మాల్యా లగ్జరీ జెట్‌ ఎట్టకేలకు అమ్ముడుపోయింది | Mallya Jet Finally Auctioned, Bought By US Firm | Sakshi
Sakshi News home page

మాల్యా లగ్జరీ జెట్‌ ఎట్టకేలకు అమ్ముడుపోయింది

Published Sat, Jun 30 2018 8:35 AM | Last Updated on Sat, Jun 30 2018 3:15 PM

Mallya Jet Finally Auctioned, Bought By US Firm - Sakshi

లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యా లగ్జరీ జెట్‌

బెంగళూరు : బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యాకు చెందిన లగ్జరీ జెట్‌కు కొనుగోలుదారుడు దొరికాడు. ఎట్టకేలకు ఈ జెట్‌ అమ్ముడుపోయింది. మూడు వేలం పాటలో కొనేవారే కరువైన ఈ జెట్‌కు, తాజాగా జరిగిన వేలంలో అమెరికాకు చెందిన ఓ కంపెనీ ముందుకొచ్చింది. ఏవియేషన్‌ మేనేజ్‌మెంట్‌ సేల్స్‌, ఎల్‌ఎల్‌సీ ఈ జెట్‌ వేలంలో అత్యధిక బిడ్‌ వేసి మాల్యా లగ్జరీ జెట్‌ను దక్కించుకుంది. బిడ్‌ ధర రూ.34.8 కోట్లుగా(5.05 మిలియన్‌ డాలర్లుగా) ఉంది. ఈ బిడ్‌ను బాంబే హైకోర్టు ఆమోదించింది. సేవా పన్ను విభాగం నిర్వహించిన ముందస్తు ఈ-వేలాల కంటే ఇది అత్యధిక బిడ్‌ అని బాంబే హైకోర్టు పేర్కొంది. దీని బిడ్‌ తొలుత 1.9 మిలియన్‌ డాలర్లకు ప్రారంభమైంది. మాల్యా జెట్‌ పేరు ఎయిర్‌బస్‌ ఏ319-133సీ వీటీ-వీజేఎం ఎంఎస్‌ఎం 2650. కర్ణాటక హైకోర్టుతో అటాచ్‌ అయి ఉన్న అధికారిక లిక్విడేటర్‌ అయిన సేవా పన్ను విభాగం ఈ వేలం నిర్వహించింది.

ఈ వేలంతో మాల్యా కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌, సేవా పన్ను విభాగానికి రుణపడిన బకాయిలను, జరిమానాలను రికవరీ చేసుకునేందుకు వీలవుతుంది. ఈ జెట్‌లో 25 ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ప్రయాణించే వీలుంటుంది. ఈ జెట్‌లోనే బెడ్‌రూం, బాత్‌రూం, బార్‌, కాన్ఫరెన్స్‌ ప్రాంతం వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇన్ని రోజులు ఈ జెట్‌ను సేవా పన్ను విభాగం ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ముంబైలో పార్క్‌చేసి ఉంచింది. దీన్ని ఎయిర్‌పోర్టు నుంచి తొలగించాలని ఫిర్యాదులు కూడా బాంబే హైకోర్టులో దాఖలయ్యాయి. ఎయిర్‌పోర్టులో ఈ జెట్‌ను ఉంచడానికి స్థలం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సేవా పన్ను విభాగం తెలిపింది. పార్క్‌ అయిన జెట్‌ వల్ల గంటకు రూ.13 వేల నుంచి రూ.15 వేలు కోల్పోతున్నామని పేర్కొంది. కర్నాటక హైకోర్టుతో అటాచ్‌ అయి ఉన్న అధికారిక లిక్విడేటర్‌ దీన్ని విక్రయించాలని ఏప్రిల్‌లోనే బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ ఎయిర్‌లైన్‌ బెంగళూరుకు చెందినది.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement