జేసీబీల సహాయంతో బావి ఓడలను తొలగింపు.. పక్కన ఉన్న మట్టి తొలగింపు..
శాయంపేట: మంచినీటి బావి ఓడలు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటి స్థానంలో కొత్తవి పోసేందుకు ఓ యువకుడు మట్టిని తీస్తుండగా ఒక్కసారిగా కుంగిపోయి లోతుకు జారిపోయాడు. పోలీసులు నాలుగు గంటలపాటు శ్రమించి ఆ యువకుడిని క్షేమంగా బయటకు తీశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోతుగంటి వెంకటేష్ తన ఇంటి ముందు ఉన్న మంచినీటి బావి ఓడలను మార్చి కొత్తవి వేసేందుకు మట్టిని తొలగిస్తున్నాడు.
ఈ క్రమంలో ఒక్కసారిగా మట్టి కుంగిపోవడంతో సుమారు ఏడు ఓడల లోతు జారిపోయాడు. గమనించిన అతని భార్య పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే 100కు డయల్ చేయడంతో ఎస్‌ఐ అక్కినపల్లి ప్రవీణ్‌కుమార్ ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే రెండు జేసీబీలు తెప్పించి మట్టి, ఓడలను తొలగిస్తూ పోయారు. సుమారు నాలుగు గంటలపాటు శ్రమించి యువ కుడిని బయటకు తీశారు.
వెంకటేష్‌ను సురక్షితంగా బయటకు తీసుకొస్తున్న దృశ్యం
ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే వెంకటేష్‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. సర్పంచ్ రాజిరెడ్డి, ఉపసర్పంచ్ వలి హైదర్, ఎంపీటీసీ ఐలయ్యలతోపాటు పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment