అప్పీళ్ల దాఖలుకు నేడు ఆఖరు
అప్పీళ్ల దాఖలుకు నేడు ఆఖరు
Published Tue, Sep 20 2016 9:32 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
► పునర్విభజన ముసాయిదాపై భారీగా అప్పీళ్లు
► అత్యధికంగా వరంగల్ జిల్లాపై 9500
► 17వేల అభ్యంతరాల పరిశీలన పూర్తి
హన్మకొండ అర్బన్: జిల్లాల పునర్విభజన ముసాయిదాపై అభ్యంతరాల (అప్పీళ్లు) దాఖలుకు గడువు మంగళవారం(20వ తేదీ)తో ముగియనుంది. వరంగల్ జిల్లాలో వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెల 22న ముసాయిదా ప్రకటన విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు ఉన్నట్లయితే 30రోజుల్లోగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో గానీ, ఆన్‌లైన్ ద్వారా గానీ తమ అభ్యంతరాలను అందజేయాలని కోరింది. జిల్లా నుంచి మొదటి రోజు నుంచే ఆన్‌లైన్ దరఖాస్తులు వెల్లువెత్తాయి. సోమవారం రాత్రి వరకు మొత్తం 21వేల దరఖాస్తులు అందాయి. వీటిలో ఆన్‌లైన్ ద్వారా అందిన దరఖాస్తులు 14,800 కాగా.. కలెక్టరేట్ సెల్‌లో అందజేసినవి సుమారు 7వేల వరకు ఉన్నాయి. చివరి రోజు కావడంతో మంగళవారం మరికొన్ని దరఖాస్తులు అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
వెంట వెంటనే పరిశీలన
జిల్లాకు సంబంధించి అందిన మొత్తం అప్పీళ్లను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. ప్రతిరోజూ వెబ్‌సైట్ ద్వారా వచ్చిన దరఖాస్తులు ప్రాథమికంగా పరిశీలన చేసి అవసరం మేరకు జిల్లా కలెక్టర్ ముందు ఉంచి కలెక్టర్ సంతకంతో వాటిని ప్రాధాన్యతా క్రమంలో మళ్లీ అప్‌లోడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు అందిన సుమారు 21వేల దరఖాస్తుల్లో సుమారు 17వేల దరఖాస్తులకు పైగా అధికారులు పరిశీలన పూర్తి చేసి అప్‌లోడ్ చేశారు.
నాలుగు కేటగిరీలుగా...
జిల్లాల విభజనపై అందిన అప్పీళ్లు మొత్తం నాలుగు కేటగిరీలుగా అధికారులు విభజిస్తున్నారు. 1.పరిశీలనకు అర్హతలేనివి, 2.ఇతర జిల్లాలకు పంపించాల్సినవి, 3. ప్రభుత్వ పరిశీలనకు పంపాల్సినవి, 4. పరిశీలనకు స్వీకరించాల్సినవి. ఈ విధంగా ప్రస్తుతం దరఖాస్తులు పరిశీలించారు. అయితే వాటిలో సుమారు వెయ్యికి పైగా దరఖాస్తులు అధికారులు వివిధ కారణాలతో జిల్లా స్థాయిలోనే తిరస్కరించారు. ఉదాహరణకు... వ్యక్తుల తమ ఫొటోలతో అప్‌లోడ్ చేసినవి, సంబంధం లేని విషయాలు ప్రస్తావించినవి, ఆడియో క్లిప్పింగ్‌లు, వీడియో క్లిప్పింగ్‌లు అప్‌లోడ్ చేసినవి ... ఈ విధమైన అభ్యంతరాలను జిల్లా స్థాయిలో తరస్కరిస్తున్నారు.
ప్రస్తుతం నాల్గవ స్థానంలో..
రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో అత్యధిక అప్పీళ్లు వచ్చిన వాటిలో జిల్లా ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో కరీంనగర్, 2వ స్థానంలో నల్లగొండ, 3వ స్థానంలో మహబూబ్‌నగర్, 4వ స్థానంలో వరంగల్ జిల్లాలు ఉన్నాయి. వరంగల్ జిల్లాపై 9500, హన్మకొండపై 3091, జయశంకర్ జిల్లాపై 1236, మహబూబాబాద్‌పై 939 అప్పీళ్లు ఆన్‌లైన్ ద్వారా అందాయి.
Advertisement