ఆదర్శంగా నిలిచిన సచిన్ టెండుల్కర్
భారత క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండుల్కర్ మరోసారి ఆదర్శం చాటుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపుకు స్పందించారు. స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగస్వామి అయ్యారు. ముంబైలో స్వయంగా చీపురు పట్టి వీధులను శుభ్రం చేశారు. పరిశుభ్ర భారతావని ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్న ఉద్దేశంతో పలు రంగాల్లోని తొమ్మిది మంది ప్రముఖులకు ప్రధాని ఆహ్వానం పలికారు. అలాగే ఆ ప్రముఖుల్లో ఒక్కొక్కరూ మరో తొమ్మిదేసి మందిని ఈ ప్రచారంలో పాల్గొనాల్సిందిగా కోరాలని సూచించారు. తద్వారా ఈ గొలుసుకట్టు ప్రచారం నిరంతరాయంగా కొనసాగుతుందన్నది మోదీ ఆలోచన. మోదీ ఎంపిక చేసిన 9 మంది ప్రముఖుల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్, నటులు కమల్‌హాసన్, సల్మాన్‌ఖాన్, ప్రియాంకా చోప్రా, గోవా గవర్నర్ మృదుల సిన్హా, ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తోపాటు తారక్ మెహతా కా ఉల్టా చష్మా టీవీ సీరియల్ బృందం ఉంది.
మోదీ పిలుపుకు అందరూ స్పందించారు. స్వచ్ఛ భారత్ ప్రచార ఉద్యమానికి తాను అంకితం అవుతానని రిలయెన్స్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ తెలిపారు. ఈ ఉద్యమంలో ప్రభుత్వం తనను ప్రచారకర్తగా (బ్రాండ్ అంబాసిడర్) నియమిస్తే సంతోషిస్తానని బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ చెప్పారు. ప్రధాని ఛాలెంజ్ని స్వీకరిస్తున్నట్లు ప్రియాంకా చోప్రా తెలిపారు. ఈ కార్యక్రమానికి తమ సహాయసహకారాలు అందించవలసిందిగా తన అభిమానులను కూడా ఆమె ప్రోత్సహించారు.
అయితే ఈ తొమ్మిది మందిలో సచిన్ టెండుల్కర్ ఆచరణలో ప్రథమంగా స్పందించారు. ఉదయాన్నే నాలుగున్నర గంటలకు నిద్ర లేచారు. తన స్నేహితులతో కలిసి ముంబై వీధులను శుభ్రం చేసే పనిలో పడ్డారు. స్వయంగా చీపురుపట్టి ఊడ్చారు. ప్రధాని మోదీ చెప్పినట్లుగానే మరో 9 మందిని నామినేట్ చేశారు. అంతేకాకుండా తాను చేపట్టిన పరిశుభ్రతా ఉద్యమ దృశ్యాలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దీనికి అనూహ్య స్పందన లభించింది. దేశం అంతా పరిశుభ్రమయ్యేవరకూ నిద్రపోనని టెండుల్కర్ శపథం చేశారు. స్వచ్ఛ భారత్ కోసం మోదీ ఇచ్చిన పిలుపు తనకు స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. ఈ ఉద్యమం కొనసాగిస్తామని సచిన్ అన్నారు.
**