‘కింగ్ఫిషర్’లానే.. మాల్యా తుర్రుమన్నాడు!
బ్రిటన్‌కు పరారీపై బొంబాయి హైకోర్ట్ కామెంట్
ముంబై: పీకల్లోతు బ్యాంకింగ్ అప్పుల్లో కూరుకుపోయి, ‘ఉద్దేశపూర్వక’ ఎగవేతదారుగా ముద్రవేయించుకుని బ్రిటన్‌కు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యాను ‘కింగ్‌ఫిషర్’ పక్షిగా బొంబాయి హైకోర్టు అభివర్ణించింది. తన కంపెనీ ‘కింగ్‌ఫిషర్’ పేరుకు తగ్గట్లే ఆయన వ్యవహరించారని, సరిహద్దులను లెక్కచేయకుండా దేశం విడిచి ఎగిరిపోయారని జస్టిస్ ఎస్‌సీ ధర్మాధికారి, బీపీ చోలబ్‌వాలాలతో కూడిన డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. తన కంపెనీ పేరును తగిన విధంగా మాల్యా పెట్టుకున్నారని పేర్కొంది.
మాల్యా బకాయిపడిన దాదాపు రూ. 532 కోట్ల వసూలుకు సంబంధించి సేవా పన్ను విభాగం దాఖలు చేసిన ఒక అప్పీల్‌ను విచారణకు చేపట్టిన కోర్టు తాజా వ్యాఖ్య చేసింది. 2011 ఏప్రిల్ నుంచి 2012 సెప్టెంబర్ వరకూ టిక్కెట్ల అమ్మకానికి సంబంధించి కింగ్‌ఫిషర్ కంపెనీ చెల్లించాల్సిన మొత్తం రూ.32.68 కోట్లని ఆ శాఖ తెలిపింది. మాల్యా వ్యక్తిగత జెట్ వేలం విక్రయాన్ని కూడా వెనక్కు తీసుకోడానికి వీలుగా మరో పిటిషన్‌నూ ఆదాయపు పన్ను శాఖ దాఖలు చేసింది. మొత్తం వ్యయంలో 80 శాతానికి మాత్రమే అత్యధిక బిడ్ దాఖలు కావడమే దీనికి కారణంగా వివరించింది. కేసు తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 26కు వాయిదా వేసింది.