ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిపై చిక్కుకున్న తొమ్మిది మందిని కాపాడిన జేసీబీ డ్రైవర్
సాయమందించిన వెంకటగిరివాసులు
సహాయక చర్యల్లో యంత్రాంగంమీనమేషాలతో రంగంలోకి...
ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మం ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిపై వరదలో చిక్కుకున్న తొమ్మిదిమందిని కాపాడేందుకు ‘పోతే ఒక్కడిని..వస్తే పది మందిమి అంటూ జేసీబీ డ్రైవర్ ఎస్‌కే.సుబాన్ ధైర్యం చేయగా, ‘జేసీబీ మధ్యలో ఆగిపోతే మనమైనా తీసుకొద్దామంటూ’వెంకటగిరికి చెందిన మొర్రిమేకల ఉపేందర్, మొర్రిమేకల జవహర్‌లాల్, కనపర్తి నాగేశ్వరరావులతోపాటు కొందరు గ్రామపెద్దలు ముందుకు రావడంతో దాదాపు 14 గంటల పాటు ఆపదలో చిక్కుకున్నవారు ప్రాణాలతో బయటపడ్డారు.
అసలేం జరిగిందంటే...
ఈ నెల 1న ఆదివారం మున్నేరు వాగుకు ఒక్కసారిగా వచ్చిన భారీ వరదతో ఖమ్మం ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిపై వోగబోయిన శ్రీనివాసరావు, ఆయన కుమారుడు విక్రమ్, కట్టెలమండె వాచ్‌మెన్ మోహన్–లక్ష్మి దంపతులు, వీరి ఇద్దరు కుమారులు, వర్కర్లు వినోద్, వెంకన్నతో పాటు మరొకరు చిక్కుకున్నారు.
షాపుల్లో ఉన్న వీరు వరద పరిస్థితిని గమనించి ఎటూ వెళ్లలేక ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిపైకి చేరుకున్నారు. ఉదయం నుంచి తమకు సాయం చేయాలని వీరితోపాటు కుటుంబీకులు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని వేడుకున్నా స్పందన కనిపించలేదు. హెలికాప్టర్ వస్తోందని.. ఎన్డీఆర్‌ఎఫ్ టీం వస్తుందంటూ రాత్రి 10 గంటల వరకు తాత్సారం చేశారు.
యంత్రాంగం జాప్యంతో...
యంత్రాంగం చెబుతున్న మాటలతో విసుగెత్తిన వెంకటగిరివాసులు తొమ్మిది మంది ప్రాణాలను ఎలాగైనా రక్షించాలని నిర్ణయించుకున్నారు. అక్కడే ఉన్న జేసీబీ యజమాని వెంకటరమణ దృష్టికి తీసుకెళ్లగా డ్రైవర్ సరేనంటే వాహనం ఇచ్చేందుకు సిద్ధమేనని చెప్పాడు. డ్రైవర్ ఎస్.కే.సుబాన్(హరియాణావాసి)తో మాట్లాడారు. కాలు కాస్త ఇబ్బందిగా ఉండే ఆయన్ను బండి తీసుకొని వరదలోకి వెళ్లే ధైర్యం ఉందా అని అడగగా.. ‘ప్రాణాలను కాపాడేందుకే కదా వెళ్తా.. వస్తే అందరం వస్తాం.. లేకపోతే ఒక్కడిని పోతా’అని ముందుకొచ్చాడు.
అయితే రాత్రి 8 గంటల నుంచి రెండుసార్లు ప్రయతి్నంచగా.. మధ్యలో రోడ్డు కోతకు గురికావడంతో బండి ముందుకు కదల్లేదు. దీంతో మొర్రిమేకల ఉపేందర్, మొర్రిమేకల జవహర్‌లాల్, కనపర్తి నాగేశ్వరరావు తాము తాళ్ల సాయంతో బ్రిడ్జిపైకి వెళతామని చెప్పగా..11 గంటల సమయాన వారు రోడ్డు కోతకు గురైన ప్రాంతం వరకు జేసీబీపై వెళ్లి అక్కడ నుంచి జేసీబీ బకెట్ మీదుగా బ్రిడ్జివైపు దిగారు.
అనంతరం బ్రిడ్జిపై చిక్కుకున్న తొమ్మిది మందిని అదే జేసీబీ బకెట్‌లోకి ఎక్కించి సురక్షితంగా ఇవతలికి తీసుకొచ్చారు. తొమ్మిది మందిని సురక్షితంగా తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన జేసీబీ యజమాని, స్థానికులతోపాటు డ్రైవర్ సుబాన్ సేవలను కొనియాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ప్రాణాలను కాపాడాలని..
వరదలోకి వెళ్లేందుకు ధైర్యం ఉందా అని అడిగారు. నేను పోతే ఒక్కడినే.. వస్తే పది మంది అని సాహసించి ముందుకు వెళ్లాను. ఇంజిన్ పైకి నీళ్లు వచ్చాయి. మొదట రెండుసార్లు ప్రయతి్నంచి విఫలమయ్యాను. మూడోసారి స్థానికుల సహకారంతో తొమ్మిది మందిని రక్షించగలిగాం. – ఎస్.కే.సుబాన్, జేసీబీ డ్రైవర్
డ్రైవర్‌తో పాటే మేం కూడా..
హెలికాఫ్టర్‌తో కాపాడుతారని అంటుంటే చూద్దామని వచ్చాం. ప్ర భుత్వ సాయం ఎంతకూ అందకపోవడంతో వారిని రక్షించేందుకు మేము ముందుకొచ్చాం. జేసీబీ డ్రైవర్‌తో పాటు మేము తాళ్లను తీసుకొని వరదను దాటి వెళ్లి తొమ్మిది మందిని ఒడ్డుకు చేర్చాం. – మొర్రిమేకల ఉపేందర్, వెంకటగిరివాసి
బండికి నష్టం జరిగినా సరే అన్నా..
జేసీబీ పోయినా ప ర్వాలేదు.. ప్రాణాలు కాపాడొచ్చనుకుని బండి పంపించా. పోలీసులు ఒప్పుకోకుంటే మాదే బాధ్యత అని ఒప్పందం చేసుకొని బండి ని పంపా. జేసీబీ ఇంజిన్‌లోకి నీళ్లు పోవడంతో మరమ్మతుకు రూ.85 వేలు ఖర్చు అవుతుంది. అయినా ప్రాణాలు కాపాడామనే తృప్తి కలిగింది. – వెంకటరమణ, జేసీబీ యజమాని
Comments
Please login to add a commentAdd a comment