ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని రైతులు కొత్త సాగుబాట పట్టారు. సంప్రదాయ వరి పంటకు ప్రత్నామ్యాయంగా భిన్నరకాలను పండిస్తూ వ్యవసాయాన్ని పండుగ చేసుకుంటున్నారు. తమకున్న పొలంలో రకరకాల పంటమార్పిడులతో ప్రయోగాలు చేస్తున్నారు. చేతికందిన పంటకు తామే సొంతంగానే మార్కెటింగ్ చేసుకుంటూ లాభాలు గడిస్తున్నారు. పురుగుమందులు వాడకుండా సేంద్రియ పద్ధతులు అనుసరిస్తుండటంతో వీరి ఉత్పత్తులకు డిమాండ్ పలుకుతోంది.
కోదాడరూరల్: సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంటలో రైతు వెంకటేశ్వరావు ఎకరంలో మైసూర్ మల్లిక అనే దేశవాళి వరి రకాన్ని సాగుచేస్తున్నాడు. నాలుగేళ్లుగా సేంద్రియ పద్ధతిలో ఈ రకం వరితోపాటు, కూరగాయలు, ఆకుకూరలు, చెరకు కూడా పండిస్తున్నాడు. తన పొలంలో వచ్చిన ఉత్పత్తులను కోదాడ పట్టణంలో సొంతంగా దుకాణం పెట్టుకుని అమ్ముతున్నాడు. ఆయన ఉత్పత్తులు, పంటలపై వినియోగదారులకు కూడా నమ్మకం కలగడంతో వెంటనే అమ్ముడుబోతున్నాయి.
వెంకటేశ్వర్‌రావు జహీరాబాద్ నుంచి మైసూర్ మల్లిక విత్తనాలను తెప్పించి నారు పెంచాడు. పురుగు, దుక్కి మందులు వాడలేదు. అవసరమైనప్పుడు వేరుశనగ చెక్కను డ్రమ్ము నీటిలో నానబెట్టి దానిని బావిలో వదిలి ఆ నీటిని పంటకందించాడు. పైరు మూడు నుంచి మూడున్నర అడుగుల ఎత్తుకు పెరిగింది. ప్రస్తుతం వరి కోతకు వచ్చిందని దిగుబడి 20 బస్తాలు (14 – 15 క్వింటాళ్లు) వస్తుందని అంచనా. ఈ రకం బియ్యం కేజీ రూ.100 నుంచి రూ.120 వరకు అమ్ముడుబోతోంది.
ఎకరాకు 14–15 క్వింటాళ్ల దిగుబడి వస్తే.. వాటిని మిల్లుపట్టిస్తే క్వింటాకు 65 కేజీల బియ్యం వస్తాయి. అటుఇటుగా 10 క్వింటాళ్ల బియ్యం వస్తుంది. క్వింటా బియ్యం రూ.10వేల చొప్పున అమ్మినా రూ.లక్ష వస్తుందని, పెట్టుబడికి రూ.20 వేలు ఖర్చయినా.. రూ.80 వేల నికర ఆదాయం ఉంటుందని రైతు చెబుతున్నాడు. కాగా, ఈయన మరో రెండున్నర ఎకరాల్లో చెరకు సాగుచేస్తున్నాడు. దీన్ని తన షాప్‌లోనే జ్యూస్‌తీసి విక్రయిస్తున్నాడు. పంటల్లో తెగుళ్ల నివారణకు బియ్యం కడిగిన నీళ్లు, ఎర్రమట్టి నీళ్లు, పొగాకు కాడలు నానబెట్టి తీసిన నీళ్లు, అల్లం వెళ్లుల్లి పేస్ట్, నత్తల గవ్వలు కరగబెట్టిన నీటిని డ్రిప్ ద్వారా అందిస్తున్నాడు.
పల్లీసాగు తీరే వేరు
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం కోమటిపల్లికి చెందిన రైతుకు భూక్యా మోహన్‌నాయక్‌కు వేరుశనగ సాగు కలిసొచ్చింది. కోమటిపల్లిలో ఆయనకు మూడెకరాల పొలం ఉంది. ఏడాది నుంచి వరికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ వేస్తున్నాడు. ఆయన అనుసరించిన మేలైన సాగు విధానాలతో ఎకరాకు 5.50 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.
మూడెకరాల్లో ఖర్చులుపోను రూ.1.2 లక్షల వరకు మిగిలింది. ప్రస్తుతం మార్కెట్‌లో నూనెకు డిమాండ్ ఉన్నందున మళ్లీ ఈ పంటే వేశాడు. పల్లి క్వింటా రూ.6,190 నుంచి రూ.6,917 పలుకుతోందని, మూడు నెలల్లో పంట చేతికొస్తుందని, తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లాభాలు పొందొచ్చని మోహన్ అంటున్నాడు.
బొప్పాయి ‘పండు’గ
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచెలకకు చెందిన చెరుకూరి రామారావుకు వ్యవసాయంపై మక్కువ. ఈయన పదేళ్ల క్రితం నుంచే పండ్ల తోటలు, కూరగాయల పంటలు సాగుచేస్తున్నాడు. వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో కండక్టర్ ఉద్యోగాన్ని వదిలేసి 2005లో వారసత్వంగా వచ్చిన ఐదెకరాల్లో వరి, పత్తి, మిర్చి పంటలు సాగుచేశారు. ఆ తర్వాత తనకో ప్రత్యేకత ఉండాలని కూరగాయలు, పండ్ల తోటలను ఎంచుకున్నారు.
జామ, బొప్పాయి, అరటి, నిమ్మ, చెరకు, సీతాఫలం, పుచ్చ వంటి పంటలతో పాటు కూరగాయల పంటలు తీగజాతి పంటలు బీర, సొర, కాకర, బోడ కాకర, వంగ, బెండ, దోస వంటి అనేక పంటలతో మార్పిడి చేస్తూ సాగు చేస్తుంటారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడం మరో ప్రత్యేకత. వ్యవసాయంలో ఆదాయంతో ఐదెకరాల నుంచి నేడు 20 ఎకరాలకు ఎదిగారు. కాగా, ఆయన సాగుచేసే పంటల్లో బొప్పాయి ప్రత్యేకం. దీని సాగుకు ఎకరాకు లక్ష రూపాయలు ఖర్చవుతుండగా 30 టన్నుల దిగుబడి సాధిస్తూ రూ.3 లక్షల ఆదాయాన్ని పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment