రూరల్ పోలీస్‌కు మళ్లీ అన్యాయం !
-
ఉన్నతాధికారులను కలిసేందుకు కార్యాచరణ
వరంగల్ : జిల్లాల విభజన సందర్భంగా వరంగల్ జిల్లా రూరల్ సిబ్బందికి మళ్లీ అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని రూరల్ ఏఆర్, సివిల్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం త్వరలో వరంగల్‌ను మూడు జిల్లాలుగా విభజించే నేపథ్యంలో రూరల్ సిబ్బందిని మాత్రమే మూడు జిల్లాలకు పంచడం అన్యాయమని పేర్కొంటున్నారు. కమిషనరేట్ సిబ్బందిని మాత్రం ఇక్కడే ఉంచి కేవలం రూరల్ సిబ్బందిని మూడు జిల్లాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు వాపోతున్నారు.
గతంలో జిల్లాను అర్బన్, రూరల్‌గా విభజించిన సందర్భంలో రూరల్ సిబ్బంది నష్టపోయిన విషయం విధితమే. మళ్లీ ఇప్పుడు జిల్లాల పునర్విభజనలో తమకు అన్యాయం జరుగుతుందంటున్నారు. అలా కాకుండా జిల్లా పోలీస్ విభాగాన్ని మొత్తం యూనిట్‌గా తీసుకుని కొత్తగా ఏర్పాటు అయ్యే జిల్లాలకు పంపిణీ చేయాలని కోరుతున్నారు. స్థానికత ఆధారంగా ఇతర జిల్లాల్లో పోలీసు సిబ్బంది విభజన జరుగుతున్న తరుణంలో అదే అంశం ప్రాతిపదికగా వరంగల్ జిల్లాలో విభజన చేపట్టాలని కోరుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిబ్బంది వరంగల్ డీఐజీ ప్రభాకర్‌రావు, డీజీపీ అనురాగ్‌శర్మను కలిసి విన్నవిస్తామని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు రూరల్ సిబ్బందిపై దృష్టి సారించి తాము మరో మారు అన్యాయానికి గురికాకుండా చూడాలని కోరుతున్నారు.