చీపురు @ 50!
Published Sat, Dec 28 2013 12:44 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయాల్లోని ‘చెత్త’ను ఊడ్చేసేందుకు తాను సిద్ధమని చీపురు సగర్వంగా చెప్పుకుంటోంది. చెత్తను ఊడ్చేందుకు వాడే చీపురును చీదరించుకుని చిన్నచూపు చూసే వారంతా ఇప్పుడు దాన్ని ఓ ఆయుధంగా మలచుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండడంతో ఢిల్లీలో చీపుర్లకు క్రేజ్ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం నగరంలో ఒక్కసారిగా చీపుర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. శనివారం జరగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళ్లే ఆప్ కార్యకర్తలు, అభిమానులు వందల్లో చీపుర్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో చీపుర్లు దొరకని పరిస్థితి నెలకొంది.
బురాడీలోని నత్త్‌పుర మెయిన్ బజార్‌కి చెందిన వ్యాపారి రాంలాల్ మాట్లాడుతూ.. ఉదయం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు చీపుర్లు కొంటున్నారు. ఇప్పటికి మూడుసార్లు గోదాం నుంచి తెప్పించాం. మా దగ్గర ఉన్న చీపుర్లన్నీ అయిపోయాయి. ఢిల్లీలోని భజన్‌పుర, రాజోరితోపాటు నార్త్‌ఈస్ట్ ఢిల్లీలో అన్ని దుకాణాల్లో చీపుర్లు అయిపోయాయని చెబుతున్నార’ని అన్నారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లేందుకు చీపుర్లు కొంటున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త హర్‌పాల్ రాణా తెలిపారు. అయితే కొనుగోళ్లు పెరగడంతో రూ.20కి లభించే పొరక(పుల్లలపొరక)ల ధరల అమాంతం రూ.50కి పెరిగింది. మెత్తటి పొరకలు రూ.50 నుంచి 70 వరకు పలుకుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తుగా మారడంతో పొరకకు ప్రత్యేక గుర్తింపు వచ్చిదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Advertisement