దొంగల్లా కొండంగల్ ను విభజించారు: రేవంత్
Published Thu, Oct 27 2016 4:36 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM
-కొడంగల్‌ను పాలమూరు జిల్లాలో ఉంచాలి
-పట్టణాన్ని డివిజన్ కేంద్రంగా ప్రకటించాలి
-దుద్యాల, గుండుమాల్‌ను మండలాలు చేయాలి
-రిలే దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి
కొడంగల్ : కొడంగల్ నియోజకవర్గాన్ని పాలమూరు జిల్లాలో ఉంచాలని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అఖిల పక్షం, కొడంగల్ నియోజకవర్గ సాధన కమిటీ ఆధ్వర్యంలో 12 రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహర దీక్షలో ఆయన పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొడంగల్ పట్టణాన్ని డివిజన్ కేంద్రంగా ప్రకటించాలన్నారు. బొంరాస్‌పేట మండలం దుద్యాల, కోస్గి మండలం గుండుమాల్ గ్రామాలను మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేస్తున్న ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. కనీసం వార్డు మెంబర్‌కు కూడా గెలవలేని నిరంజన్‌రెడ్డి మాటలు వింటున్న ముఖ్యమంత్రి తెలంగాణా ప్రజల మనోభావాలను గౌరవించడం లేదని ఆరోపించారు. తనపై రాజకీయంగా గెలవలేక కుట్రలు, కుతంత్రాలు చేసి నియోజకవర్గాన్ని ఛిన్నాభిన్నం చేశారన్నారు.
జిల్లా మంత్రులకు, ఎంపీ జితేందర్‌రెడ్డికి, మంత్రి వర్గ ఉప సంఘానికి తాను వ్యక్తిగతంగా కలిసి కొడంగల్ నియోజకవర్గాన్ని పాలమూరులోనే ఉంచాలని సూచించినట్లు చెప్పారు. ఇక్కడి మాజీ ఎమ్మెల్యే లేఖ ఇవ్వడం వల్ల రాత్రికి రాత్రి దొంగల్లా కొడంగల్‌ను విభజించి మూడు మండలాలను వికారాబాద్‌లో, రెండు మండలాలను పాలమూరులో కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. కొడంగల్‌కు అన్యాయం జరగడానికి ప్రభుత్వ ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉందన్నారు. డ్రాప్ట్ నోటీఫికేషన్ వరకు కొడంగల్ నియోజకవర్గాన్ని పాలమూరు జిల్లాలో ఉంచిన తర్వాత విభజించడం వెనుక కుట్ర దాగుందన్నారు. తనపై రాజకీయ కక్ష సాధించాలంటే వ్యక్తిగతంగా చూసుకోవాలని సవాల్ విసిరారు. నియోజకవర్గ ప్రజలు ఏ పాపం చేశారని ప్రశ్నించారు. కొడంగల్ నుంచి 5 సార్లు శాసనసభ్యునిగా గెలిచిన గురునాథ్‌రెడ్డి ప్రస్తుతం టీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నారని అన్నారు.
ఐదుసార్లు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం గురునాథ్‌రెడ్డి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వారం రోజుల్లోపు ముఖ్యమంత్రి అపాయిమెంట్ తీసుకోవాలని గురునాథ్‌రెడ్డికి సూచించారు. పార్టీలకు అతీతంగా స్థానిక ప్రజా ప్రతినిధులను తీసుకెళ్లి ముఖ్యమంత్రిని కలిసి ఇక్కడి ప్రజల ఆవేదన వినిపించడానికి తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. ఆయన ఆధ్వర్యంలో తాను ఎక్కడికైనా రావడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. న్యాయపరంగా పోరాటం చేయడానికి ఇప్పటికే బొంరాస్‌పేట, దౌల్తాబాద్ నాయకులు కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు.
Advertisement