ఐటీడీఏలో అన్నీ ఖాళీలే
-
19 మందికిగాను ఉండేది ఆరుగురే
-
పని ఒత్తిడిలో ఉద్యోగులు
నెల్లూరు(సెంట్రల్) : పది మంది పనిని ఒకరితో చేయిస్తే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం అవుతోంది. కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులు నిర్వహించే గిరిజన(యానాదుల) సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో తగినంత సిబ్బందిని నియమించలేదంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప నాలుగు జిల్లాలకు కలిపి నెల్లూరులో ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగం పనిచేస్తోంది. అందులో ఉండాల్సిన 19 మంది ఉద్యోగులకు గాను ప్రస్తుతం 6 మంది మాత్రమే ఉన్నారు. వారిలోనూ ఒకరు ఔట్‌సోర్సింగ్ కావడం గమనార్హం.
సిబ్బంది కొరత
ఐటీడీఏలో సిబ్బంది కొరత కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయి. తగినంత సిబ్బందిని నియమిస్తే పనులు సకాలంలో పూర్తి చేయవచ్చు. నాలుగు జిల్లాలకు కలిపి ఇంజనీరింగ్ విభాగంలో ఈఈ–1, డీఈఓ–1, డ్రాఫ్ట్స్‌మెన్స్–2, క్లర్క్‌లు–2, అటెండర్లు–2, కంప్యూటర్ ఆపరేటర్లు–2, సబ్‌డివిజన్‌లకు సంబంధించి డీఈఈ–1, ఏఈ–3, ఏఈఈ–3, గేడ్ర్ 3 డ్రాఫ్ట్స్‌మెన్–1, యూడీసీ–1, ఎల్‌డీసీ–1, అటెండరు–1 మొత్తం 19 పోస్టులు ఉండాల్సి ఉండగా అందులో ప్రస్తుతం ఉండేది మాత్రం ఈఈ–1, ఏఈ–1, డీఈ–1, సీనియర్ అసిస్టెంట్–1, కంప్యూటర్‌ఆపరేటర్–1, అటెండరు–1 మాత్రమే ఉండడం గమనార్హం. ఐటీడీఏలో ఖాళీగా ఉన్న పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాల్సి ఉంది.
ఉన్నతాధికారులకు తెలియజేశాం
సిబ్బంది కొరతతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏ పనులు చేయాలన్నా ఆలస్యం అవుతోంది. నిత్యం నాలుగు జిల్లాలోని కాంట్రాక్ట్ పనులు చూసుకోవాలి. తగినంత సిబ్బందిని నియమిస్తే పనులు సకాలంలో పూర్తిచేయవచ్చు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయాం.
–ఏవీజీకే ప్రసాద్, ఈఈ