-
12 మండలాలతో హన్మకొండ జిల్లా
-
చారిత్రక నగరం రెండుగా విభజన
-
అన్ని వర్గాల్లో అయోమయం
-
డ్రాఫ్టు నోటిఫికేషన్‌పై ఉత్కంఠ
సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనపై స్పష్టత వచ్చినట్లే వచ్చి మరింత గందరగోళంలో పడింది. జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని కొన్ని నెలలుగా వస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోగా.. ఎవరూ డిమాండ్ చేయకుండానే హన్మకొండ జిల్లా ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ముసాయిదా నోటిఫికేషన్ రూపకల్పన దాదాపు పూర్తయింది.
వరంగల్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించారు. వరంగల్, హన్మకొండ, ఆచార్య జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా విభజించేలా ముసాయిదా రూపొందించారు. జనాభా ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. జనాభాను ఆధారంగా చేసుకుని కొత్తగా హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేసే ప్రతిపాదనను రూపొందించారు. తాజా ప్రతిపాదనల ప్రకారం వరంగల్ జిల్లాలో 16 మండలాలు, హన్మకొండ జిల్లాలో 12 మండలాలు, ఆచార్య జయశంకర్ జిల్లాలో 16 మండలాలు, మహబూబాబాద్ జిల్లాలో 12 మండలాలు ఉంటున్నాయి.
మూడు నుంచి నాలుగుకు
ప్రభుత్వం జూన్ మొదటి వారంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియను మొదలుపెట్టింది. వరంగల్ జిల్లాలను వరంగల్, ఆచార్య జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాలుగా విభజిస్తున్నట్లు అప్పుడు ప్రతిపాదనలు రూపొందించింది. వరంగల్ జిల్లాలో 28 మండలాలు, ఆచార్య జయశంకర్ జిల్లాలో 15 మండలాలు, మహబూబాబాద్ జిల్లాలో 13 మండలాలు ఉండేలా ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. జనగామ జిల్లా చేయాలని కొనసాగుతున్న డిమాండ్‌ను పట్టించుకోలేదనే అభిప్రాయం ఆ ప్రాంత ప్రజల్లో నెలకొంది. ఆ తర్వాత జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం... అన్ని జిల్లాల ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించింది.
జనగామ జిల్లా చేయాలనే ప్రతిపాదనను పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, టి.రాజయ్య మంత్రివర్గ ఉపసంఘానికి సూచించారు.
ముసాయిదా ప్రకటనలో జనగామ జిల్లా అంశం ఉంటుందని ఈ ప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆశించారు. ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా నిర్ణయం తీసుకున్నది. బుధవారం ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం... మన జిల్లాను నాలుగు జిల్లాలు విభజించేలా ప్రతిపాదనలను రూపొందించింది. జనగామ జిల్లా అంశాన్ని ప్రతిపాదనల్లో పేర్కొనలేదు. వరంగల్ జిల్లాలో కొత్తగా హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను తయారు చేసింది. మొదట రూపొందించిన ప్రతిపాదనల ప్రకారం... వరంగల్ జిల్లాలో 28 మండలాలు ఉండాలని పేర్కొంది. తాజాగా నాలుగు జిల్లాలుగా విభజించాలనే ప్రతిపాదన నేపథ్యంలో వరంగల్‌కు 16 మండలాలను, హన్మకొండకు 12 మండలాలను కేటాయిస్తూ జాబితా రూపొందించింది. ఏ ఒక్కరూ కోరని, ఎవరూ అడగని హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రస్తావన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జిల్లాలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సైతం హన్మకొండ జిల్లా ప్రతిపాదనపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉద్యోగ వర్గాలు, ప్రజల్లోనూ ఈ విషయంపై గందరగోళం నెలకొంది. తుది జాబితాలో హన్మకొండ జిల్లాకు చోటు ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
జనగామలో మార్పు లేదు...
జనగామ జిల్లా ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని తాజా ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి. జనగామ నియోజకవర్గంలోని ఐదు మండలాల విషయంలోనూ కొత్తగా ఎలాంటి మార్పులూ చేయలేదు. మొదటి ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లుగానే ఈ సెగ్మెంట్‌లోని ఐదు మండలాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల్లో కలుపుతున్నారు. జనగామ, బచ్చన్నపేట మండలాలను యాదాద్రి(భువనగిరి) జిల్లాలో... చేర్యాల, మద్దూరు మండలాలను సిద్ధిపేట జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు ఉన్నాయి. దేవరుప్పులు, లింగాలగణపురం మండలాలను సైతం యాదాద్రి జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు తయారు చేశారు. జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం రెండుమూడు రోజుల్లో వెల్లడించే ముసాయిదా నోటిఫికేషన్‌తో ప్రస్తుత గందరగోళానికి తెరపడే అవకాశం ఉంది.
జిల్లాల వారీగా మండలాలు ఇలా...
వరంగల్ జిల్లా : వరంగల్, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు, పరకాల, నర్సంపేట, నల్లబెల్లి, చెన్నారావుపేట, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ, పాలకుర్తి, రాయపర్తి, శాయంపేట.
హన్మకొండ జిల్లా : హన్మకొండ, హసన్‌పర్తి, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, రఘునాథపల్లి, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హూజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్.
ఆచార్య జయశంకర్ జిల్లా : భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, గణపురం, వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కొత్తగూడ, కాటారం, మహదేవపూర్, మల్హర్‌రావు, మహాముత్తారం.
మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, కురవి, మరిపెడ, నర్సింహులపేట, తొర్రూరు, కొడకండ్ల, గార్ల, బయ్యారం.
యాదాద్రి జిల్లా : జనగామ, బచ్చన్నపేట, లింగాలఘణపురం, దేవరుప్పుల
సిద్ధిపేట జిల్లా : చేర్యాల, మద్దూరు.
ప్రతిపాదిత జిల్లాల వారీగా గణాంకాలు...
జిల్లా పేరు మండలాలు జనాభా విస్తీర్ణం(చదరపు కిలో మీటర్లు)
వరంగల్ 16 11,26,096 2638.50
హన్మకొండ 12 11,52,579 2481.06
ఆచార్య జయశంకర్ 16 6,95,145 6032.65
మహబూబాబాద్ 12 7,54,845 3463.89