సాక్షి, ముంబై: ఉద్దేశపూర‍్వక రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యాకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. లండన్ హౌస్ తనఖా పెట్టి తీసుకున్నరుణాలను యూబీఎస్‌కు తిరిగి చెల్లించాలంటూ బుధవారం యూకే కోర్టు మాల్యా షాక్ ఇచ్చింది. మరోవైపు ఫ్యుజిటివ్ ఆర్థిక నేరస్థుల చట్టం కింద చర్యలపై బోంబే హైకోర్టులో చుక్కెదురైంది. ఫ్యుజిటివ్ ఆర్ధిక నేరస్థుల చట్టం 2018 కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక‍్టరేట్ విచారణను నిలిపివేయాలని కోరుతూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు గురువారం తోసి పుచ్చింది.
కోట్ల రూపాయలను స్వదేశీ బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లకు చెక్ పెట్టాలనే లక్ష్యంగా బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన చట్టమే ఫ్యుజిటివ్ ఆర్థిక నేరగాళ్ళ చట్టం -2018. ఈ చట్టం ప్రకారం విజయ్ మాల్యాను పరారైన ఆర్థిక నేరగాడిగా ప్రకటించాలని, ఆయన ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతించాలని ఈడీ ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. దీన్ని నిలిపివేయాలంటూ మాల్యా పెట్టుకున్న పిటిషన్ తాజాగా కోర్టు తిరస్కరించింది.
బంగారు టాయిలెట్ పాయే?
స్విస్‌బ్యాంకు యూబీఎస్‌కు మాల్యా చెల్లించాల్సిన 26.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ.19.50కోట్లు) రుణానికి బదులుగా సుమారు రూ.80 లక్షలు (88,000 పౌండ్ల) చెల్లించాలని యూకే బుధవారం ఆదేశించింది. ఈ మొత్తాన్ని జనవరి 4, 2019 నాటికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. గడువు లోపు ఈ డబ్బును చెల్లించకపోతే.. లండన్ లోని రీజెంట్స్ పార్క్ ఇంటిని స్వాధీనం చేసుకొనేందుకు యూబీఎస్‌కు గ్రీన్ సిగ్నల్‌వచ్చినట్టేనని, దీంతో మాల్యా బంగారు టాయెలెట్ పోయినట్టేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కాగా విజయ్ మాల్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నాయకత్వంలోని 13బ్యాంకుల కన్సార్షియానికి రూ.9వేల కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టి 2016 మార్చిలో లండన్ పారిపోయాడు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాల్యా ఆస్తుల జప్తుపై ఎస్‌బీఐ కన్సార్షియానికి అనుకూలంగా యుకె హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆయనకు దాదాపు రూ.12,500 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment