paderu agency
-
ఎగిరే పామును చూశారా..?
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఏజెన్సీ ప్రాంత ప్రజలు కూడా ఎన్నడు చూడని అరుదైన పాము పాడేరులో కనిపించింది. స్థానిక చాకలిపేటలో ఉపాధ్యాయుడు ఒంపురి కేశవరావు ఇంటి రెండో అంతస్తులోని వంటగదిలో నలుపు ఎరుపు, గోల్డ్ రంగుల మిశ్రమంలో రింగ్‌లుగా ఉన్న ఈ పామును చూసి స్థానికులంతా భయాందోళన చెందారు. స్థానికుల ఫోన్‌తో వచ్చిన స్నేక్ క్యాచర్ బండారు వాసు చాకచక్యంగా పామును పట్టుకున్నారు. మూడున్నర అడుగులున్న ఈ పాము ఒరంటే ఫ్లయింగ్ స్నేక్ అని వాసు తెలిపారు. ఎగిరే స్వభావంగల ఈ పాము అడవుల్లో రాత్రిళ్లు ఎక్కువగా సంచరిస్తుందని చెప్పారు. ఆ పామును ఆయన పాడేరు ఘాట్‌లోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. -
వింత వాతావరణం.. ఏజెన్సీలో రోజూ వర్షాలే..!
పాడేరు: ఏజెన్సీలో వింత వాతావరణం నెలకొంది. వేసవిలో కూడా రోజూ వర్షాలు కురుస్తుండడంతో పాటు ఉదయం పొగమంచు, సూర్యోదయం తర్వాత ఎండ తీవ్రత అధికంగా ఉంటున్నాయి. దీంతో ఏజెన్సీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారం రోజుల నుంచి అరకులోయ, పాడేరు నియోజకవర్గాల పరిధిలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంచంగిపుట్టు, జి.మాడుగుల, అరకులోయ, పాడేరు, హుకుంపేట మండలాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. గెడ్డల్లో నీటి ప్రవాహం పెరిగింది. పర్యాటక ప్రాంతాలైన చాపరాయి, కొత్తపల్లి జలపాతాలకు వర్షం నీటితో జలకళ ఏర్పడింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, డుంబ్రిగుడ మండలాల్లో భారీ వర్షం కురవడంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా ఏర్పడిన నష్టాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని రెవెన్యూ యంత్రాంగానికి సబ్ కలెక్టర్ వి.అభిషేక్ ఆదేశించారు. నాలుగు ఇళ్లు ధ్వంసం జి.మాడుగుల: మండలంలో శుక్రవారం సాయంత్రం ఈదుర గాలులతో కూడిన వర్షానికి నాలుగు రేకుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. కోరాపల్లి పంచాయతీ వయ్యంపల్లిలో కోరాబు వెంకటరావు, మర్రి కృష్ణారావు, మర్రి కామేశ్వరరావు, కొర్రా సన్యాసిరావులకు చెందిన ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్ల పై కప్పు రేకులు ఎగిరి పడడంతో ధ్వంసమయ్యాయి. నాలుగు కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. ధాన్యం, బియ్యం, ఇతర వస్తువులు పాడయ్యాయని బాధితులు తెలిపారు. సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు వారు తెలిపారు. శంకులమిద్దెలో ఆదివారం కురిసిన వర్షానికి ఓ చెట్టు.. మినీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పై పడడంతో అది నేల కూలింది. పిడుగుపాటుతో మహిళకు గాయాలు హుకుంపేట : పిడుగుపాటుకు ఓ గిరిజన మహిళ తీవ్ర గాయాలపాలైంది. మండలంలోని కొట్నాపల్లి పంచాయతీలోని లొపొలం గ్రామంలో వంతాల నీలమ్మ అనే మహిళ ఇంటి వద్ద ఆదివారం సాయంత్రం పిడుగుపడింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న నీలమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆటోలో హుకుంపేట ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ఆస్పత్రిలో కోలుకుంటున్నట్టు కుటుంసభ్యులు తెలిపారు. -
చిక్కటి కాఫీ.. చక్కటి మిరియం
మన మన్యం కాఫీ కమ్మదనమే వేరు. ఆ ఘుమఘుమలు దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాయి. గిరి రైతుకు సిరులు కురిపిస్తున్న ఆ పంట ఈ ఏడాదీ విరగ్గాసి లాభాలు అందించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు కాఫీ అంతర పంట మిరియం పాదులు కూడా గింజ కడుతుండడంతో ఏజెన్సీ రైతులు ఆనందంతో ఉన్నారు. కాఫీ, మిరియాల పంటలు ఒకేసారి గింజ దశలో కళకళలాడుతుండడం విశేషం. పాడేరు : విశాఖ ఏజెన్సీలో కాఫీ, అంతర పంట మిరియాలు ఈ ఏడాదీ గిరిజన రైతులకు సిరులు కురిపించనున్నాయి. ఏటా ఏజెన్సీలోని గిరిజన రైతులను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు జీవనోపాధికి కాఫీ పంట ప్రధానంగా మారింది. విశాఖ మన్యంలో గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న కాఫీ పంటకు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి పేరుంది. నాణ్యమైన కాఫీ గింజల ఉత్పత్తికి కేరాఫ్ అడ్రస్‌గా విశాఖ ఏజెన్సీని అనేక దేశాలు గుర్తించాయి. ప్రపంచంలో బ్రెజిల్ లోని కాఫీ పంట నంబర్ వన్‌గా నిలుస్తుండగా మన దేశానికి సంబంధించి కర్ణాటక తర్వాత విశాఖ ఏజెన్సీలోని గిరిజనులు సాగు చేస్తున్న కాఫీ పంటకు నాణ్యతలో మూడో స్థానం లభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గిరిజనులంతా ఏటా కాఫీ తోటల సాగును విస్తరిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే విశాఖ ఏజెన్సీవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురవడంతో కాఫీ తోటలకు ఎంతో మేలు చేసింది. కాఫీ మొక్కలకు పూల పూత కూడా ముందుగానే ఏర్పడింది. వర్షాలు విస్తారంగా కురవడంతో కాఫీ మొక్కలకు గింజ దశ కూడా వేగంగా ఏర్పడింది. ఎక్కడ చూసినా కాఫీ తోటల్లో మొక్కలన్నింటికీ కాఫీ గింజలు కాపు విరగ్గాయడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది దిగుబడులు అధికంగా ఉంటాయని కేంద్ర కాఫీ బోర్డు, ఐటీడీఏ కాఫీ విభాగం అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లక్షా 14వేల ఎకరాల్లో ఫలసాయం ఏజెన్సీలోని 11 మండలాల పరిధిలో 2.21లక్షల ఎకరాల విస్తీర్ణంలో కాఫీ తోటలున్నాయి. 2,05,464 మంది గిరిజన రైతులు కాఫీ తోటలు సాగు చేస్తున్నారు. 1.58 లక్షలకు పైగా ఎకరాల కాఫీ తోటలు ఫలసాయాన్ని ఇస్తున్నా పూర్తిస్థాయిలో 1.14లక్షల ఎకరాల్లోని తోటలే అధిక దిగుబడి నిస్తున్నాయి. ఈ తోటల్లో ప్రస్తుతం కాఫీ కాపు అధికంగా ఉంది. ఏజెన్సీవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గింజ దశలో ఉన్న కాఫీ పంటకు మరింత మేలు చేస్తుంది. ఈ ఏడాది కూడా అక్టోబర్ నెలకే ఫలసాయం రావొచ్చు. ఈ ఏడాది మరింత దిగుబడి వాతావరణ పరిస్థితులు అనుకూలమై కాఫీ తోటలకు ఎంతో మేలు చేస్తుండడంతో ఈ ఏడాది కూడా కాఫీ దిగుబడులు మరింత పెరగనున్నాయని కేంద్ర కాఫీ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. గత ఏడాది 11వేల మెట్రిక్ టన్నుల క్లీన్ కాఫీ గింజలు దిగుబడి సాధించగా ఈ ఏడాది 12వేల మెట్రిక్ టన్నులు అధిక దిగుబడులు వస్తాయని కేంద్ర కాఫీబోర్డు, ఐటీడీఏ కాఫీ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. రెండేళ్ల నుంచి కాఫీ తోటలకు వాతావరణం మేలు చేస్తుండడం గిరిజన రైతులకు మంచి దిగుబడులిస్తున్నాయి. మిరియం ముందస్తు పూత ఏజెన్సీలోని కాఫీ తోటల్లో అంతర పంటగా సాగవుతున్న మిరియాల పాదులకు వర్షాలు, వాతావరణ పరిస్థితులు అనుకూలించాయి. దీంతో ఎన్నడు లేని విధంగా ముందస్తుగానే మిరియాల పాదులకు కూడా పూత ప్రారంభమైంది. పాదులకు గెలలు ఏర్పడడంతో మెల్ల మెల్లగా గింజ కడుతుండడంతో గిరిజన రైతులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాఫీ, మిరియాల గింజలు ఒకేసారి గింజ దశలో కళకళలాడుతుండడం విశేషం. ఏజెన్సీవ్యాప్తంగా 98వేల ఎకరాల కాఫీ తోటల్లో ఎకరానికి వంద మిరియాల పాదులు ఉన్నాయి. ప్రతి ఏడాది 3వేల మెట్రిక్ టన్నుల మిరియాల దిగుబడి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా వాతావరణ పరిస్థితులన్నీ మిరియాల పాదులకు మేలు చేయడంతో ఆయా పాదులు పూతదశకు చేరుకున్నాయి. -
ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని, ఏజెన్సీ ప్రాంతంలో మౌలిక వసతులను కల్పిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా అక్టోబర్2న విశాఖపట్నం జిల్లాలోని పాడేరులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తున్నామని పేర్కొన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని విజయసాయిరెడ్డి ట్విటర్లో పేర్కొన్నారు. చదవండి: ( భారానికి, అధికారానికి తేడా వాళ్ళకు తెలియదా?) -
కోవిడ్ రోగుల డ్యాన్స్
-
పాడేరు కోవిడ్ సెంటర్లో రోగుల డ్యాన్స్
సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం కరోనావైరస్ తీవ్రత కంటే మానసిక ఆందోళన మనుషుల్ని అధికంగా ఇబ్బంది పెడుతోంది. దాంతో పలువురు వైద్య సిబ్బంది వైరస్ బాధితుల్లో ఉత్సాహాన్ని నింపుతూ డ్యాన్సులు వేయడం, పాటలు పాడటం వంటి విశేషాలను చూశాం. తాజాగా జిల్లాలోని పాడేరు కోవిడ్ సెంటర్ వైద్య సిబ్బంది కరోనా సోకిన పేషెంట్లలో ఆనందాన్ని నింపారు. స్థానిక యూత్ ట్రైనింగ్ సెంటర్లో కోవిడ్ రోగుల కోసం ఏర్పాటు కరోనా సెంటర్లో వైద్య సిబ్బంది రోగులను ఉత్సాహపరుస్తూ ఉర్రుతూలుగించే పాటలకు స్టెప్పులు వేయించారు. (తెలంగాణలో కొత్తగా 2,384 కరోనా కేసులు) దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాజిటివ్ లక్షణాలకు గురైన వ్యక్తుల్లో కొంత ఉత్సాహం నింపినట్లయితే త్వరితగతిన వారు కోలుకునే అవకాశాలు ఉంటాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి పాజిటివ్ లక్షణాలు సోకడం సహజంగా మారిందని తెలిపారు. కానీ, కోవిడ్ వచ్చిందని మానసిక ఆందోళన చెందడం సరికాదని వైద్య వర్గాలు సూచించాయి. ఇక ఇటీవల పాడేరు ఏజెన్సీలో కూడా వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్న వ్యక్తుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. -
మృతదేహంతో కాలినడకన 5 కి.మీ.
కొయ్యూరు (పాడేరు): రోడ్డు లేకపోవడంతో గిరిజనుడి మృతదేహాన్ని ఐదు కిలోమీటర్ల వరకు మోసుకెళ్లిన ఘటన విశాఖ ఏజెన్సీలో శుక్రవారం జరిగింది. కొయ్యూరు మండలం గరిమండకు చెందిన మర్రి సర్వేశ్వరరావు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మరణించాడు. అతడి బంధువులు మృతదేహాన్ని శుక్రవారం నేరెళ్లబంద వరకు ‘ప్రజాప్రస్థానం’లో తీసుకువచ్చారు. అక్కడి నుంచి రోడ్డు సరిగ్గా లేకపోవడంతో చేసేదేమీలేక డ్రైవర్ వాహనాన్ని నిలిపివేశాడు. మృతుడి బంధువులు మృతదేహాన్ని నేరెళ్లబంద నుంచి గరిమండ వరకు ఐదు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ మోసుకెళ్లారు. అదే తమ గ్రామానికి రహదారి సరిగ్గా ఉండి ఉంటే ‘ప్రజాప్రస్థానం’ వాహనం తమ గ్రామానికి నేరుగా వచ్చి ఉండేదని మృతుడి బంధువులు చెప్పారు. అధికారులు స్పందించి వెంటనే తమ గ్రామానికి రోడ్డు వెయ్యాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ గ్రామానికి దూరంలో ఇంకా అనేక గ్రామాలున్నాయని ,అక్కడా ఇలాంటి పరిస్థతి వస్తే 15 కిలోమీటర్లకు పైగా మృతదేహాలను మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. -
జాతి వైరానికి దూరం..ఆ అమ్మతనం
సాక్షి, గూడెంకొత్తవీధి (పాడేరు) : సృష్టిలో అమ్మతనానికి మించిన దైవం మరొకటి లేదు. అనంతకోటి జీవరాశుల్లో జాతి వైరం సహజం. కుక్కకు కోడికి పడదు. కోడికీ పిల్లికి పడదు. ఇలా ఒక్కో జాతివైరం ప్రకృతి సహజంగా ఉంటుంది. ఇందులో ప్రేమాభిమానాలకు తావుండదు. జీకేవీధి మండలంలో సప్పర్ల గ్రామంలో అబ్బాస్ అనే వ్యక్తి ఇంట్లో మేక పిల్లను పెంచుతున్నాడు. తన ఇంటిలో ఒక శునకం ఉంది. మేకకు రెండు పిల్లలు జన్మించాయి. ఐతే ఇటీవల మేక అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో రెండు మేక పిల్లలు అనాథలయ్యాయి. దీంతో తన ఇంటిలో ఉన్న కుక్క, మేక పిల్లలకు పాలిచ్చింది. మేక పిల్లలు కుక్క పాలు తాగుతున్నాయి. -
స్నో'యగం'
పాడేరు రూరల్/ విశాఖపట్నం: ఏజెన్సీలో ముందస్తుగా చలిగాలులు వ్యాపిస్తున్నాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మన్యంలో చలిగాలులు విజృంభిస్తాయి, పొగమంచు దట్టంగా కురుస్తుంది. అయితే బుధవారం సాయంత్రం నుంచే మన్యంలో చలిగాలులు ప్రారంభమయ్యాయి. రాత్రంతా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలను చలి వణికించింది. గురువారం తెల్లవారుజాము నుంచి పొగమంచు దట్టంగా కురిసింది. ఉదయం 8గంటల వరకు మంచు తెరలు వీడలేదు. వాహన చోదకులు లైట్లు వేసుకునే వాహనాలను నడిపారు. మన్యాన్ని మంచు కమ్ముకోవడంతో సాలెగూడులు మంచు బిందువులతో ఆకర్షించాయి. గురువారం వేకువజామున 4 గంటల నుంచే అన్ని ప్రాంతాల్లో మంచు దుప్పటి పరుచుకుంది. ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. కొంతమంది గిరిజనులు చలిమంటలు కాగుతూ ఉపశమనం పొందారు. సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉన్న పర్యాటక ప్రదేశమైన మండలంలోని డల్లాపల్లి ప్రాంతంలో 14డిగ్రీలు, మోదకొండమ్మ అమ్మవారి పాదాలులో 16డిగ్రీలు, మినుములూరు కాఫీ పరి«శోధన కేంద్రంలో 17 డిగ్రీలు, పాడేరు పరిసర ప్రాంతాల్లో 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం సాయంత్రం 4గంటల నుంచే చలిగాలులు వేయడంతో ముందస్తుగానే చలికాలం ప్రారంభమైందని గిరిజనులు వాఖ్యానిస్తున్నారు.