ఐటీడీఏ అధికారుల పనితీరు అధ్వానం
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ
వెలుగోడు : చెంచుల జీవన స్థితిగతులు పరిశీలించేందుకు నియమించబడిన ఐటీడీఏ అధికారుల పనితీరు అధ్వానంగా తయారైందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక విజయదుర్గా చెంచు కాలనీలో శుక్రవారం ఏర్పాటు చేసిన చెంచు మహిళల సదస్సుకు శివాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చెంచు మహిళలను సమస్యలు అడిగి తెలసుకున్నారు. చెంచుల స్థితి గతులు మార్చేందుకు ఐటీడీఏ వ్యవస్థను ఏర్పాటు చేశారని, అయితే వారికి సంక్షేమ ఫలాలు సక్రమంగా అందడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని శివాజీ తెలిపారు. ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే జీవన ప్రమాణాల్లో మార్పులు వస్తాయన్నారు. చెంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర నివేదిక రూపొందించి ముఖ్యమంత్రికి అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఉశ్సేనమ్మ అనే మహిళతో ఖాళీ చెక్కులపై ఎందుకు సంతకాలు చేసుకున్నారని ఐటీడీఏ అధికారులను నిలదీశారు.
అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం
పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ జేసీ రామస్వామి, ఆర్‌డీవో హుస్సేన్‌సాహెబ్, ఐటీడీఏ ఏపీవో రోశిరెడ్డి, డీఎస్పీ వినోద్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు సలోమీ, సీఐ కృష్ణయ్య, తహసీల్దార్ తులసీనాయక్, ఎంపీడీవో భాస్కర్, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.