సచిన్ ‘ఊడ్చేశాడు’! | PM Narendra Modi Hails Sachin Tendulkar's Effort for 'Swachh Bharat' | Sakshi
Sakshi News home page

సచిన్ ‘ఊడ్చేశాడు’!

Published Fri, Oct 10 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM

సచిన్ ‘ఊడ్చేశాడు’!

సచిన్ ‘ఊడ్చేశాడు’!

బాంద్రా... ముంబైలోని అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ప్రాంతం. ఎంతో మంది ప్రముఖులు, ధనవంతులకు నిలయం. అలాంటి ప్రదేశంలో కూడా భరించలేని దుర్గంధంతో కూడిన ఓ ఫుట్‌పాత్. నిత్యం వేలాది మంది ఆ పక్క నుంచే ప్రయాణిస్తున్నా కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ చూపిన చొరవతో ఒకే ఒక్క రోజులో ఆ ఫుట్‌పాత్ సుందరంగా తయారైంది. అసలు ఇది ఎలా సాధ్యమైందంటారా...! అయితే చదవండి...మరి

ముంబై: అప్పుడప్పుడే తెల్లవారుతోంది... తెల్లటి టీ షర్టు ధరించిన ఓ వ్యక్తి.. కొంత మందితో కలసి చేతుల్లో చీపురు కట్టలు, గునపాలు, గంపలతో బాంద్రా బస్ డిపోకు వ్యతిరేకంగా ఉన్న ఫుట్‌పాత్ దగ్గరకు వచ్చాడు.ఎక్కడ చూసినా చెత్త, కవర్లు, ఎండిన ఆకులు, ఆలములతో భరించలేని వాసన... కనీసం నిలబడటానికి కూడా వీల్లేని ఆ ప్రాంతం ఓ చిన్నసైజ్ మురికి గుంటలా ఉంది. చాలా మంది మూత్ర విసర్జనకు నిలయంగా మార్చుకున్న ఆ ప్రాంతాన్ని ఆ వ్యక్తి నెమ్మదిగా శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. అలా ఓ గంట గడిచింది... అక్కడ జరుగుతున్న పనిని నిశితంగా గమనిస్తున్న కొంత మంది రిక్షా కార్మికులు అతని చూసి ఆశ్చర్యపోయారు.

బ్యాట్ పట్టిన చేతులతో సచిన్ చీపురుతో ఊడ్చేస్తున్నాడు. ఇంకేముంది మాస్టర్‌తోనే తాము అన్నట్లు వాళ్లు కూడా పనిలోకి దిగారు. అందరూ కలిసి రెండు గంటలు గట్టిగా శ్రమించారు. కానీ సగం కూడా క్లీన్ కాలేదు. తర్వాతి రోజు ఉదయం వచ్చి చూస్తే ఫుట్‌పాత్‌పై మళ్లీ చెత్త చెదారం. దీంతో కాస్త కోపం వచ్చినా.. దీన్ని అధిగమించడమే నిజమైన సవాలని మాస్టర్ తన పనిని కొనసాగించాడు. అంతే కొన్ని గంటల పాటు శ్రమించి ఫుట్‌పాత్‌ను శుభ్రం చేశారు. స్థానిక కార్పొరేటర్‌తో కలిసి గోడకు, ఫుట్‌పాత్‌కు పెయింటింగ్ వేశారు.

ఫుట్‌పాత్‌పై చెట్లు నాటించడంతో పాటు, బెంచ్‌లు, సోలార్ లైట్ల బాధ్యతను కార్పొరేటర్ తీసుకుంటే... ముంబై పోలీసులు అక్కడ అక్రమ పార్కింగ్‌కు అరికట్టేందుకు ముందుకు వచ్చారు. ఓవరాల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘స్వచ్ఛ్ భారత్’ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సచిన్ దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో ఉంచాడు. అంతేకాదు. జహీర్, సైనా, సర్దార్ సింగ్, అతుల్ రనాడే, అతుల్ కస్బేకర్‌లను కూడా ఇలాంటి కార్యక్రమాల్లో భాగం కావాలని కోరాడు. అందరూ ఈ వీడియోను చూడాలని విజ్ఞప్తి చేశాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement