హన్మకొండ జిల్లా ఏర్పాటు అప్రజాస్వామికం | Hanmakonda district formation is undemocratic | Sakshi
Sakshi News home page

హన్మకొండ జిల్లా ఏర్పాటు అప్రజాస్వామికం

Published Fri, Aug 26 2016 12:47 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నాయకుడు ప్రకాష్‌రెడ్డి

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నాయకుడు ప్రకాష్‌రెడ్డి

  • రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలు పార్టీలు, సంఘాల నేతలు
  • వరంగల్‌ జిల్లా పరిరక్షణ కమిటీ ఏర్పాటు
  • ఈ నెల 30న బంద్‌కు పిలుపు
  • వరంగల్‌ లీగల్‌ : చారిత్రక నేపథ్యం ఉన్న వరంగల్‌ జిల్లాను విడదీసి హన్మకొండ జిల్లా ఏర్పాటుచేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై పలువురు మండిపడ్డారు. జిల్లా కోర్టు ఆవరణలోని బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా ఏర్పాటుకు వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. సమావేశంలో పలువురు మాట్లాడుతూ రాత్రికి రాత్రి హన్మకొండ జిల్లా ఏర్పాటు నిర్ణయం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. జిల్లాల విభజన–నూతన జిల్లాల ఏర్పాటు కోసం ముందుగా ఎలాంటి నిబంధనలు పొందుపర్చని కారణంగా శాస్త్రీయత లోపించిందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వక్తలు వెల్లడించిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
     
    స్వరం పెంచి ఉద్యమించాలి..
    జిల్లాలోని రామప్ప, వేయి స్తంభాల గుడి, ఓరుగల్లు కోటను మూడు ముక్కలుగా విభజిస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి విమర్శించారు. జనగామ ప్రజలు పలురకాలుగా తమ ఆకాంక్షను వ్యక్తం చేసి చివరకు ఆమరణ దీక్షకు పూనుకున్న స్పందన లేదన్నారు. హన్మకొండ జిల్లా ఏర్పాటును వ్యతిరేకిస్తూ అఖిలపక్షం సమిష్టిగా స్వరం పెంచి లక్ష్యం సాధించేవరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ ఎవరు అడిగారని హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేస్తున్నారో సీఎం కేసీఆర్‌ జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ  వరంగల్‌ జిల్లా విభజనలో శాస్త్రీయత లేదని పేర్కొన్నారు. దీనికి జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, అధికార పార్టీ ప్రతినిధులు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు.
     
    బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ అకస్మాత్తుగా రాత్రికి రాత్రి హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ను విడగొట్టకుండా800 ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయ సామ్రాజ్య రాజధాని ఓరుగల్లును విడగొట్టడంలో మర్మమేమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీపీఐం ఎంఎల్‌(న్యూడెమోక్రసీ) జిల్లా నాయకుడు నున్నా అప్పారావు మాట్లాడుతూ ఆదివాసీల డిమాండ్‌ అయిన సమ్మక్క–సారలమ్మ జిల్లా ఏర్పాటును మరిచి ఆదివాసీ మండలాలను విభజిస్తూ అణిచివేసే కుట్రలు సాగిస్తున్నారని విమర్శించారు. టీడీపీ జాతీయ కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ మహానగర విభజనను ప్రధాన సమస్యగా భావించి అందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
     
    ప్రొఫెసర్‌ వెంకటనారాయణ మాట్లాడుతూ హన్మకొండ ఏర్పాటును అందరూ వ్యతిరేకిస్తున్నా టీఆర్‌ఎస్‌ నేతలు మౌనంగా భరిస్తున్నారన్నారు. టీజీఓస్‌ జిల్లా అధ్యక్షుడు అన్నమనేని జగన్మోహన్‌రావు మాట్లాడుతూ చారిత్రక నగరాన్ని విడదీయడం ఎవ్వరు జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. మూడు జిల్లాలకే ఉన్న ఉద్యోగుల సర్దుబాటు సాధ్యం కాలేని పరిస్థితిలో నాలుగవ జిల్లాగా హన్మకొండ ఏర్పాటును ఉద్యగులందరూ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఫోరం ఫర్‌ బెటర్‌ వరంగల్‌ అధ్యక్షుడు పుల్లూరి సుధాకర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అవసరాలను తీర్చే రెండవ నగరం వరంగల్‌ను విభజించవద్దని అన్నారు.
     
    బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బైరపాక జయాకర్‌ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు ముద్దసాని సహోదర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో బీజేపీ నాయకులు డాక్టర్‌ విజయలక్ష్మి, రావు పద్మ, మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ డిప్యూటీ మేయర్‌ అశోక్‌రావు, కె.గోపాల్‌రెడ్డి, బుచ్చిబాబు, కే.వీ.నర్సింహరావు, డాక్టర్‌ సిరికొండ సంజీవరావు, రావు అమరేందర్‌రెడ్డి, అమరేందర్, జన్ను పరంజ్యోతి, ఆకుల వేణుగోపాల్‌రావు, చిల్లా రాజేంద్రప్రసాద్, బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి టీ.వీ.రమణతో పాటు అల్లం నాగరాజు, మానేపల్లి కవిత, లావుడ్యా సిద్ధూనాయక్, బొమ్మ నాగరాజు, సత్యనారాయణ పాల్గొన్నారు. 
     
    కమిటీ ఏర్పాటు.. బంద్‌కు నిర్ణయం
    వరంగల్‌ జిల్లా పరిరక్షణ కోసం భవిష్యత్‌ ఉద్యమాలు చేసేలా పరిరక్షణ కమిటీని ఈ సమావేశంలో ఏర్పాటుచేసుకున్నారు. కమిటీకి కన్వీనర్‌ బైరపాక జయాకర్, అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, సంఘాల ప్రతినిధులను పరిరక్షణ కమిటీలో సభ్యులుగా ఎన్నుకున్నారు. అంతేకాకుండా హన్మకొండ జిల్లా ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 30న బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌ విజయవంతానికి అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement