దాహార్తి..కక్కుర్తి | Corruption In ITDA Prakasam | Sakshi
Sakshi News home page

దాహార్తి..కక్కుర్తి

Published Sat, Jun 16 2018 11:24 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

Corruption In ITDA Prakasam - Sakshi

ఐటీడీఏ ఆధ్వర్యంలో చెంచుగూడెంలో నీటి సౌకర్యం కోసం చేసిన పనుల్లో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ అక్రమాల నిగ్గు తేల్చేందుకు ఏసీబీ రంగంలోకి దిగింది. లోతు తక్కువ బోర్లకు ఎక్కువ వేసినట్లు నమోదు చేయడం, టెండర్‌ సూచనలకు విరుద్ధంగా ఇతర కంపెనీల మోటార్లు వినియోగించడం, నాసిరకం పనులతో నిధుల స్వాహాకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీకి చెందిన ఎస్టీ సెల్‌ నాయకుని ఫిర్యాదుతోనే ఏసీబీ విచారణ కోసం సమాచారం సేకరించనుంది.

మాచర్ల టౌన్‌: గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల పరిధిలోని చెంచుగూడెంలలో చెంచుల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం రూ.11.12 కోట్లు మంజూరు చేసింది. గుంటూరు జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో 43 చెంచుగూడెంలలోని 5,764 మంది చెంచులకు, ప్రకాశం జిల్లాలోని ఏడు మండలాల పరిధిలోని 71 గూడెంలలోని 11,084 మందికి, కర్నూలు జిల్లాలోని 14 మండలాల పరిధిలోని 17 గూడెంలలోని 3,717 మంది చెంచుల కోసం నిధుల కేటాయించారు. మూడు జిల్లాల పరిధిలోని 131 గూడెంలకు చెందిన 20,565 మంది చెంచుల తాగునీటి అవసరాలను తీర్చేందుకు నిధులు కావాలని శ్రీశైలం ఐటీడీఏ అధికారులు తీర్మానం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం రూ.11.20 కోట్లు ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో బోర్లు వేసి, మోటార్లు బిగించి, ట్యాంక్‌లు నిర్మించి పైప్‌లైన్‌ పనులు చేయాలని ఇంజినీరింగ్‌ శాఖ ఐటీడీఏకు ప్రతిపాదనలు పంపింది. ప్రతిపాదనలకు విరుద్ధంగా పనులు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జియాలజిస్టుల వద్ద కొన్ని చోట్ల వెయ్యి అడుగుల లోతుకు బోర్లు వేయాలని నివేదికలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నివేదికలకు అనుగుణంగా వెయ్యి అడుగులకు బదులు కొన్ని చోట్ల 240, మరికొన్ని చోట్ల 500 అడుగుల వరకు బోర్లు వేసి వెయ్యి అడుగులకు బిల్లులు రాసుకున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఒక్కొక్క బోరు విషయంలో రూ.60వేలు వ్యత్యాసముంది. గుంటూరు జిల్లాలో 43 బోర్లకు తక్కువ లోతు బోర్లు వేయడం వలన రూ.25.80 లక్షలు ప్రభుత్వ నిధులు దుర్వినియోగమయ్యే అవకాశముంది. అంచనాలలో సూచించిన టెక్స్‌మో కంపెనీ మోటారుకు బదులుగా అంబూజా మోటార్లను వేశారు. ఇనుప పైప్‌లైన్‌కు బదులుగా లబ్బర్‌ పైప్‌లైన్‌ వేశారు. నీటి ట్యాంకులను కొన్ని చోట్ల కొలతలకు విరుద్ధంగా, మరికొన్ని చోట్ల నాసిరకంగా వేసినట్లు సమాచారం.
జియాలజిస్టు నివేదిక లేకుండానే..
కొన్ని చోట్ల జియాలజిస్టు నివేదిక ఇవ్వకుండా బోర్లు పాయింట్‌ పెట్టని చోట్ల బోర్లు వేశారు. బొల్లాపల్లి, రేమిడిచర్ల, దుర్గి మండలంలోని నిదానంపాడు, వెల్దుర్తి మండలంలోని మండాది వంటి గ్రామాల్లో 500 అడుగుల వరకు బోర్లు వేసినా నీరు రావటం లేదు. వెయ్యి అడుగులకు బదులుగా తగ్గించి వేసిన బోర్లలో అనేక చోట్ల బోర్లు బావులు నీరు రాక నిరుపయోగంగా ఉన్నాయి. ఈ అక్రమాలపై వీటీడీఏ ఉపాధ్యక్షుడు, టీడీపీ ఎస్టీసెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు మండ్లి గురవయ్య పలు శాఖల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐటీడీఏ పీఓ, ఈఈ, డీఈ, ఏఈ, గుంటూరు జిల్లా కలెక్టర్, ఇటీవల గుడిపాడు చెరువుకు విచ్చేసిన జిల్లా జేసీ, ఏసీబీ అధికారులకు అక్రమాలపై ఫిర్యాదు చేశారు. దీనికి అవినీతి నిరోధకశాఖ అధికారులు స్పందించారు. సోమవారం గురవయ్యను గుంటూరుకు పిలిపించి అక్రమాల వివరాల అడిగి తెలుసుకున్నారు. దీనిపై విచారణకు ఏసీబీ అధికారులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై గురవయ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏసీబీ అధికారులతో చర్చించిన విషయం వాస్తవమేనన్నారు. ఏసీబీ వారు విచారణ కోసం మరికొంత సమాచారం కావాలన్నారని చెప్పారు. సమాచార హక్కు చట్టం కింద ఇప్పటికే అర్జీ పెట్టానని, ఆ సమాచారం అందిన వెంటనే ఏసీబీ వారికి అందజేసి విచారణకు సహకరిస్తానని   వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement