స్వార్థ ప్రయోజనాల కోసమే విభజన
-
మార్పునకు కేంద్రం కాకుండా కుట్ర
-
జిల్లా బంద్‌కు సంపూర్ణ మద్దతు
-
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
వరంగల్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వ మార్పునకు భవిష్యత్‌లో గ్రేటర్ వరంగల్ కేంద్రంగా ఉంటుందన్న భయంతోనే రెండు జిల్లాలుగా విభజించే కుట్ర జరుగుతోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. హన్మకొండలోని హరిత కాకతీయలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా కాకుండా స్వార్థపూరిత ప్రయోజనాల కోసం జరుగుతున్నాయన్నారు. ఓరుగల్లు చరిత్రను తుంగలోకి తొక్కేందుకు కుట్ర జరుగుతోందన్నారు. హన్మకొండ జిల్లా ఏర్పాటుతో చరిత్ర విచ్ఛిన్నం అవుతుందన్న వేదన అందరిలో ఉందన్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ప్రజలు కూడా వరంగల్‌ను విడదీయెుద్దన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పరిపాలన సౌలభ్యం అంటే కోటి జనాభా ఉన్న హైదరాబాద్, సికిందరాబాద్, సైబరాబాద్‌లను ఎందుకు విడదీయడం లేదన్నారు. సీఎం సొంత జిల్లా మెదక్‌లో ఒక్కో జిల్లా కేంద్రానికి మధ్య 55 నుంచి 75 కిలోమీటర్లు ఉన్నదని, కానీ ఎనిమిది కిలోమీటర్ల దూరం లేని హన్మకొండ, వరంగల్‌ను ఎలా విడదీస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్ తర్వాత ఎక్కువ పెట్టుబడులు వచ్చేందుకు వరంగల్ జిల్లా అనుకూలంగా ఉందని, దాన్ని అడ్డుకునేందుకే ఈ విభజన అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందన్నారు. జిల్లా పరిరక్షణ కమిటీ నేతృత్వంలో మంగళవారం జరిగే బంద్‌కు ఎమ్మార్పీఎస్ పూర్తిగా మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రతి కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంఎస్‌పీ జాతీయ ప్రతినిధి ప్రదీప్, ఎమ్మార్పీఎస్ నాయకులు మంద కుమార్, మల్లేష్, వినోద పాల్గొన్నారు.