ఏటూరునాగారం : ఐటీడీఏ డిప్యూటీ ఈఓ, తాళ్లగడ్డ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పులుసం సాంబయ్య(45) బుధవారం ఉదయం ఎంజీఎం ఆస్పత్రిలో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, హెడ్‌కానిస్టేబుల్ రమేష్ కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని తాళ్లగడ్డలో కుటుంబ సభ్యులతో నివాసముంటున్న సాంబయ్యకు వారం రోజులుగా కడుపునొప్పి వస్తుండడంతో ఆస్పత్రికి వెళ్లి మందులు తెచ్చుకున్నాడు. అలాగే పాఠశాలలో గడ్డి బాగా పెరగడంతో గడ్డి నివారించేందుకు పెస్టిసైడ్స్ షాపులో తెచ్చుకున్న గడ్డి మందును ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో 10వ తేదీన ఉదయం కడుపునొప్పి వస్తుండడంతో టానిక్ అనుకొని పక్కనే ఉన్న గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తర్వాత సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం ఈ నెల 19న ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశాడు. మృతుడి భార్య శ్యామల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఎంజీఎంలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు హెడ్‌కానిస్టేబుల్ రమేష్ తెలిపారు.