
కన్నిబాయి
ఆదివాసీలకు అండగా నిలుస్తున్న యువతి ∙12వ ఏటే అన్యాయాన్ని ఎదిరించిన ధీర ∙సహాయం కోసం ఆశ్రయిస్తున్న పేదలు.నేనున్నానని భరోసా ఇస్తూ రంగంలోకి ∙మడావి కన్నిబాయి స్ఫూర్తివంతమైన కథ
ఆదివాసీ తెగల్లోని మహిళలకు భయం ఎక్కువ. ఆ భయాన్ని వీడినప్పుడే అభివృద్ధి చెందగలం. సమాజంలో జరుగుతున్న పోకడలను అర్థం చేసుకునేందుకు చదువు చాలా ముఖ్యం. నేడు ఆదివాసీల్లో చాలా మంది నిరక్ష్యరాస్యులున్నారు. పిల్లలందరు బడికి వెళ్లాలి. బాగా చదువుకోవాలి. ముఖ్యంగా మహిళల్లో ఎదిరించే ధైర్యం, తన కాళ్లపై తాను నిలబడే తత్వం కలిగి ఉండాలి
అది 2007
మడావి కన్నిబాయి ఆసిఫాబాద్‌లోని గిరిజన పాఠశాలలో 7వ తరగతి చదువుతూ సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చింది. వచ్చినప్పటి నుంచి తల్లిదండ్రులు పడుతున్న బాధ, ఏడుస్తున్న తీరు చూసి దిగ్భ్రాంతి చెందింది. తల్లిదండ్రులు చెప్పిన విషయం విని నిశ్చేష్టురాలైంది. ‘నాలుగేళ్ల క్రితం పొలాన్ని కౌలుకు ఇచ్చాం. ఇప్పుడు పొలం తిరిగి ఇవ్వాలని రైతును అడిగితే ఎక్కడి పొలం.. నేను కొనుగోలు చేశాను.. డబ్బులు కూడా అప్పుడే ఇచ్చేశాను అని బుకాయిస్తున్నాడు. గ్రామ పెద్దలకు చెప్పినా∙పట్టించుకోలేదు. ఏం తినాలి.. ఎలా బతకాలి’ అంటూ కన్నవారు అసలు విషయం ఆ చిన్నారికి చెప్పారు. వెంటనే కన్నిబాయి తల్లిని వెంట బెట్టుకుని బస్సులో ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయానికి వెళ్లింది. పీవో సార్ ఎక్కడుంటాడో తెలుసుకొని ఆయనకు తెలుగులో రాసిన ఓ దరఖాస్తును ఇచ్చింది. దాన్ని చూసిన పీవో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కన్నిబాయి ధైర్యాన్ని మెచ్చుకుని వెంటనే ఆర్డీ్డవోతో పాటు మరికొంత మంది అధికారులను వెంటబెట్టుకుని గ్రామానికి వెళ్లాడు. రైతు కబ్జాలో ఉన్న పొలాన్ని మళ్లీ కన్నిబాయి తల్లిదండ్రులకు అప్పజెప్పాడు. అప్పుడే అనుకుంది కన్నిబాయి.... నాలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.. వారికి న్యాయం చేయాలి.. హక్కులు వారికి కల్పించాలి అని. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం భీమన్‌గోంది గ్రామానికి చెందిన మడావి కన్నిబాయి ఆ రోజు నుంచి ఆదివాసీ మహిళా చైతన్యానికి ఒక దివిటీలా నిలిచింది. తన పోరాటం తన మాటల్లోనే....
పేదల పక్షం
నా పేరు మడావి కన్నిబాయి. తల్లిదండ్రులు మడావి భీంబాయి–జైతు. ఇద్దరు అన్నలున్నారు. నేను చిన్నదాన్ని. ఒకటి నుంచి 10వ తరగతి వరకు ఆసిఫాబాద్ లోని ఎస్టీ బాలికల ఉన్నత పాఠశాలలో చదివాను. ఇంటర్ కెరమెరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యనభ్యసించాను. ఆర్థిక ఇబ్బందులతో పై చదువులు చదవలేకపోయా. కాని ఉన్న చదువుతోనే చాలా పనులు చేయవచ్చని గ్రహించా. ఇందిరాక్రాంతి పథంలో పీవోపీ (పూరెస్ట్ ఆఫ్ పూర్) సీఏగా విధులు నిర్వహిస్తున్నప్పుడు మండలంలోని చాలా గ్రామాలు సందర్శించా. ఎస్టీ, ఎస్సీలలో ఉన్న అత్యంత వెనకబడిన కుటుంబాలపై సర్వే నిర్వహించా. ఆ క్రమంలో మండలంలో 108 అత్యంత వెనుకబడిన కుటుంబాలు ఉన్నాయని గుర్తించి, అధికారులకు నివేదిక సమర్పించా. ఆ తర్వాత ఆదివాసీ గిరిజన సంఘంలో మహిళా కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆసిఫాబాద్, కెరమెరి, తిర్యాణి మండలాలకు చెందిన 150 మంది ఆదివాసీలకు ఆర్‌వోఎఫ్‌ఆర్(అటవీ హక్కు) పత్రాలను ఇప్పించా. వారు ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేస్తున్నప్పటికీ పట్టాలు లేకపోవడంతో సంక్షేమ పథకాలు అందడం లేదు. బ్యాంకుల నుంచి రుణాలు అందకపోవడంతో దళారులను, వ్యాపారులను ఆశ్రయించి వడ్డీలకు వడ్డీలు చెల్లించి నష్టపోతున్నారని తెలుసుకొని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వీ కర్ణణ్‌తో మాట్లాడి ఆ 150 మందికి పట్టాలిప్పించడం నాకు చాలా సంతోషం కలిగించింది. ప్రస్తుతం వారు సాగు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
ఎన్నో నష్టపరిహారాలు
తిర్యాణి మండలానికి చెందిన కొలాం విద్యార్థిని ఆసిఫాబాద్‌లోని గిరిజన పాఠశాలలో 6వ తరగతి చదువుతూ అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలియగానే ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని, మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని ఆందోళనæ చేపట్టా. దీనికి స్పందించిన ప్రభుత్వం మృతురాలి కుటుంబానికి రూ. 2.5 లక్షల ఆర్థిక సహాయం చేసింది. అలాగే ఈ ప్రాంతంలో కొలాం అమ్మాయిలపై జరిగిన అత్యాచారాలపై గళం విప్పి వారికి ఆర్థిక సహాయం అందేలా కృషి చేశా. ప్రస్తుతం కొలాం మహిళా డెవలప్‌మెంట్ సొసైటీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంచార్జిగా బాధ్యతలు చేపడుతున్నా. ఈ సొసైటీ ఆధ్వర్యంలో ఉట్నూర్, ఇంద్రవెల్లి, కెరమెరి, వాంకిడి మండలాల్లో ఇప్పటికి 41 గ్రామాలను సందర్శించి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పూర్తిగా ఆదిమ గిరిజనులైన కొలాం, నాయక్‌పోడ్, తోటిలకు చెందేలా కార్యాచరణ రూపొందించా.
సినిమాలో కొరియోగ్రాఫర్‌గా..
వీ6 టీవీ ఫేం బిత్తిరి సత్తి నటిస్తున్న ‘తుపాకి రాముడు’ సినిమాలో కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాను. ఆ సినిమాల్లో నటించేందుకు 52 మంది కొలాం తెగకు చెందిన కళాకారులను తయారు చేసి నటింపజేస్తున్నాను. ఆ సినిమాల్లో నృత్యదర్శకురాలిగా నేనే డ్యాన్సులు నేర్పిస్తున్నాను. ఎలాంటి బట్టలు వేయాలి.. ఎలా నృత్యాలు చేయాలి అనేది నేర్పిస్తున్నాను.
కొండలు ఎక్కగలను..
నెహ్రూ యువ కేంద్రంలో పని చేస్తున్నప్పుడు అక్కడి అధికారులు నాలో ఉన్న ప్రతిభను గుర్తించి ట్రెక్కింగ్‌లో శిక్షణ ఇప్పించారు. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, నిర్మల్‌లోని కుంటాల జలపాతంలో ఉన్న పెద్ద పెద్ద గుట్టలను సైతం ఎక్కాను. అధికారులతో ప్రశంసాపత్రాలు, మెమోంటోలు తీసుకున్నా.. కబడ్డీ, ఖోఖో ఆటలంటే చాలా ఇష్టం. ఇప్పటికీ గ్రామానికి వెళ్తే సమయం చిక్కితే ఆటలు ఆడుతా. గడిచిన రెండేళ్లుగా నేను పేదలకు చేస్తున్న సేవలను గుర్తించిన కుమురం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్, అటవీశాఖ మంత్రి జోగు రామన్న చేతుల మీదుగా మంచి సేవకురాలిగా అవార్డు అందుకున్నా.
భయం వీడాలి.. విద్యనభ్యసించాలి!
ఆదివాసీ తెగల్లోని మహిళలకు భయం ఎక్కువ. ఆ భయాన్ని వీడినప్పుడే అభివృద్ధి చెందగలం. సమాజంలో జరుగుతున్న పోకడలను అర్థం చేసుకునేందుకు చదువు చాలా ముఖ్యం. నేడు ఆదివాసీల్లో చాలా మంది నిరక్ష్యరాస్యులున్నారు. పిల్లలందరు బడికి వెళ్లాలి. బాగా చదువుకోవాలి. ముఖ్యంగా మహిళల్లో ఎదురించే ధైర్యం, తన కాళ్లపై తాను నిలబడే తత్వం కలిగి ఉండాలి. సమాజంలో ఆదిమ తెగల వారంటే అందరికీ అలుసే. ఈజీగా మోసం చేయవచ్చనే భావన గిరిజనేతరుల్లో ఉంది. వాటిని తిప్పికొట్టే ధైర్య సాహసాలు కలిగి ఉండాలి. మోసపోకూడదు.
తమ హక్కులు, తమ చట్టాలను తెలుసుకోవాలి. కౌలు చేసుకుంటున్న కౌలుదార్లు చాలా మంది పట్టేదారులను మోసగించి భూములు లాక్కున్న సందర్భాలు ఉన్నాయి. వారి మోసాన్ని గ్రహించాలి. అప్పుడే సమాజంలో నిలబడగలం.
– సుర్పం ఆనంద్, సాక్షి ప్రతినిధి కెరమెరి, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment