-
పరిపాలన సౌలభ్యం కోసమే హన్మకొండ
-
ప్రజల అభీష్టం మేరకే కొత్త జిల్లాలు
-
మన జిల్లా విభజనపై సీఎం కేసీఆర్
-
నేడు మండలాలపై స్పష్టత
సాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్ నగరాన్ని రెండు జిల్లాలుగా విభజించే విషయంలో నెలకొన్న అయోమయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన ప్రక్రియ చేపడుతున్నామని, ప్రజల అభీష్టం మేరకే తుది నిర్ణయం ఉంటుందని చెప్పారు. జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఎక్కువ అంశాలపై వరంగల్ జిల్లా పునర్విభజన ప్రతిపాదనలనే ఉదహరించారు.
‘పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేపట్టాం. సగటున 16 మండలాలు ఉండాలని ప్రతిపాదించాం. వరంగల్ జిల్లాలో పునర్విభజనపై కొంత గందరగోళం ఉందని తెలిసింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న భూపాలపల్లి జిల్లా... ప్రస్తుతం ఉన్న నిజామాబాద్ జిల్లాతో సమానంగా ఉంది. భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోని మండలాలను మినహాయిస్తే 32 వరకు మండలాలు ఉంటున్నాయి. ఇన్ని మండలాలతో ఒక జిల్లా అంటే మళ్లీ పరిపాలన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అన్నీ పరిశీలించాకే వరంగల్, హన్మకొండ జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు.
వరంగల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతవాసులు నగరంతోనే అనుసంధానమవుతారు. అందుకే వరంగల్ కేంద్రంగా రెండు జిల్లాలను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. దీనివల్ల వరంగల్ నగరం ఉనికికి, అభివృద్ధికి ఏ ఇబ్బందీ ఉండదు. గ్రేటర వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థలు... వరంగల్ నగర అభివృద్ధి, సేవల కల్పనను పర్యవేక్షిస్తాయి. పరిపాలన పరంగా రెండు జిల్లాలు ఉంటాయి. ఇవన్నీ ప్రజలు అంగీకరిస్తేనే. హన్మకొండ జిల్లా ఏర్పాటుపై పట్టింపులేదు. ప్రజలు వద్దంటే ఒకే జిల్లాగా ఉంటుంది. జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో ప్రజలు తమ ప్రతిపాదనలు ఇవ్వవచ్చు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వాఖ్యల నేపథ్యంలో ప్రజల అభిప్రాయం మేరకు హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రక్రియ ఉండనుంది.
హన్మకొండపై భిన్నాభిప్రాయాలు
వరంగల్ జిల్లాలను నాలుగు జిల్లాలుగా విభజించాలనే ప్రతిపాదనపై రాజకీయ నేతలు, ఉద్యోగులు, ప్రజల్లో గందరగోళం ఉంది. అని రాజకీయ పార్టీల్లోనూ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హన్మకొండ జిల్లా ఏర్పాటు అవసరం లేదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శుక్రవారం పరకాలలో అభిప్రాయపడ్డారు. జిల్లాల పునర్విభజనలో మెుదటి ప్రతిపాదించిన వరంగల్ జిల్లా నుంచి హన్మకొండ జిల్లాగా విభజించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ప్రకటించాయి. జిల్లా కేంద్రాన్ని రెండు జిల్లాలుగా విభజించడం సరికాదని పేర్కొన్నాయి.
22న ముసాయిదా విడుదల
జిల్లాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరింది. వరంగల్ జిల్లాను... వరంగల్, హన్మకొండ, ఆచార్య జయశంకర్, మహబూబాబాద్ జిల్లాలుగా విభజించేలా ప్రతిపాదనలు ఖరారయ్యాయి. వరంగల్, హన్మకొండ జిల్లాలో 14 చొప్పున మండలాలు, ఆచార్య జయశంకర్ జిల్లాలో 16 మండలాలు, మహబూబాబాద్ జిల్లాలో 12 మండాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదాను సిద్ధం చేసింది. కొత్తగా హన్మకొండ, భూపాలపల్లి, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్లతో పాటు కొత్త మండలాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ముసాయిదాను విడుదల చేయనుంది. అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు గడువు విధించనుంది. ఈ ప్రక్రియ తర్వాత తుది మార్పులు చేసి అక్టోబరు 11(దసరా) నుంచి కొత్త జిల్లాల నుంచి పరిపాలన మొదలుకానుంది.
మండలాలపై నేడు స్పష్టత
జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై ముసాయిదా సిద్ధమైన నేపథ్యంలో కొత్తగా ఎన్ని మండలాలు ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొత్తగా ఎనిమిది మండలాలు ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి గతంలో ప్రతిపాదనలు పంపింది. ఖిలా వరంగల్(వరంగల్), కాజీపేట(హన్మకొండ), ఐనవోలు(వర్ధన్నపేట), వేలేరు(ధర్మసాగర్), చిల్పూరు(స్టేషన్‌ఘన్‌పూర్), టేకుమట్ల(చిట్యాల), ఇనుగుర్తి(కేసమద్రం), చిన్నగూడురు(మరిపెడ) మండలాలను కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. మండలాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం కొత్తగా మార్గదర్శకాలు రూపొందించింది.
పట్టణ ప్రాంతాల్లో 1.50 లక్షల జనాభా, గ్రామీణ ప్రాంతాల్లో 35 వేల జనాభా ఉండాలని స్పష్టం చేసింది. తాజా మార్గదర్శకాలతో ఈ ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం మళ్లీ ప్రతిపాదనలు తయారు చేసి ఆదివారం ఉదయం 11 గంటల వరకు పంపించాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) రేమండ్ పీటర్, జిల్లా కలెక్టర్ వాకాటి కరుణను ఆదేశించారు. కలెక్టర్ వాకాటి కరుణ జిల్లాలోని ఆర్డీవోలతో సమాచారం సేకరించి దీనిపై నివేదిక రూపొందించే పనిలో నిమగ్నయ్యారు.