75.30 ఎకరాలు ఉంది. సెంట్రల్ జైలు విషయానికొస్తే 56.39 ఎకరాల్లో ఉన్న జైలు 44.34 ఎకరాలు వరంగల్ జిల్లాలో, 12.15 ఎకరాలు హనుమకొండ జిల్లాలో ఉంది. 15.30 ఎకరాల్లో ఉన్న బాలుర, బాలికల పాలిటెక్నిక్ కాలేజీ వరంగల్ జిల్లాలో రెండు ఎకరాలు, హనుమకొండ జిల్లాలో 13.30 ఎకరాలు ఉంది. 530 ఎకరాల్లో ఉన్న భద్రకాళి బండ్ ప్రాంతం వరంగల్ జిల్లాలో 113 ఎకరాలు, హనుమకొండ జిల్లాలో 417 ఎకరాలు ఉంది. 5.17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వెటర్నరీ హాస్పిటల్ అండ్ కాలేజ్ వరంగల్ జిల్లాలో 3.17 ఎకరాలు, హనుమకొండలో రెండు ఎకరాల్లో ఉంది. వీటిని ఏ జిల్లాలో ఉంచాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరముందని అధికారులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment