-
మూడు జిల్లాలుగా విభజన
-
రఘునాథపల్లిలో కొత్తగా ఏసీపీ ఆఫీసు
-
మడికొండకు తరలనున్న కాజీపేట ఏసీపీ కార్యాలయం
-
పరకాల పరిధిలోకి ఆత్మకూరు, హసన్‌పర్తి పీఎస్‌లు
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా పోలీసు శాఖలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వరంగల్ జిల్లాను.. వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి(జయశంకర్), మహబూబాబాద్ జిల్లాలుగా పునర్విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 22న ముసాయిదా విడుదల చేసింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వ శాఖలలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పునర్విభజన తర్వాత మూడు జిల్లాలు ఉంటాయా, నాలుగు జిల్లాలా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. నాలుగు జిల్లాలు ఉన్నా, మూడు జిల్లాలు ఉన్నా... పోలీసు శాఖ పరంగా మాత్రం వరంగల్ కమిషరేట్, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలుగానే ఉండనుంది. ప్రతిపాదిత వరంగల్, హన్మకొండ రెవెన్యూ జిల్లాలను పోలీసు శాఖ పరంగా వరంగల్ కమిషరేట్‌లో ఉండనున్నాయి. ఈ విషయంలో స్పష్టత రావడంతో దీనికి అనుగుణంగా కమిషరేట్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో 19 సాధారణ పోలీస్ స్టేషన్లు, మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, ఒక మహిళా పోలీస్ స్టేషన్, ఒక క్రైం పోలీస్ స్టేషన్ ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో 41 సాధారణ పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీస్ స్టేషన్, క్రైం పోలీస్ స్టేషన్ ఉన్నాయి. జిల్లాల పునర్విభజనతో ఇదంతా పూర్తిగా మారిపోనుంది. ప్రస్తుతం వరంగల్ రూరల్ పోలీస్ పరిధిలో ఉన్న రఘునాథపల్లి, నర్మెట, పాలకుర్తి, కొడకండ్ల, నెక్కొండ, ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, శాయంపేట, పరకాల, కరీంనగర్ జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపురం, హుజూరాబాద్ టౌన్, హుజూరాబాద్ రూరల్, జమ్మికుంట టౌన్, జమ్మికుంట రూరల్ పోలీస్ స్టేషన్లు వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో కలపనున్నారు. కొత్త మండలాలుగా ఏర్పడే చెల్పూరు, వేలేరు, ఐనవోలు, ఇల్లంతకుంటలోనూ పోలీస్ స్టేషన్లను దసరా రోజు నుంచే ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలోకి వచ్చే మండలాల పోలీస్ స్టేషన్లను ఏయే అసిస్టెంట్ పోలీస్ కార్యాలయం పరిధిలో ఉండాలనే విషయంలో కసరత్తు జరుగుతోంది. కొత్త పోలీస్ స్టేషన్లు వచ్చి చేరుతుండడంతో కమిషరేట్ పరిధిలోనీ అసిస్టెంట్ పోలీస్ కమిషర్ కార్యాలయ పరిధులలో పలు మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం పరకాల డీఎస్పీ పోస్టు ఏసీపీగా మారనుంది. కాజీపేట ఏసీసీ పరిధిలో ఉన్న హసన్‌పర్తి, ఆత్మకూరు పోలీస్ స్టేషన్లను పరకాల ఏసీపీ పరిధిలోకి రానున్నాయి. కాజీపేట ఏసీసీ కార్యాలయాన్ని మడికొండ పోలీస్ స్టేషన్ ఆవరణలోకి మార్చనున్నారు. ఏసీపీ కార్యాలయం కోసం ఇక్కడ అవసరమైన నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. నర్సంపేట డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయం నర్సంపేట ఏసీపీ కార్యాలయంగా మారనుంది.
దగ్గొండి, నల్లబెల్లి, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ, నర్సంపేట పోలీస్ స్టేషన్లు దీని పరిధిలో ఉండనున్నాయి. హుజూరాబాద్ డివిజన్ పోలీసు అధికారి కార్యాలయం కమిషరేట్ పరిధిలోకి వస్తుండడంతో హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయంగా మారనుంది. ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, హుజూరాబాద్ టౌన్, హుజూరాబాద్ రూరల్, జమ్మికుంట, జమ్మికుంట రూరల్, ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లు హుజూరాబాద్ ఏసీపీ పరిధిలో ఉండనున్నాయి. వరంగల్ కమిషరేట్ పరిధిలో కొత్తగా వర్ధన్నపేట, రఘునాథపల్లిలో ఏసీపీ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. కొడకండ్ల, పాలకుర్తి, రఘునాథపల్లి, వేలేరు, చిల్పూరు, నర్మెట, ఐనవోలు పోలీస్ స్టేషన్లను వీటి పరిధిలోకి తేచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడే దసరా రోజు నుంచే పోలీసు శాఖ పరంగానూ మార్పులు అమల్లోకి రానున్నాయి.