బాల్యం బందీ
విధి.. ఊహ తెలియని వయసులోనే అమ్మానాన్నలను దూరం చేసింది. అందరూ ఉన్నా అనాథగా మిగిల్చింది. పలకాబలపం పట్టాల్సిన ఆ చిట్టిచేతులతో చీపురును పట్టి పాచిపనులు చేసింది. పొద్దస్తమానం పనిచేస్తే మూడుపూటల పట్టెడన్నం చాలనుకుంది. ఆకలి కోసం ఆ పసిహృదయం క్షోభకు గురైంది.
పనిలో కుదుర్చుకున్న యజమానులు చిత్రహంసలకు గురిచేసినా చిలుకలా పంజరంలోనే బందీగా మారింది. బయటికెళ్తే చంపుతానని బెదిరిస్తే బిక్కుబిక్కుమంటూ కాలం గడిపింది. ఎలాగోలా వారి చెరవీడి పోలీసుల చెంతకు చేరింది. సీఐ చొరతో బాలసదన్‌కు చేరింది.
షాద్‌నగర్ రూరల్: ఆడిపాడి చదువుల ఒడిలో సేదతీరాల్సిన ఓ చిట్టితల్లిని ఇంటి యజమానులు బంధించారు. బయటి ప్రపంచాన్ని చూడకుండా చేసింది. ఉదంతం మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది.
బాధితురాలి కథనం మేరకు.. పోమాలపల్లి గ్రామానికి చెందిన జంగయ్య, రాములుమ్మకు ఒక్కగానొక్క కూతురు మహాలక్ష్మి(12). చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. మూడేళ్లక్రితం పక్షవాతంలో తల్లి మృతి చెందింది. దీంతో మహాలక్ష్మి అనాథగా మారింది. చిన్నారిలో చదువుకోవాలనే తపనను గ్రహించిన పాఠశాల ఉపాధ్యాయుడు మహాలక్ష్మిని వసతిగృహంలో చేర్పించాడు.
అదే గ్రామానికి చెందిన ఓ మహిళ షాద్‌నగర్‌లోని విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న దమయంతి, జయకిషన్ ఇంట్లో పనిచేయడానికి బేరం కుదిర్చింది. ఇంట్లో అన్ని పనులు చేస్తున్నప్పటికీ ఆ యజమానులు ఆ చిన్నారిని చిత్రహింసలకు చేసింది. వారు బయటకు వెళ్లే సమయంలో ఆ చిన్నారిని ఇంట్లోనే ఉంచి బయటనుండి తాళంవేసుకుని వెళ్లేవారు.
పస్తులుండకుండా మూడుపూటల పట్టెడన్నం దొరికెతే చాలనుకున్న ఆ చిన్నారికి రోజుకు ఒకపూట మాత్రమే అన్నంపెట్టి పనిచేయించుకునేవారు. ఇక్కడి విషయాలు బయటకు చెప్పినా నిన్ను చంపుతామని బెదిరించేవారు. శనివారం రాత్రి ఎలాగైనా ఇక్కడనుండి తప్పించుకోవాలనే ప్రయత్నం చేసింది. అక్కడినుండి తప్పించుకున్న మహాలక్ష్మి రాత్రి 9గంటల సమయంలో పటేల్‌రోడ్‌లో ఉన్న తన బంధువుల వద్దకు వెళ్లింది.
తీరా అక్కడకు వెళ్లాక బంధువులు నెలరోజుల క్రితమే ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయారని తెలిసింది. చిరిగిన బట్టలతో వెళ్తున్న మహాలక్ష్మిని కాలనీకి చెందిన లక్ష్మి అనే మహిళ చేరదీసింది. ఆదివారం లక్ష్మి అసలు విషయం బయటకు చెప్పింది. విషయం తెలుసుకున్న షాద్‌నగర్ పట్టణ సీఐ నిర్మల ఆ చిన్నారిని చేరదీసి.. జిల్లాకేంద్రంలోని బాలసదన్‌లో చేర్పించారు. ఈ విషయాన్ని కార్మికశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.