సాక్షి, హైదరాబాద్: సూక్ష్మస్థాయిలో పంటల సాగుపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. మండలాల్లో ఉన్న వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) పరిధి మేరకు ఉన్న క్లస్టర్లను ఆధారం చేసుకుని ఏ పంటలను ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలో అంచనా వేసే కసరత్తు మొదలైంది. ఈ మేరకు ఆ ప్రక్రియ పూర్తి చేసి సమగ్ర నివేదికివ్వాలని వ్యవసాయ శాఖ శుక్రవారం జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, మార్కెటింగ్ నిపుణులతో కలసి ఏ పంట ఏ జిల్లాలో ఎంత విస్తీర్ణంలో వేయాలనే దానిపై నివేదిక రూపొందించారు. దీనిపై ఇటీవల సీఎం కేసీఆర్ చర్చించి పలు మార్పులు చేశారు. ఆ ప్రకారం ఇప్పుడు క్లస్టర్ల వారీగా సాగు విస్తీర్ణం వివరాలను వ్యవసాయశాఖ సేకరిస్తుంది. ఆ మేరకు క్లస్టర్ల వారీగా పంటల సాగు వివరాలను ఏఈవోలు నివేదిస్తారు.
ఏ పంట ఎన్ని ఎకరాలు..
రాష్ట్రంలో 2,600 వరకు ఏఈవో స్థాయి క్లస్టర్లు ఉన్న విషయం విదితమే. ఒక్కో క్లస్టర్ పరిధిలో 5 వేల ఎకరాలున్నాయి. మొత్తంగా దాదాపు 1.30 కోట్ల ఎకరాలున్నట్లు అంచనా వేశారు. ఇప్పుడు ఆ మొత్తం విస్తీర్ణంలో ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారన్న దానిపై ఏఈవోలు సమాచారం సేకరిస్తారు. ఏఈవోలు సంబంధిత క్లస్టర్లలోని గ్రామాలకు వెళ్లి రైతులు వేసే పంటలు, వేయాల్సిన వాటిపై సమాచారం తీసుకుంటారు. అవసరమైతే వేయాల్సిన పంటలపై రైతులను ఒప్పిస్తారు.
గ్రామాల వారీగా పంటల సాగు విస్తీర్ణం, ఎన్ని ఎకరాల్లో ఏ పంటలు వేస్తారన్న దానిపై సూక్ష్మస్థాయి అంచనాకు వస్తారు. ఆ వివరాలను మండల స్థాయిలోనూ క్రోడీకరించి జిల్లా వ్యవసాయశాఖకు అందజేస్తారు. అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను ముందస్తుగా జిల్లాల వారీగా సిద్ధం చేసుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా పత్తి 61.24 లక్షల ఎకరాల నుంచి గరిష్టంగా 70 లక్షల ఎకరాలు అంచనా వేస్తున్నారు. కందులు 13 లక్షల ఎకరాల నుంచి 15 లక్షల ఎకరాలు, వరి 40 లక్షల ఎకరాల నుంచి 41 లక్షల ఎకరాలు, పెసర 1.98 లక్షల ఎకరాలుగా ఉంది. ఈ వానకాలంలో జొన్నలు 1.54 లక్షల ఎకరాలు, మినుములు 59 వేల ఎకరాలు, ఆముదం 92 వేల ఎకరాలు, వేరుశనగ 42 వేల ఎకరాల్లో సాగు చేసేలా ప్రతిపాదించారు.
రూ. 400 కోట్ల రుణమాఫీ..
ఇక రూ.25 వేల లోపున్న రైతుల రుణమాఫీ సొమ్ము జమ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 2 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.400 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. మొదటి విడతలో దాదాపు 6 లక్షల మంది రైతులకు రూ.25 వేల చొప్పున రూ.1,200 కోట్ల మాఫీ సొమ్మును జమ చేయాల్సి ఉంది. వారం రోజుల్లోపు మొదటి విడత రుణమాఫీ పూర్తి చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment