broom
-
సిరుల విరులు..కొండ చీపుర్లు
సాక్షి, అమరావతి: మనం ఇళ్లల్లో ఉపయోగించే మెత్తని గడ్డి మాదిరిగా ఉండే కొండ చీపుర్లు గిరిజనులకు జీవనోపాధిగా మారాయి. కొండ చీపురు గడ్డి పెంపకంతో రాష్ట్రంలోని వేలాది గిరిజన కుటుంబాలు ఉపా«ధి పొందుతున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. ‘కొండ చీపురుతో ఊడ్చేద్దాం’ అనే నినాదంతో వాటి వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా గిరిజనుల జీవనోపాధిని మరింత మెరుగుపరచవచ్చని నివేదికలో తెలిపింది. మన ప్రాంతానికి వలసజాతే..! మన ప్రాంతానికి వలసవచ్చిన చీపురు గడ్డి జాతులను వృక్షశాస్త్రంలో ‘థైసనోలెనా మాక్సిమా’, ‘థైసనోలెనా లాటిఫోలియా’గా పిలుస్తారు. ఈ తరహా గడ్డి జాతులు హిమాలయాల్లోని ఎత్తయిన ప్రాంతాలు, తూర్పు కనుమల్లో ఎక్కువగా పెరుగుతాయి. మేఘాలయ, అస్సోం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం, పశి్చమ బెంగాల్లో ఈ గడ్డి జాతులు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతంలోని అనంతగిరి, అరకు, డుంబ్రిగూడ, హుకుంపేట, పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు, సీతంపేట, భామిని, కొత్తూరు, కుమారాడ, కురుపాం, గుమ్మ లక్ష్మీపురం, పార్వతీపురం, సాలూరు, మక్కువ, పాచిపెంట తదితర మండలాల పరిధిలో ఈ చీపురు గడ్డి సాగు ద్వారా వేలాది మంది గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. ఎకరాకు రూ.50 వేలకు పైగా ఆదాయం ఎటువంటి సాగుకు ఉపయోగించని భూములను చీపురు గడ్డి పెంపకానికి గిరిజనులు వినియోగిస్తున్నారు. ఒక్కో చీపురును కనీసం రూ.35 నుంచి రూ.70 వరకు అమ్ముతుంటారు. ఒక ఎకరాలో చీపురు గడ్డి సాగు చేసిన గిరిజన కుటుంబానికి ఎకరాకు కనీసం రూ.50 వేల ఆదాయం వస్తోంది. చీపురు సాగు, చీపురు నేసే పద్ధతి తదితరాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే వారి జీవనోపాధిని మరింత మెరుగుపరచవచ్చని ఆంధ్రప్రదేశ్ గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణా సంస్థ నివేదికలో స్పష్టం చేసింది.ఒకసారి నాటితే.. ఇరవై ఏళ్లకు పైగా ఆదాయం ఎత్తయిన కొండవాలు ప్రాంతాలు ఈ చీపురు గడ్డి సాగుకు అనుకూలం. సముద్ర మట్టానికి కనీసం 1,500 అడుగుల నుంచి గరిష్టంగా 5 వేల అడుగుల ఎత్తులో ఉండే అటవీ భూములు ఈ గడ్డి సాగుకు దోహదం చేస్తున్నాయి. ఐదు అడుగుల నుంచి 12 అడుగుల ఎత్తు వరకు పెరిగే ఈ చీపురు గడ్డి సాగు వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఏళ్ల తరబడి బీడు వారిన పోడు భూములు వినియోగంలోకి వస్తున్నాయి. భూమి కోతను నివారించడంతో పాటు భూసారాన్ని కూడా కాపాడుతోంది. అలాగే ఈ గడ్డి సాగు పర్యావరణ హితంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా గిరిజనుల ఉపాధికి ఊతమిస్తోంది.హుకుంపేట, పెదబయలు, సీతంపేట, మారేడుమిల్లి తదితర మండలాల్లోని ఆర్వోఎఫ్ఆర్ పట్టా భూములు, అటవీ పోడు భూముల్లో సాగవుతున్న చీపురు గడ్డిపై ఏపీ గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ అధ్యయనం చేసింది. ఈ సాగు ద్వారా ఆ మండలాల్లోని పలు గ్రామాల్లో 232 ఎకరాల్లో 300కు పైగా గిరిజన కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని తెలిపింది. ముఖ్యంగా అత్యంత బలహీన గిరిజన సమూహాలు(పీవీటీజీ)లకు చెందిన మూక దొర, బగత, కొండ దొర, సవర, కొండ రెడ్డి వంటి తెగలు ఉపాధి పొందుతున్నాయని నివేదికలో పేర్కొంది. కొండ చీపురుకు ఉపయోగించే గడ్డి రకాలను ఒకసారి నాటితే 20 ఏళ్లకుపైగా స్థిరమైన ఆదాయం లభిస్తుందని తెలిపింది. -
వావ్ ఏంటీ అద్భుతం... ఆకాశంలో హ్యారీపాటర్సినిమాలో మాదిరి ఎగురుతోంది!!
ఒక్కోసారి మనకు రకరకాల ఆకృతిలో ఆకాశంలోని మబ్బులు కనిపిస్తాయి. అవి చూడంగానే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక్కొసారి ఆకాశంలో అరుదైన దృశ్యాలు కనిపిస్తాయి. పైగా వాటిని కెమరాలో బంధించే లోపే అవి దృశ్యమైపోతాయి. మనం పొరపడ్డామేమో అనిపించేలాంటి కొన్ని విచిత్ర దృశ్యాలు చూసిన అనుభవం కొద్దిమందికి ఎదురై ఉంటుంది. అలాగే ఇక్కడొక మనిషికి అలాంటి సంఘటన ఎదురైంది. కాకపోతే అతను దాన్ని కెమరాలో బంధించి మరి చూపిస్తున్నాడు. ఇపుడు దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: అమెరికా జర్నలిస్ట్‌కి 11 ఏళ్లు జైలు శిక్ష) అసలు విషయంలోకెళ్లితే...యూఎస్‌లో నివసిస్తున్న లూకా అనే ఒక డెలివరీ డ్రైవర్ ఆకాశంలో తేలియాడే ఒక చెక్ చీపురుని చూస్తాడు. దీంతో అతను ఒక్కసారిగా షాక్‌కి గురవుతాడు. పైగా ఆ చీపురికి ఎవరైన తాడు కట్టి అలా ఎగిరేలా చేస్తున్నారా అని కూడా పరిశీలనగా చూస్తాడు. కానీ అది మాములుగానే మాయద్వీపం, అల్లావుద్దీన్ అద్భుతం దీపం, హ్యారీపాటర్ వంటి సినిమాల్లో మాదిరి అదృశ్య వస్త్రంలా ఎగురుతుంది. పైగా దాన్ని వీడియోలో బంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తాడు. దీంతో నెటిజన్లు ఏంటి మాయా దృశ్యం అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: నువ్వే స్టెప్ వేస్తే అదే స్టెప్ వేస్తా!!:వైరల్ అవుతున్న క్యూట్ వీడియో) -
ఎమ్మెల్యేలకు చీపురుకట్టల బహుమానం
చూడచక్కని ప్యాకింగ్‌లో ఆకర్షణీయమైన గిఫ్ట్ బాక్సులు.. ఒక్కో ఎమ్మెల్యేకి వరుసగా పంచారు. అందులో ఏముందోనని ఆత్రంగా తెరిచి చూసిన ఎమ్మెల్యేలకు ఒక్కసారిగా దిమ్మతిరిగింది! ఒక్కో బాక్సులో ఒక చీపురు కట్ట.. ఒక పెన్ను.. వాటితోపాటు ఓ సుదీర్ఘ లేఖ! ఇవి పంచిపెట్టింది ఎవరోకాదు.. తన చర్యలు, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్ మంత్రి ఆజంఖాన్! ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా శనివారం ఆయన ఈ చీపుర్ల పంచుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. 'సమాజానికి పట్టిన జాఢ్యాన్ని వదిలించడానికి చీపురు పనికొస్తుందో, కలం పనికొస్తుందో మీరే డిసైడ్ చేసుకోండి.. దానికి అనుగుణంగా నేను ఇచ్చిన బహుమతుల్లో ఒకదానిని వాడండి' అంటూ లేఖలో పేర్కొన్నాడు ఆజాంఖాన్. స్వచ్ఛభారత్‌పై తరచూ సెటైర్లు వేసే ఆయన.. ప్రధాని మోదీ.. జనం చేతుల్లో చీపుర్లు పెట్టి ఆయధాల్లాంటి కలాల్ని లాక్కుంటున్నారని మండిపడ్డారు. అయితే ఆజంఖాన్ చీపుర్ల పంపకం సమాజ్ వాదీ, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగానే జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. -
చీపురు కట్ట ఏకంగా రూ.200
న్యూఢిల్లీ : 'ఆప్' సునామీతో మంగళవారం ఢిల్లీలో 'చీపురు కట్ట'ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పార్టీ గుర్తు అయిన 'జాడూ' చేతిలో పట్టుకొని సంబురాల్లో పాల్గొందామని ఆప్ శ్రేణులు వాటిని కొనడానికి ఎగబడ్డారు. దాంతో దుకాణదారులు ఈ గిరాకీని ఊహించి తగినన్ని చీపురుకట్టలు స్టాక్ పెట్టినా.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. సాధారణంగా రూ.30 నుంచి రూ.50 దాకా పలికే చీపురు కట్ట మంగళవారం ఏకంగా రూ. 200 పలికిందట. అయితే అంత ధర పెట్టడానికి సిద్ధమైనా దొరకకపోవడంతో కొన్నిచోట్ల ఆప్ అభిమానులు ఊసురుమన్నారు. -
బాల్యం బందీ
విధి.. ఊహ తెలియని వయసులోనే అమ్మానాన్నలను దూరం చేసింది. అందరూ ఉన్నా అనాథగా మిగిల్చింది. పలకాబలపం పట్టాల్సిన ఆ చిట్టిచేతులతో చీపురును పట్టి పాచిపనులు చేసింది. పొద్దస్తమానం పనిచేస్తే మూడుపూటల పట్టెడన్నం చాలనుకుంది. ఆకలి కోసం ఆ పసిహృదయం క్షోభకు గురైంది. పనిలో కుదుర్చుకున్న యజమానులు చిత్రహంసలకు గురిచేసినా చిలుకలా పంజరంలోనే బందీగా మారింది. బయటికెళ్తే చంపుతానని బెదిరిస్తే బిక్కుబిక్కుమంటూ కాలం గడిపింది. ఎలాగోలా వారి చెరవీడి పోలీసుల చెంతకు చేరింది. సీఐ చొరతో బాలసదన్‌కు చేరింది. షాద్‌నగర్ రూరల్: ఆడిపాడి చదువుల ఒడిలో సేదతీరాల్సిన ఓ చిట్టితల్లిని ఇంటి యజమానులు బంధించారు. బయటి ప్రపంచాన్ని చూడకుండా చేసింది. ఉదంతం మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి కథనం మేరకు.. పోమాలపల్లి గ్రామానికి చెందిన జంగయ్య, రాములుమ్మకు ఒక్కగానొక్క కూతురు మహాలక్ష్మి(12). చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. మూడేళ్లక్రితం పక్షవాతంలో తల్లి మృతి చెందింది. దీంతో మహాలక్ష్మి అనాథగా మారింది. చిన్నారిలో చదువుకోవాలనే తపనను గ్రహించిన పాఠశాల ఉపాధ్యాయుడు మహాలక్ష్మిని వసతిగృహంలో చేర్పించాడు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ షాద్‌నగర్‌లోని విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న దమయంతి, జయకిషన్ ఇంట్లో పనిచేయడానికి బేరం కుదిర్చింది. ఇంట్లో అన్ని పనులు చేస్తున్నప్పటికీ ఆ యజమానులు ఆ చిన్నారిని చిత్రహింసలకు చేసింది. వారు బయటకు వెళ్లే సమయంలో ఆ చిన్నారిని ఇంట్లోనే ఉంచి బయటనుండి తాళంవేసుకుని వెళ్లేవారు. పస్తులుండకుండా మూడుపూటల పట్టెడన్నం దొరికెతే చాలనుకున్న ఆ చిన్నారికి రోజుకు ఒకపూట మాత్రమే అన్నంపెట్టి పనిచేయించుకునేవారు. ఇక్కడి విషయాలు బయటకు చెప్పినా నిన్ను చంపుతామని బెదిరించేవారు. శనివారం రాత్రి ఎలాగైనా ఇక్కడనుండి తప్పించుకోవాలనే ప్రయత్నం చేసింది. అక్కడినుండి తప్పించుకున్న మహాలక్ష్మి రాత్రి 9గంటల సమయంలో పటేల్‌రోడ్‌లో ఉన్న తన బంధువుల వద్దకు వెళ్లింది. తీరా అక్కడకు వెళ్లాక బంధువులు నెలరోజుల క్రితమే ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయారని తెలిసింది. చిరిగిన బట్టలతో వెళ్తున్న మహాలక్ష్మిని కాలనీకి చెందిన లక్ష్మి అనే మహిళ చేరదీసింది. ఆదివారం లక్ష్మి అసలు విషయం బయటకు చెప్పింది. విషయం తెలుసుకున్న షాద్‌నగర్ పట్టణ సీఐ నిర్మల ఆ చిన్నారిని చేరదీసి.. జిల్లాకేంద్రంలోని బాలసదన్‌లో చేర్పించారు. ఈ విషయాన్ని కార్మికశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. -
సచిన్ ‘ఊడ్చేశాడు’!
బాంద్రా... ముంబైలోని అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ప్రాంతం. ఎంతో మంది ప్రముఖులు, ధనవంతులకు నిలయం. అలాంటి ప్రదేశంలో కూడా భరించలేని దుర్గంధంతో కూడిన ఓ ఫుట్‌పాత్. నిత్యం వేలాది మంది ఆ పక్క నుంచే ప్రయాణిస్తున్నా కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ చూపిన చొరవతో ఒకే ఒక్క రోజులో ఆ ఫుట్‌పాత్ సుందరంగా తయారైంది. అసలు ఇది ఎలా సాధ్యమైందంటారా...! అయితే చదవండి...మరి ముంబై: అప్పుడప్పుడే తెల్లవారుతోంది... తెల్లటి టీ షర్టు ధరించిన ఓ వ్యక్తి.. కొంత మందితో కలసి చేతుల్లో చీపురు కట్టలు, గునపాలు, గంపలతో బాంద్రా బస్ డిపోకు వ్యతిరేకంగా ఉన్న ఫుట్‌పాత్ దగ్గరకు వచ్చాడు.ఎక్కడ చూసినా చెత్త, కవర్లు, ఎండిన ఆకులు, ఆలములతో భరించలేని వాసన... కనీసం నిలబడటానికి కూడా వీల్లేని ఆ ప్రాంతం ఓ చిన్నసైజ్ మురికి గుంటలా ఉంది. చాలా మంది మూత్ర విసర్జనకు నిలయంగా మార్చుకున్న ఆ ప్రాంతాన్ని ఆ వ్యక్తి నెమ్మదిగా శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. అలా ఓ గంట గడిచింది... అక్కడ జరుగుతున్న పనిని నిశితంగా గమనిస్తున్న కొంత మంది రిక్షా కార్మికులు అతని చూసి ఆశ్చర్యపోయారు. బ్యాట్ పట్టిన చేతులతో సచిన్ చీపురుతో ఊడ్చేస్తున్నాడు. ఇంకేముంది మాస్టర్‌తోనే తాము అన్నట్లు వాళ్లు కూడా పనిలోకి దిగారు. అందరూ కలిసి రెండు గంటలు గట్టిగా శ్రమించారు. కానీ సగం కూడా క్లీన్ కాలేదు. తర్వాతి రోజు ఉదయం వచ్చి చూస్తే ఫుట్‌పాత్‌పై మళ్లీ చెత్త చెదారం. దీంతో కాస్త కోపం వచ్చినా.. దీన్ని అధిగమించడమే నిజమైన సవాలని మాస్టర్ తన పనిని కొనసాగించాడు. అంతే కొన్ని గంటల పాటు శ్రమించి ఫుట్‌పాత్‌ను శుభ్రం చేశారు. స్థానిక కార్పొరేటర్‌తో కలిసి గోడకు, ఫుట్‌పాత్‌కు పెయింటింగ్ వేశారు. ఫుట్‌పాత్‌పై చెట్లు నాటించడంతో పాటు, బెంచ్‌లు, సోలార్ లైట్ల బాధ్యతను కార్పొరేటర్ తీసుకుంటే... ముంబై పోలీసులు అక్కడ అక్రమ పార్కింగ్‌కు అరికట్టేందుకు ముందుకు వచ్చారు. ఓవరాల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘స్వచ్ఛ్ భారత్’ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సచిన్ దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో ఉంచాడు. అంతేకాదు. జహీర్, సైనా, సర్దార్ సింగ్, అతుల్ రనాడే, అతుల్ కస్బేకర్లను కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగం కావాలని కోరాడు. అందరూ ఈ వీడియోను చూడాలని విజ్ఞప్తి చేశాడు. -
త్వరలో చీపురు పట్టనున్న సానియా మీర్జా
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా త్వరలో చీపురు పట్టనుంది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా రిలయన్స్ గ్రూపు అధినేత అనీల్ అంబానీ ఆహ్వానాన్ని ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ అనీల్ అంబానీ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని, త్వరలో సమయం చూసుకుని డబ్ల్యూటీఏ చాంపియన్ షిప్‌కు వెళ్లేలోపే స్వచ్ఛ భారత్‌లో పాల్గొంటానని తెలిపింది. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాంధీ జయంతి రోజున "స్వచ్ఛ భారత్'ను ప్రారంభిస్తూ.. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా తొమ్మిది మంది ప్రముఖులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వారిలో అనిల్ అంబానీ కూడా ఉన్నారు. మోడీ పిలుపు మేరకు అనిల్ బుధవారం తన స్నేహితులతో కలిసి ముంబయి చర్చి గేట్ ముందు పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా మరో తొమ్మిదిమంది ప్రముఖులకు ఆహ్వానం పలికారు. వారిలో సానియాతో పాటు టాలీవుడ్ హీరో నాగార్జున కూడా ఉన్నారు. -
చీపురు పట్టిన అనిల్ అంబానీ
ముంబై: రిలయన్స్ గ్రూపు అధినేత అనిల్ అంబానీ చీపురు పట్టారు. ముంబైలోని చర్చి గేట్ రైల్వే స్టేషన్ ముందు చెత్తాచెదారాన్ని ఉడ్చారు. తన బాటలో నడవాల్సిందిగా బాక్సర్ మేరీ కోమ్, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, టెన్నిస్ తార సానియా మిర్జా, తెలుగు సినీహీరో నాగార్జునతోపాటు మొత్తం తొమ్మిది మందిని ఆహ్వానించారు. ప్రధాని నరేంద్రమోదీ గాంధీ జయంతి రోజున ‘స్వచ్ఛ భారత్’లో పాల్గొనాల్సిందిగా తొమ్మిది మంది ప్రముఖులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వారిలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు సల్మాన్‌ఖాన్, ప్రియాంకచోప్రా తదితరులతోపాటు అనిల్ అంబానీ కూడా ఉన్నారు. ప్రధాని పిలుపు మేరకు బుధవారం అనిల్.. తన స్నేహితులతో కలిసి చర్చి గేట్ ముందు పరిసరాలను శుభ్రపరిచారు. తన ఆహ్వానం మేరకు స్వచ్ఛ భారత్‌లో పాలుపంచుకున్న అనిల్ అంబానీని ప్రధాని మోదీ తన బ్లాగ్‌లో అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా అనిల్ అంబానీ ఆహ్వానించిన తొమ్మిది మంది ప్రముఖుల్లో ప్రముఖ రచయిత్రి శోభా డే, జర్నలిస్టు శేఖర్ గుప్తా, గేయ రచయిత ప్రసూన్ జోషి, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, రన్నర్స్ క్లబ్ సభ్యులు ఉన్నారు. -
నాగార్జున, సానియాకు అనీల్ అంబానీ ఆహ్వానం
ముంబయి : రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనీల్ అంబానీ చీపురు పట్టారు. ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ పిలుపు మేరకు ఆయన బుధవారం ఉదయం ముంబాయిలోని చర్చ్ గేట్ స్టేషన్ బయట చీపురు పట్టి శుభ్రం చేశారు. అనంతరం అనీల్ అంబానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని పలువురు సెలెబ్రెటీలకు సవాల్ విసిరారు. మేరీ కోమ్, అమితాబ్ బచ్చన్, సానియా మీర్జా, శోభా డే, ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా, పాటల రచయిత ప్రషన్ జోషి, హృతిక్ రోషన్, టాలీవుడ్ హీరో నాగార్జునలతో పాటు రన్నర్స్ క్లబ్ ఆఫ్ ఇండియాను ఆయన ఆహ్వానించారు. స్వచ్ఛ భారత్ పథకం విజయవంతమయ్యేందుకు అంకితభావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా అనీల్ చెప్పారు. మరోవైపు అనీల్ అంబానీని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనటాన్ని మోడీ ప్రశంసించారు. అనీల్ అంబానీ, ఇతరులతో కలిసి చర్చ్‌గేట్ స్టేషన్ వద్ద పరిశుభ్రం చేయటం మంచి ప్రయత్నమని ఆయన ట్విట్ చేశారు. కాగా అక్టోబర్ 2వ తేదీన మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తొమ్మిదిమంది ప్రముఖలకు ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. ఆ తొమ్మిదిమంది ప్రముఖుల్లో అనీల్ అంబానీ ఉన్నారు. -
ఆదర్శంగా నిలిచిన సచిన్ టెండుల్కర్
భారత క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండుల్కర్ మరోసారి ఆదర్శం చాటుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపుకు స్పందించారు. స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగస్వామి అయ్యారు. ముంబైలో స్వయంగా చీపురు పట్టి వీధులను శుభ్రం చేశారు. పరిశుభ్ర భారతావని ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్న ఉద్దేశంతో పలు రంగాల్లోని తొమ్మిది మంది ప్రముఖులకు ప్రధాని ఆహ్వానం పలికారు. అలాగే ఆ ప్రముఖుల్లో ఒక్కొక్కరూ మరో తొమ్మిదేసి మందిని ఈ ప్రచారంలో పాల్గొనాల్సిందిగా కోరాలని సూచించారు. తద్వారా ఈ గొలుసుకట్టు ప్రచారం నిరంతరాయంగా కొనసాగుతుందన్నది మోదీ ఆలోచన. మోదీ ఎంపిక చేసిన 9 మంది ప్రముఖుల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్, నటులు కమల్‌హాసన్, సల్మాన్‌ఖాన్, ప్రియాంకా చోప్రా, గోవా గవర్నర్ మృదుల సిన్హా, ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తోపాటు తారక్ మెహతా కా ఉల్టా చష్మా టీవీ సీరియల్ బృందం ఉంది. మోదీ పిలుపుకు అందరూ స్పందించారు. స్వచ్ఛ భారత్ ప్రచార ఉద్యమానికి తాను అంకితం అవుతానని రిలయెన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ తెలిపారు. ఈ ఉద్యమంలో ప్రభుత్వం తనను ప్రచారకర్తగా (బ్రాండ్ అంబాసిడర్) నియమిస్తే సంతోషిస్తానని బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ చెప్పారు. ప్రధాని ఛాలెంజ్‌ని స్వీకరిస్తున్నట్లు ప్రియాంకా చోప్రా తెలిపారు. ఈ కార్యక్రమానికి తమ సహాయసహకారాలు అందించవలసిందిగా తన అభిమానులను కూడా ఆమె ప్రోత్సహించారు. అయితే ఈ తొమ్మిది మందిలో సచిన్ టెండుల్కర్ ఆచరణలో ప్రథమంగా స్పందించారు. ఉదయాన్నే నాలుగున్నర గంటలకు నిద్ర లేచారు. తన స్నేహితులతో కలిసి ముంబై వీధులను శుభ్రం చేసే పనిలో పడ్డారు. స్వయంగా చీపురుపట్టి ఊడ్చారు. ప్రధాని మోదీ చెప్పినట్లుగానే మరో 9 మందిని నామినేట్ చేశారు. అంతేకాకుండా తాను చేపట్టిన పరిశుభ్రతా ఉద్యమ దృశ్యాలను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీనికి అనూహ్య స్పందన లభించింది. దేశం అంతా పరిశుభ్రమయ్యేవరకూ నిద్రపోనని టెండుల్కర్ శపథం చేశారు. స్వచ్ఛ భారత్ కోసం మోదీ ఇచ్చిన పిలుపు తనకు స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. ఈ ఉద్యమం కొనసాగిస్తామని సచిన్ అన్నారు. ** -
చీపురు @ 50!
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయాల్లోని ‘చెత్త’ను ఊడ్చేసేందుకు తాను సిద్ధమని చీపురు సగర్వంగా చెప్పుకుంటోంది. చెత్తను ఊడ్చేందుకు వాడే చీపురును చీదరించుకుని చిన్నచూపు చూసే వారంతా ఇప్పుడు దాన్ని ఓ ఆయుధంగా మలచుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండడంతో ఢిల్లీలో చీపుర్లకు క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం నగరంలో ఒక్కసారిగా చీపుర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. శనివారం జరగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళ్లే ఆప్ కార్యకర్తలు, అభిమానులు వందల్లో చీపుర్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో చీపుర్లు దొరకని పరిస్థితి నెలకొంది. బురాడీలోని నత్త్పుర మెయిన్ బజార్‌కి చెందిన వ్యాపారి రాంలాల్ మాట్లాడుతూ.. ఉదయం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు చీపుర్లు కొంటున్నారు. ఇప్పటికి మూడుసార్లు గోదాం నుంచి తెప్పించాం. మా దగ్గర ఉన్న చీపుర్లన్నీ అయిపోయాయి. ఢిల్లీలోని భజన్‌పుర, రాజోరితోపాటు నార్త్ఈస్ట్ ఢిల్లీలో అన్ని దుకాణాల్లో చీపుర్లు అయిపోయాయని చెబుతున్నార’ని అన్నారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లేందుకు చీపుర్లు కొంటున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త హర్పాల్ రాణా తెలిపారు. అయితే కొనుగోళ్లు పెరగడంతో రూ.20కి లభించే పొరక(పుల్లలపొరక)ల ధరల అమాంతం రూ.50కి పెరిగింది. మెత్తటి పొరకలు రూ.50 నుంచి 70 వరకు పలుకుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తుగా మారడంతో పొరకకు ప్రత్యేక గుర్తింపు వచ్చిదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.